మోడీ మళ్లీ వస్తే చీకటి రాజ్యమే

 మోడీ మళ్లీ అధికారంలోకొస్తే దేశం చీకటి రాజ్యంగా మారనుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మోడీని గద్దె దించడానికి ఇండియా పేరుతో దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి, ప్రశ్నిస్తానని వచ్చిన జనసేన పార్టీ... బిజెపి పల్లకి మోయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన గత నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన సమరభేరి సోమవారం ముగిసింది. చివరి రోజు ఆయా తహశీల్దార్‌ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్లు, కార్పొరేషన్‌ కార్యాలయాలు నిరసన తెలిపారు. ధరలు, విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని, ఉద్యోగాలు ఇవ్వాలని ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నాలో వి.శ్రీనివాసరావు దేశంలో అధ్యక్ష తరహా పాలన తీసుకురావడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భిన్న జాతులు, భిన్న సంస్కృతులు, భిన్న భాషలు కలిగిన మన దేశంలో ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. జమిలి ఎన్నికల పేరుతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఒకేసారి ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు ఏర్పాటైన తరువాత అనివార్య పరిస్థితుల్లో ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి అనంతరం ఎన్నికలు జరపాల్సి వస్తే దేశమంతా మళ్లీ ఎన్నికలు జరుపుతారా? అని ప్రశ్నించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన ప్రధాన మోడీ... లక్ష ఉద్యోగాలు కూడా కల్పించలేకపోయారని దుయ్యబట్టారు. నల్లడబ్బు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న హామీ అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వం మాట తప్పను మడమ తిప్పను అనే దానికి తిలోదకాలు ఇచ్చిందని విమర్శించారు. విద్యుత్‌ ఉద్యమం ఫలితంగా పది సంవత్సరాలపాటు విద్యుత్‌ ఛార్జీలు పెంచడానికి ఏ ప్రభుత్వమూ సాహసించలేదని తెలిపారు. కేంద్రంలోని మోడీ తీసుకొచ్చిన విద్యుత్‌ సంస్కరణలను మన రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం అత్యుత్సాహంగా అమలు చేస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా భారాలు మోపిందన్నారు. విద్యుత్‌ ఉద్యమాన్ని జగన్‌ ప్రభుత్వం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని హితవు పలికారు. తమ సమస్యలపై అర్జీలతో ప్రజలు ధర్నాకు తరలివచ్చారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.భాస్కరయ్య, జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులు పాల్గొన్నారు.