
హక్కుల పరిరక్షణ కోసం సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని కార్మికులు, ఉద్యోగులకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో అరబిందో పరిశ్రమ వద్ద బుధవారం నిర్వహిచిన 'కార్మిక గర్జన' సభలో ఆయన ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్ట సవరణలను, కార్మిక ఉద్యమాలపై నిరంకుశ దాడులను, సామాజిక సంక్షేమ పథకాల నిధుల్లో కోతను విరమించాలని డిమాండ్ చేశారు. ఛార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కారంలో చర్చల పేరుతో అరబిందో ఫార్మా, నాగార్జున అగ్రికమ్, ఆంధ్రా ఆర్గానిక్స్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, శ్యాంపిస్టన్ 2, 3, వరం పవర్ ప్లాంట్, ఫ్రింజ్ లేబోరేటరీస్, స్మార్ట్కమ్ యాజమాన్యాలు నెలల తరబడి జాప్యం చేస్తున్నాయని విమర్శించారు. పెరిగిన ధరలకనుగుణంగా కార్మికుల వేతనాలు వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు. మోడీ, చంద్రబాబు ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సమ్మె ద్వారా కార్మిక వర్గం సరైన సమాధానం చెప్పాలని కోరారు.