అసమానతలు లేని అభివృద్ధి కోసం.. నవంబరు 7న భారీ బహిరంగసభ.. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

 

పార్టీ స్వతంత్ర ప్రజా పునాది పెంపునకు ప్రాధాన్యత

బిజెపిని బలపరచే పార్టీలతో కలవం 

కలిసొచ్చే బిజెపి వ్యతిరేక లౌకిక పార్టీలతో ఉమ్మడి కార్యాచరణ 

పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశంలో ప్రజా సమస్యలపై పలు తీర్మానాలు

అక్టోబరు 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, జాతాలు

 

అసమానతలు లేని అభివృద్ధికోసం నవంబరు 7వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, అక్టోబరు ఒకటి నుండి రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, జాతాలు నిర్వహించనున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. రెండురోజులపాటు జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, ప్రజా సమస్యలపై చేసిన తీర్మానాలను మీడియాకు వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిరదని తెలిపారు. ప్రజా సమస్యలు, భారాలు పెరుగుతున్నాయని వీటికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు. అలాగే మూడు ప్రాంతాల నుండి జాతాలు ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఒకటి శ్రీకాకుళం, మరొకటి పార్వతీపురం, మూడోది కర్నూలు నుండి ప్రారంభమవుతాయని చెప్పారు. అలాగే పార్టీ స్వతంత్ర ప్రజా పునాదిని పెంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో బిజెపిని బలపరిచే పార్టీలతో కలిసే ప్రసక్తే లేదని, కలిసొచ్చే బిజెపియేతర లౌకిక పార్టీలతో ఉమ్మడి కార్యాచరణ రూపొందించి ముందుకు వెళతామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని, ప్రజలు అల్లాడుతుంటే వారిని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. రిజర్వాయర్లలో నీళ్లు లేవని, రాయలసీమలో పంటలు ఎండిపోయాయని, కోస్తా ప్రాంతంలో నీరులేక ఎండిపోయేదశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన జలవనరులశాఖ మంత్రి నీరు ఇవ్వలేమని, ఆరుతడి పంటలు వేసుకోవాలని బాధ్యతారాహిత్యంగా ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలో వరికెపూడిశెల పూర్తిచేసి నీటిని అందించే అవకాశం ఉన్నా ఆ పని చేయడం లేదని మండిపడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల్లో రైతులకు పూర్తిగా ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించాలని, బ్యాంకు రుణాలనురద్దు చేయాలని కోరారు. లేనిపక్షంలో రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే కౌలు రైతులు రాష్ట్రంలో 33 లక్షల మంది ఉంటే లక్షలమందికి రుణాలు ఇచ్చి మొత్తం అందరికీ ఇచ్చామని చెప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మిగిలిన 32 లక్షల మంది ఏమైపోవాలని అన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రణాళిక ఇంతవరకు రూపొందించలేదని విమర్శించారు. 

 

కార్పొరేట్ల కోసమే ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు

 

కార్పొరేట్‌ సంస్థల కోసమే ఆన్‌లైన్‌ రిజస్ట్రేషన్లు పెట్టినట్లు ఉందని తెలిపారు. డాక్యుమెంటు ఒరిజినల్స్‌ ప్రభుత్వం దగ్గరే ఉంచుకుంటామని చెబుతున్నారని, మరి యజమానులు ఏమిచేయాలని ప్రశ్నించారు. ఒరిజినల్‌ దృవపత్రాలు ఉంటేనే రైతులు, యజమానులు హక్కుగా భావిస్తారని అది లేకుండా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఒకవైపు సామాన్య ప్రజలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయ ముందు బారులుతీరుతున్నారని, వారి సమస్య పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. కేవలం కార్పొరేట్లు కార్యాలయాల్లో కూర్చుని నేరుగా రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు వీలుగా కొత్త పద్ధతులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తొందరపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలి

 

రాష్ట్రంలో 56 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని, ప్రభుత్వం మాత్రం తొమ్మిది పోస్టులు మాత్రమేనని చెబుతోందని, వెంటనే డిఎస్‌సి ప్రకటించి వాటిని భర్తీ చేయాలని కోరారు. పాఠశాలలను కలిపేస్తూ పోస్టులు తగ్గిస్తూ ఖాళీలు లేవని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక డిఎస్‌సి ప్రకటించి అక్కడ కొన్ని సడలింపులిచ్చి పోస్టులు భర్తీ చేయాలని కోరారు.

 

సనాతన ధర్మం పేరుతో బెదిరింపులు

 

బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు సనాతన ధర్మం పేరుతో ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. సనాతన ధర్మంలో ప్రజలందరికీ భూమి ఉందని, అదే ధర్మాన్ని ఆచరిస్తున్నామని చెబుతున్న వారు ప్రజలకు భూములు ఇచ్చేస్తే తమకు అభ్యంతరం లేదని, ఒకవైపు భూములన్నీ కార్పొరేట్లకు కట్టబెడుతూ పైకి సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. కులతత్వాన్ని రెచ్చగొట్టడం, మతోన్మాదం, అగ్రకుల దురహంకారాన్ని రెచ్చగొట్టడమే సనాతన ధర్మమా అటువంటి దాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. స్త్రీలను అణచివేయడం సనాతనమా అని ప్రశ్నించారు. దీన్ని రాష్ట్రంలో వైసిపి ఖండిరచడం లేదని, టిడిపి నాయకులు నెత్తినేసుకున్నారని అన్నారు. లౌకికవాదాన్ని బలపరిచిన ఎన్‌టిఆర్‌ కుమార్తె పురంధేశ్వరి సనాతనం గురించి మాట్లాడటం అంటే ఎన్‌టిఆర్‌  ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని అన్నారు.

 

ప్రజా ఉద్యమాలపై నిర్బంధం

 

రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ప్రజా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తోందని గఫూర్‌ అన్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా అరెస్టులు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. పోలీసులు వ్యవస్థ అధికార యంత్రాంగంగా కాకుండా అధికార పార్టీ యంత్రాంగంగా మారిపోయిందని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, దీన్ని కనబడకుండా చేయాలనే పని పోలీసు వ్యవస్థ చేస్తోందని, ఇలాంటి ప్రభుత్వాలు మనుగడ సాగించిన దాఖలాలు లేవని అన్నారు. పాలకులు ఎల్లప్పుడూ అధికారంలో ఉండరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. 

 

పలు తీర్మానాలకు ఆమోదం

 

పార్టీ విస్తృత సమావేశంలో ఆమోదించిన తీర్మానాలను మీడియాకు విడదల చేశారు. వీటిల్లో కరువు సహాయక చర్యలు వెంటనే చేపట్టాలని, వ్యవసాయ రుణాలు రద్దుచేయాలని, డిఎస్‌సి తక్షణమే ప్రకటించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, అధిక ధరలు అరికట్టాలని, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని ప్రతిపాదించిన పలు తీర్మానాలను ఆమోదించినట్లు తెలిపారు. అలాగే విద్యుత్‌ సర్దుబాటు ఛార్జీలు రద్దుచేయాలని, స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు నిలిపేయాలని, కేంద్ర విద్యుత్‌ చట్టసవరణ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని, పోలవరం ప్రాజెకక్టు నిర్వాసితుల సమగ్ర పునరావాసం, ప్యాకేజీ అమలు చేసిన అనంతరమే ప్రాజెక్టు నిర్మాణం కొనసాగించాలని తీర్మానించినట్లు తెలిపారు. విశాఖ స్టీలు ప్లాంటు అమ్మకపు చర్యలు వెంటనే విరమించాలని, సెప్టెంబరు 20 నుండి 29 వరకు సిపిఎం నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర బైక్‌ యాత్రలో పాల్గొనాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలని తీర్మానించారు.