బిజెపిని బలపరచడం మానుకోండి-వైసిపి, టిడిపి, జనసేనలకు బి.వి రాఘవులు సూచన

సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశం ప్రారంభం
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చ

అభివృద్ధి నిరోధక, మతోన్మాద బిజెపిని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు బలపరచడాన్ని మానుకోవాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు సూచించారు. వడ్డేశ్వరంలోని సుందరయ్య స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రంలో రెండు రోజులపాటు జరిగే సిపిఎం రాష్ట్ర విస్తృత సమావేశాలను రాఘవులు బుధవారం ప్రారంభించారు. అంతకు ముందు పార్టీ పతాకాన్ని సీనియర్‌ నాయకులు పి.మధు ఆవిష్కరించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు జయరాం సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతినిధులు రెండు నిముషాలు మౌనం పాటించారు. అనంతరం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాకూడదనేది సిపిఎం ప్రధాన ఎజెండా అని అన్నారు. మోడీ అధికారంలోకి వస్తే దేశ భవిష్యత్‌ ప్రమాదంలో పడుతుందని చెప్పారు. దీనికి వ్యతిరేకంగా కలిసొచ్చే అన్ని వామపక్ష పార్టీలను కలుపుకుని దేశవ్యాప్తంగా విస్తృత పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే దేశంలో బిజెపి అభివృద్ధి నిరోధక భావజాలాన్ని రెచ్చగొడుతోందని, కులాలు, మతాలు, తెగల మధ్య వైషమ్యాలు పెంచుతోందన్నారు. మణిపూర్లో హింసను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టారన్నారు. బిజెపి విధానాలను అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ వేదిక ఇండియా పేరుతో ఏర్పాటైందని చెప్పారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజికన్యాయం, సమాఖ్యస్ఫూర్తి విషయంలో ఈ వేదికలోని పార్టీలు ఉమ్మడిగానే వ్యవహరిస్తున్నాయన్నారు. మరోవైపు బిజెపికి వరుస ఓటములు ఎదురవుతున్నాయని, కర్నాటకలో ఓటమితో బిజెపి ఆత్మవిశ్వాసం దెబ్బతిందని, ఎన్‌డిఏ కూటమి ప్రతిష్ట దెబ్బతింటోందని పేర్కొన్నారు. దాన్నండి బయటపడేందుకు అత్యవసర పార్లమెంటు సమావేశాలు, జమిలి ఎన్నికలు, జి20 సమావేశాల అంశాన్ని ముందు తెచ్చి తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటున్నారన్నారు. వీటితోపాటు మణిపూర్‌, డిల్లీ, హర్యానా, బీహార్‌, అస్సాం రాష్ట్రాల్లో మతోన్మాదదాడులను పెంచారన్నారు. వారణాసిలో జ్ఞానవాపి మసీదు వివాదాన్ని రగిల్చారని, ఇవన్నీ భవిష్యత్‌ ప్రమాదాన్ని సూచిస్తున్నాయని చెప్పారు. భారత్‌ పేరుతో ఆహ్వానాలు పంపి కొత్త చర్చను ముందుకు తెచ్చారని విమర్శించారు. పార్లమెంటు సమావేశాల్లోనూ ఏమి చర్చిస్తారనే విషయాన్ని బయటకు చెప్పడం లేదన్నారు. కార్పొరేట్‌ మీడియాను అడ్డుపెట్టుకుని తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటున్నారన్నారు. వీటిని అడ్డుకునేందుకు ఇండియా వేదికలో ఉన్న 28 పార్టీలు విస్తృతంగా చర్చిస్తున్నాయని తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌సిపి, టిడిపి, జనసేన వైఖరిలో మార్పులేకపోగా మరింత సన్నిహితమయ్యే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. జనసేన ఎన్‌డిఏలో భాగస్వామిగా ఉందని, బిజెపిని బలపర్చే విషయంలో ఈ మూడు పార్టీల్లో పెద్దగా తేడా లేదని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సిపిఎంను బలోపేతం చేసుకునే దిశగా విస్తృత ప్రజా ఉద్యమాలు నిర్మించాలని దిశానిర్దేశం చేశారు. బిజెపి వ్యతిరేక శక్తులను కూడగట్టేందుకు ప్రయత్నించాలని, పార్టీ స్వతంత్ర, ప్రజాపునాదిని మరింత బలోపేతం చేసుకోవాలన్నారు. పార్టీ కేంద్ర కమిటీ సూచనలకు అనుగుణంగా బిజెపిని వ్యతిరేకించే పార్టీలు, సంస్థలు, వ్యక్తులను గుర్తించి వారితో ఐక్య కార్యాచరణ చేపట్టాలని అన్నారు.

  • పార్టీ స్వతంత్ర ప్రజాపునాదిపెంపుకోసం కృషి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రంలో ప్రస్తుత ప్రజాసమస్యలు, ప్రజలపై భారాలు పెరిగిపోతున్నాయని, అవినీతి, అక్రమాలకు అంతే లేకుండా పోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. 2021 డిసెంబర్లో రాష్ట్ర మహాసభ అనంతరం జరిగిన అంశాలపై కార్యదర్శి నివేదికను ఆయన ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక, దోపిడీ విధానాలపై పోరాడుతూ పార్టీ స్వతంత్ర ప్రజా పునాదిని బలపరుచుకోవడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం తొలి నుండీ నికరంగా ప్రజల కోసం పోరాడుతోందని తెలిపారు. ఇసుక అక్రమాలు, భూముల దోపిడీ తదితర అంశాల్లో రాజీలేని పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. స్కీం వర్కర్లకు జరుగుతున్న అన్యాయంపైనా, కార్మికులకు చేస్తున్న ద్రోహంపైనా పోరాడుతున్న పార్టీ సిపిఎం మాత్రమేనని అన్నారు. ఈ కృషిలో వామపక్ష పార్టీలతో సహా కలిసి వచ్చే ఇతర లౌకిక పార్టీలను కలుపుకుని పనిచేస్తామని తెలిపారు. రాష్ట్రంలో వైసిపి టిడిపి రెండూ బిజెపికి వంతపాడుతున్నాయని, రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపి పల్లకి మోయడం దుర్మార్గమని విమర్శించారు. లౌకిక పార్టీ అని చెప్పుకునే పార్టీలు బిజెపి మతోన్మాదాన్ని ఎలా బలపరుస్తాయని ప్రశ్నించారు. వీరి వైఖరి దళితులకు, ఆదివాసీలకు మహిళలకు మైనార్టీలకు హాని చేస్తుందని తెలిపారు. మరోవైపు వైసిపి, తెలుగుదేశం పార్టీలు పరస్పరం వ్యక్తిగత విమర్శలకు పరిమితమయ్యాయని విమర్శించారు. రెండు పార్టీల నాయకులు పరస్పర దూషణలకు, బూతులకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజా సమస్యలపై నోరెత్తడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో దుర్భిక్షం పెరిగిందని అన్నారు. లోటువర్షపాతం వల్ల 14 జిల్లాల్లో 416 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, సాధారణసాగు 85.97 లక్షల ఎకరాలు కాగా ఆగస్టు నాటికి 47.90 లక్షల ఎకరాలు మాత్రమే సాగు అయిందని తెలిపారు. అసైన్ట్‌ చట్టసవరణ చేశారని, ఇది అన్యాక్రాంతమైన భూమలుకు చట్టబద్ధత కల్పించడమేనని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం పెరుగుతోందని అన్నారు. దీన్ని అధిగమించేందుకు యూనిట్‌ రూ.9.10 పైసలు చొప్పున కొనుగోలు చేస్తోందని తెలిపారు. విద్యుత్‌ ధరలు పెరిగిపోవడం వల్ల అనేక పరిశ్రమలు నష్టాలపాలు అవుతున్నాయని, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతవేసుకునే పరిస్థితి వస్తోందని తెలిపారు. ఉజ్వల గ్యాస్‌ పథకం ఐదు లక్షల మందికి వర్తింపజేశారని, అందరికీ వర్తింపజేయాలని అన్నారు. భవన నిర్మాణ రంగం దెబ్బతిందని, చేనేత రక్షణ కోసం పట్టు, నూలుపై జిఎస్‌టి ఎత్తివేయాలని అన్నారు. విశాఖ స్టీలు ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకునేందుకు పెద్దఎత్తున పోరాడుతున్నామని తెలిపారు. విద్యావైద్య రంగాల ప్రైవేటీకరణ విధానాల దుష్పలితాలు కనబడుతున్నాయని అన్నారు. స్థానికత పేరుతో నాలుగు జోన్లను ఆరుజోన్లుగా మార్చారని, ఏజెన్సీని వేర్వేరు జోన్లలో కలపడం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిపారు.

  • నవంబరు 7న బారీ బహిరంగ సభ

ప్రజాసంక్షేమం, అసమానతలు లేని అబివృద్ధి సామాజికన్యాయం అనే అంశాలపై సిపిఎం ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం, సభలతోపాటు మూడు రాజకీయ జాతాలను అక్టోబరు 21 నుండి నవంబరు మూడోతేదీ వరకూ నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వీటి ముగింపు సందర్భంగా నవంబరు 7వ తేదీన విజయవాడలో భారీ బహిరంగసభను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. అలాగే వ్యవసాయ సంక్షోభం, దళితులపై అత్యాచారాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, గిరిజన అభివృద్ధి, ప్రభుత్వ రంగ పరిరక్షణ, అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం, మహిళల భద్రత, ఉపాధి తదితర అంశాలపై వేర్వేరు ప్రాంతాల్లో రాష్ట్ర సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తొలుత విస్తృత సమావేశ నిర్వహణకు పలు కమిటీలను పార్టీ రాష్ట్రకార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రతిపాదించారు. అధ్యక్షవర్గంగా ఎం.ఏ.గఫూర్‌, కె.లోకనాధం, డి.రమాదేవి, బి.కిరణ్‌, తీర్మానాల కమిటీ సభ్యులుగా మంతెన సీతారాం, వి.రాంభూపాల్‌, దడాల సుబ్బారావు, బి.గంగారావు, ఎ.అశోక్‌, మినిట్స్‌ కమిటీ సభ్యులుగా కె.ధనలక్ష్మి, టి.అరుణ్‌, కె.మురళి, వై.రాము ఉన్నారు.