వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సదస్సు

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తితో దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ప్రజాస్వామ్య హక్కులు లేకపోతే ప్రజా ఉద్యమాలు ఉండవని, హక్కుల కోసం పోరాడే వారికి నష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారికోత్షవ సదస్సు విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో శనివారం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య హక్కుల కోసం, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, భూములపై హక్కుల కోసం తెలంగాణ సాయధ పోరాటం జరిగిందని చెప్పారు. నిజాం నవాబు పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఈ పోరాటం జరిగిందని తెలిపారు. పుచ్చలపల్లి సుందరయ్య, చాండ్ర రాజేశ్వరరావు, దేవులపల్లి వెంకట్రామయ్య వంటి వారు ఈ పోరాటానికి నాయకత్వం వహించారని చెప్పారు. హైదరాబాద్‌ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయకపోతే నిజాం నవాబుపై యుద్ధం చేసేందుకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం సైన్యంతో సిద్ధమైందన్నారు. తెలంగాణ పోరాటం ఒక పక్క, మరోపక్క ప్రభుత్వ సైన్యం రాకతో భయపడ్డ నవాబు హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేశారని వివరించారు. ఈ పోరాటంలో పాల్గొనని ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. హిందూ, ముస్లిముల మధ్య జరిగిన గొడవలుగా చిత్రీకరిస్తుందన్నారు. నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మొట్టమొదటిగా బలైంది ముస్లిం వ్యక్తి అని చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలవి ద్రోహపూరిత చరిత్ర అని, స్వాతంత్రోద్యమానికి, నిజాం వ్యతిరేక పోరాటానికి ద్రోహం చేశాయని విమర్శించారు. ఇప్పుడు ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు పరచకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో బిజెపి ఆడుతున్న నాటకంలో వైసిపి, టిడిపి, బిజెపి పాత్రధారులని విమర్శించారు. బిజెపి ఇచ్చిన రోడ్డు మ్యాప్‌లో నడుస్తున్నారని అన్నారు. మణిపూర్‌లో జరిగిన దాడులను, ఢిల్లీలో ముఖ్యమంత్రికి లేకుండా కేంద్రం చేసిన చట్టంపై ఈ పార్టీలు మాత్రం మాట్లాడటం లేదన్నారు. ఢిల్లీలో నిరంకుశంగా ఫాసిస్టు విధానాలతో వెళ్తున్న బిజెపిని కూడా ఎదిరించాలని కోరారు. ఢిల్లీలో నియంతృత్వాన్ని బలపరుస్తున్న టిడిపికి రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కావాలంటే ఎలా కుదురుతుందన్నారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు సనాతన ధర్మం వివాదాన్ని కేంద్రం తీసుకొస్తుందన్నారు. మనుధర్మ శాస్త్రాన్ని రుద్దేందుకు సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తుందని విమర్శించారు. సనాతన ధర్మంలో ఉన్న కుల వ్యవస్థ, స్త్రీలపై అణచివేతను నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని అన్నారు. బానిస, అనాగరిక, అటవిక వ్యవస్థలను పున: నిర్మించేందుకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నడుం కట్టాయని అన్నారు. వందల ఏళ్లపాటు పోరాడి సాధించుకున్న స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య హక్కులు, పౌర హక్కులు హరించుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణ పోరాట వారసత్వాన్ని కొనసాగించి, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జె జయరాం తదితరులు పాల్గొన్నారు.