మోడీ ఫాసిస్టు పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కులు, ప్రజా రక్షణకు మరో చారిత్రాత్మక పోరాటం నిర్వహించాల్సిన సమయం వచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. గతంలో ఎమర్జెన్సీకాలంలో నాయకులను జైళ్లలో పెట్టినప్పుడు, 1984లో ఎన్‌టిఆర్‌ను అప్రజాస్వామికంగా పదవీచ్యుతుడిని చేసినప్పుడు... ఇలా అనేక సందర్భాల్లో చారిత్రాత్మక ఉద్యమాలు ఆవిర్భవించాయని గుర్తుచేశారు. ఆదివారం విజయవాడలోని ఎంబి విజ్ఞానకేంద్రంలో సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా విస్త్రుతస్థాయి సమావేశం జరిగింది. ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వి శ్రీనివాసరావు మాట్లాడారు. ప్రజాసామ్య హక్కులను, ప్రజా ఉద్యమాలను రక్షించుకునేందుకు నవంబరు 7వ తేదీన ప్రజా రక్షణ భేరి ద్వారా సిపిఎం సన్నద్ధమైందన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతితో ప్రారంభమై నవంబర్ 7 సోవియట్ విప్లవ దినోత్సవం వరకు ఇది సాగుతుందన్నారు.
- నిఘా నీడలో దేశం
దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్య హక్కులు హరించివేయబడుతున్నాయని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాలపై దాడులు, నిర్బంధాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు పాలకులు నిఘా వ్యవస్థలను సైతం వినియోగించుకుంటున్నారని అన్నారు. హిట్లర్ కూడా తన నిఘా వ్యవస్థ ద్వారా మారణహోమం సఅష్టించాడని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థే ప్రమాదంలో పడిందన్నారు. రాష్ట్రాల హక్కులపై కేంద్రం దాడి చేస్తోందన్నారు. దీనికి ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంపై కేంద్రం పెత్తనమే నిదర్శనమన్నారు. ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ఇడి, సిబిఐ, ఐటి దాడుల ద్వారా విపక్ష నేతలను భయపెట్టడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో విస్తరణకు బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. పదేళ్ల క్రితం పార్లమెంట్‌కు వచ్చిన మహిళా బిల్లును సమర్థించని బిజెపి, ఇప్పుడు దానిని ఆమోదించి తన గొప్పగా చెప్పుకుని లబ్ధిపొందాలని చూస్తోందన్నారు. కానీ మహిళా చట్టాన్ని మాత్రం వెంటనే అమలు చేస్తామని చెప్పలేకపోతోందన్నారు. దీంతో ఈ చట్టం ఎప్పుడు అమలులోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. యువతరంలో ఉన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ప్రజల ఆలోచనను మూఢనమ్మకాల వైపు మళ్లిస్తోందన్నారు. మూఢనమ్మకాలను సాంకేతిక విజ్ఞానంతో మిళితం చేస్తోందన్నారు. మణిపూర్ ఘటనలు, రెజ్లర్ల ఆందోళనలపై నోరుమెదపని ప్రధాని మోడీ సనాతన ధర్మంపై ఉదయ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం ఆగమేఘాల మీదు విరుచుకుపడ్డారని అన్నారు. వివక్ష, అణచివేతకు ప్రతిరూపమే సనాతన ధర్మమన్నారు. కానీ బిజెపి సనాతన ధర్మం పేరుతో వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు మతాల మధ్య చిచ్చు రేపుతోందని విమర్శించారు. ప్రజాస్వామిక చట్టాలను ఉల్లంఘిస్తోందన్నారు. ఇండియా ఐక్య వేదికను చూసి ఓటిమోత మోగుతున్న బిజెపి చివరకు దేశం పేరునే మార్చడానికి సిద్ధమైందని విమర్శించారు.
- మోడీ వత్తాసుతోనే జగన్ పాలన
మోడీ వత్తాసుతోనే జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలపై భారాలు మోపుతూ అడ్డగోలు పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. మోడీని ఓడిస్తేనే రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి పాలన అంతమవుతుందని తెలుగుదేశం పార్టీ గుర్తించాలని అన్నారు. టిడిపి పతనమే బిజెపి లక్ష్యమన్న వాస్తవాన్ని గుర్తించకుండా టిడిపి మోడీ వెంటపడుతోందని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను బిజెపి మింగేసిందన్నారు. కేంద్రం వత్తిడికి తలగ్గిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై అనేక రూపాల్లో విద్యుత్ భారాలు మోపుతోందని విమర్శించారు. స్కిల్ స్కాం కేసులో బిజెపి సహకారం లేకుండా టిడిపి అధినేత చంద్రబాబును అరెస్టు చేసే పరిస్థితిలేదన్నారు. ఈ స్కాంపై ముందుగా ఉప్పందించిన బిజెపి ఆ తర్వాత తమకు సంబంధంలేనట్లుగా నటిస్తోందన్నారు.
- జగన్, అదానీ ఎందుకు కలిశారు?
తాటిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడ మేతకు అన్నట్టుగా ఉంది అదానీ, జగన్ కలయికపై వైసిపి స్పందన అని అన్నారు. అదానీ రహస్యంగా వచ్చి జగన్‌ను కలుసుకోవడంలో రాష్ట్ర వనరుల్ని, సంపదను కాజేయడానికేనని శ్రీనివాసరావు విమర్శించారు. దీనిపై జగన్ నోరు విప్పాలని, వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.
- నవంబరు 7న బహిరంగ సభకు జనసమీకరణ
ఈ సమావేశంలో సిపిఎం ఎన్‌టిఆర్ జిల్లా కార్యదర్శి డివి కఅష్ణ మాట్లాడుతూ నవంబరు 7వ తేదీన విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి బహిరంగ సభకు జన సమీకరణ చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకు ముందుగా అక్టోబర్ 28 నుంచి 31వ తేదీ వరకు నియోజకవర్గాల వారీగా ఏడు జాతాలు నిర్వహించాలన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో విస్తఅత ప్రచారం చేపట్టాలన్నారు. ఇందుకు పూర్తిస్థాయిలో కేంద్రీకరణ జరగాలన్నారు. ఆయా నియోజకవర్గాల్లో నెలకొన్న స్థానిక సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.