మే 3వ తేదీన విశాఖలో అదానీ పుత్రరత్నాల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండు డేటా సెంటర్లకు శంకుస్థాపన చేశారు. వీటి వల్ల 40 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, మరో లక్ష మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. రూ.21,844 కోట్ల పెట్టుబడితో 7 సంవత్సరాల్లో 5 దశలుగా సాగే ఈ డేటా సెంటర్లు ఎప్పటికి వాస్తవ రూపం దాల్చుతాయనేది సందేహాస్పదమే. వాస్తవానికి ఈ డేటా సెంటర్లపై 2019 జనవరి లోనే నాటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అదానీతో ఎంవోయూ (మెమొరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్) జరిగింది. ఆ తరువాత ప్రభుత్వం మారిపోవడంతో భూసేకరణ వగైరా ఆలస్యమై ఇప్పటికి వాస్తవ రూపం ధరించిందని జగన్ ప్రభుత్వం చెబుతోంది. ఈ డేటా సెంటర్ల కోసం విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లోని మూడు ప్రాంతాలలో 400 ఎకరాలను ప్రభుత్వం సేకరించి అదానీ పరం చేసింది. అదానీ కనెక్స్ కంపెనీ సగం వాటా, ఎడ్జ్ కనెక్స్ మరో 50 శాతం వాటాతో ఇవి నడుస్తాయి. ఇందులో డేటా సెంటర్లు మాత్రమే కాక బిజినెస్ పార్కు సహా స్కిల్ డెవలప్‌మెంట్ కోసం భూమిని కేటాయించారు. డేటా లోకలైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇది జరుగుతోంది. ఆసియా పసిఫిక్ ఐ.టి నెట్‌వర్క్‌తో ఇది అనుసంధానమవుతుంది. భాషా వైవిధ్యాన్ని, భాషల్లోని యాసలను కూడా ఇవి గుర్తిస్తాయి. ఇంటర్‌నెట్ వినియోగదారుల సంఖ్య ప్రతి సంవత్సరం కోట్లలో పెరుగుతున్నందున దీని విస్తరణకు అవకాశాలు బాగా పెరిగాయి. 2019లో ఎన్నికలకు ముందు ఒకసారి కదిలిన ఈ ప్రతిపాదన 2024 ఎన్నికలకు ముందు మరోసారి ముందుకు వచ్చింది. ఎన్నికలకు ముందు చదువుకున్న యువతలో భ్రమలు సృష్టించి ఓట్లు గుంజుకునేందుకు అదానీ పెట్టుబడులు ఒక సాధనమవుతాయా? లేక నిజంగానే అదానీ త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. అంతకు మించి అదానీ ఆధ్వర్యంలో నడిచే ఈ డేటా సెంటర్ల నిర్వహణ రాష్ట్రానికి, దేశ ప్రజలకు ఏమైనా ప్రయోజనం కలిగిస్తాయా లేక దేశ భద్రతకు నష్టమా? అన్నది ముఖ్యమైన అంశం.
భూములు, పరిశ్రమలు లాగానే డేటా అనేది నేడు ముఖ్యమైన ఒక ఆస్తి రూపంగా మారింది. అందుకనే డేటా సెంటర్లకు ఎక్కడ లేని ప్రాముఖ్యత వచ్చింది. డేటాపై ఎవరికి ఆధిపత్యం ఉంటే వారి పైనే ఆర్థిక, రాజకీయ వ్యవస్థలు ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ డేటా సెంటర్ల ద్వారా నడుస్తుంది. ఇంతటి విలువైన డేటాను కేవలం అభివృద్ధి, ఉపాధి మాటల చాటున అదానీ చేతిలో పెట్టడం సురక్షితమేనా? అన్నది మౌలికమైన ప్రశ్న. ఇంటర్‌నెట్ అభివృద్ధి అయ్యాక క్రమంగా డేటాకు ప్రాముఖ్యత పెరిగింది. సోషల్ మీడియా ద్వారా అప్‌లోడ్ అయ్యే ప్రతి సమాచారం డేటా సెంటర్‌లో నిక్షిప్తమవుతుంది. ప్రభుత్వ సంస్థలు సేకరించే సమాచారం, సర్వే రిపోర్టులు, బ్యాంకులు, ఫైనాన్స్, ఆధార్ సమాచారం, ఓటరు కార్డుల వివరాలు, ఈ - కామర్స్, రేషన్, హెల్త్, పాన్ కార్డులు, విద్య, వైద్య రికార్డుల సమాచారం...ఇలా అనేక రకాల సమాచారం డేటా రూపంలో నిక్షిప్తం అవుతుంది. డేటా సెంటర్లంటే అన్ని రకాల డేటాను భద్రపరిచే గోడౌన్ల వంటివి. ఇంటర్‌నెట్ ద్వారా అనుసంధానమయ్యే ఈ డేటా సెంటర్లు అంతర్జాతీయ నెట్‌వర్క్‌లో భాగంగా ఉంటాయి.
డేటాను అమ్ముకోవడం, కొనుక్కోవడం ఈరోజు అతి పెద్ద వ్యాపారంగా మారింది. మార్కెట్ అంచనాలు, ఎన్నికలలో ఓటింగ్ సరళి వంటి అంశాలు డేటా ద్వారానే గ్రహించి వ్యూహాలు రూపొందించుకుంటారు. 2014 ఎన్నికలకు ముందు కేంబ్రిడ్జి అనలిటికా ఫేస్‌బుక్ ద్వారా సేకరించిన సమాచారాన్ని మోడీ కొనుక్కొని ఎన్నికలకు ఉపయోగించుకున్న సంగతి ఈ పాటికే ప్రజలకు తెలుసు. దాని ఆధారంగా ఎన్నికల ఎత్తుగడలు, ప్రచార వ్యూహాలు ఖరారయ్యాయి. ఈ డేటా ఆధారంగానే మిత్రులను సమకూర్చుకోవడం, శత్రువులను దెబ్బ కొట్టడం జరుగుతుంది. ఈ డేటా ఆధారంగానే ఫేక్ సమాచారాన్ని వదిలి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకోవచ్చు.
అనేక దేశాలలో డేటా మానిప్యులేషన్‌తో ప్రభుత్వాలే తలకిందులైన చరిత్ర ఉంది. సిఐఏ (అమెరికా గూఢచార సంస్థ) ఇలాంటి సమాచార కేంద్రాల ద్వారానే ప్రజాఉద్యమాలను దెబ్బ కొట్టడం, చీల్చి బలహీన పరచడం, వామపక్ష ప్రభుత్వాలను కూల్చడం, అమెరికా వ్యతిరేక శక్తులను కాల్చి చంపడం లాంటి అనేక నిర్ణయాలకు మూలం అవుతుంది. ప్రపంచ అనుభవాన్ని బట్టి డేటాను నిక్షిప్తం చేసే బాధ్యత ప్రభుత్వాలే తీసుకోవడం చాలా వరకు సురక్షితం. ప్రభుత్వాలు చట్టాలకు లోబడి ప్రజలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వాలే డేటాను దుర్వినియోగం చేస్తే ప్రజలకు, పార్లమెంటుకు సమాధానం చెప్పాలి.
నేడు సమాజానికి డేటా అవసరం ఎంతైనా ఉంది. కానీ అది సురక్షితంగా ఉండటం చాలా ముఖ్యం. అందులోనూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, దాని ఆధారంగా చాట్ జిపిటి లాంటి ప్రోగ్రాములు వచ్చిన తరువాత డేటా మీదనే భవిష్యత్తు ఆధారపడిఉందని అర్ధమవుతుంది. డేటా ప్రజా సంక్షేమానికి, దేశాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చు. పేదరికాన్ని, అసమానతలను గుర్తించి సరిదిద్దవచ్చు. అదే ప్రైవేటు కంపెనీలయితే దుర్వినియోగం చేయవచ్చు. అత్యంత విలువైన ఈ సమాచార నిక్షేపాన్ని ప్రభుత్వ రంగంలో పెట్టి కాపాడుకోవడం అత్యంత ఆవశ్యకం... సురక్షితం.
ఇప్పటివరకూ వ్యక్తిగత డేటాను హార్డ్‌డిస్కుల్లో భద్రపరచుకునే స్థితి నుండి క్లౌడ్‌లో నిక్షిప్తపరచుకునే వరకు గత పాతికేేళ్ళలో పరిణామం చెందింది. క్లౌడ్ నిర్వహణకు అనేక డేటా సెంటర్ల మధ్య అనుసంధానం కీలకం. వీటి నిర్వహణకు విద్యుత్ అవసరం అవుతుంది. విద్యుత్ వాడకాన్ని బట్టి డేటా సెంటర్ యొక్క సామర్ధ్యాన్ని కొలుస్తారు. ఉదా: విశాఖ డేటా సెంటర్లకు 200 మెగా వాట్ల విద్యుత్ అవసరమవుతుంది. దాని కోసం ఇదే అదానీ...సీతారామారాజు జిల్లాలో గిరిజనుల ఉపాధిని దెబ్బకొట్టి హైడల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. హైడల్ విద్యుత్‌తో డేటా సెంటర్లను నిర్వహిస్తారు. చల్లని వాతావరణంతోపాటు సముద్రాల గుండా వేసే అంతర్గత కేబుల్స్‌లో ఎక్కువ భాగం నిర్వహణకు ఇందులో ముఖ్యమైన పాత్ర ఉంటుంది. సప్త సముద్రాలను కలుపుతూ భూభాగాల మీదుగా ఈ కేబుల్స్ ప్రయాణం చేస్తాయి. అత్యంత వేడిని సృష్టించే ఈ డేటా సెంటర్ల నిర్వహణ కోసం సముద్రాలలో జలాంతర్గాములను కూడా ఉపయోగిస్తారు. ప్రపంచంలోని డేటా కేబుల్స్‌ను గూగుల్, ఫేస్‌బుక్, ఎటి అండ్ టి తదితర 5 అంతర్జాతీయ కంపెనీల కన్సార్టియం నడుపుతోంది. డేటా సెంటర్లు ప్రైవేటు కంపెనీల చేతిలో ఉండడం వల్ల అమెరికా లాంటి బలమైన దేశాలే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి.
ఇప్పటి వరకు భారతదేశంలో 138 కేంద్రాలలో 637 మెగావాట్ల సామర్ధ్యంతో కూడిన డేటా సెంటర్లున్నాయి. అందులో పశ్చిమ సుముద్ర తీరాల్లో ముంబయిలో 289 మెగావాట్ల సామర్ధ్యంతో (44 శాతం) డేటా సెంటర్లున్నాయి. తర్వాత బెంగళూరు, ఢిల్లీ, చెన్నై లలో ఉన్నాయి. ప్రపంచంలో మనం 13వ స్థానంలో ఉన్నాము. అమెరికా మొదటి స్థానంలో, చైనా నాల్గవ స్థానంలో ఉన్నాయి. ప్రధానమైన చైనా డేటా సెంటర్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తోంది. మోడీ ఆప్తమిత్రుడైన అదానీ ఇప్పుడు డేటాపైన కూడా ఆధిపత్యం సాధిస్తే భారతదేశం భవిష్యత్తు అతని చేతుల్లోకి వెళ్ళిపోయినట్లే. అందుకే దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డేటా సెంటర్లను నిర్వహించాలని డిమాండ్ చేయాలి.
ఇప్పటికే దేశంలో పోర్టులు, విమానాశ్రయాలు, విద్యుత్, మైనింగ్, బొగ్గు తదితర వనరులపై ఆధిపత్యం సాధించిన అదానీ అసలు రూపాన్ని ఇటీవల హిండెన్‌బర్గ్ రిపోర్టు బట్టబయలు చేసింది. ఆ తరువాత అదానీ దూకుడు కొంత తగ్గినా మరలా మోడీ, జగన్ ప్రభుత్వాల మద్దతుతో దూసుకొని వస్తోంది. హిండెన్‌బర్గ్ నివేదికలో వెల్లడైన వాస్తవాలను పరిశీలిస్తే అదానీ లాభాల కోసం మార్కెట్లను ఎలా తలకిందులు చేస్తాడో అర్ధమవుతుంది. మధ్యతరగతి మదుపుదార్లను దివాళా ఎత్తించిన ఘనత అదానీదే. అంతర్జాతీయంగా భారతదేశం పరువు ప్రతిష్టలను దెబ్బ కొట్టిన ఘనత కూడా అదానీదే. ఈ నేపథ్యంలో భారతదేశ భవిష్యత్తును తీసుకుపోయి అదానీ చేతిలో పెట్టడం అత్యంత ప్రమాదకరం.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, చీఫ్ సెక్యూరిటీ అడ్వైజర్ తదితరులు గూగుల్, మైక్రోసాఫ్ట్ సిఈవోలైన సుందర్ పిచారు, సత్య నాదెళ్ళను పిలిపించుకొని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచ భద్రతకు ప్రమాదంగా పరిణమించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చర్చించారు. ఏఐ ఆధారంగా డేటాను విశ్లేషించడంలో వస్తున్న కొత్త సమస్యలు నేడు చర్చనీయాంశం అవుతున్నాయి. సాంకేతికంగా అత్యంత ఉన్నత స్థానంలో ఉన్న అమెరికానే ఆందోళన పడుతుంటే మన పాలకులకు చీమ కుట్టినట్టైనా లేకపోవడం విచారకరం. మోడీ, జగన్‌లకు మన దేశ భద్రత, ప్రజల సంక్షేమం కన్నా అదానీ ప్రయోజనాలే మిన్నగా భావిస్తున్నట్లు కనబడుతుంది. దీన్ని గొప్ప ముందడుగుగా, ఘనతగా చాటుకోవడం జగన్ మోహన్ రెడ్డికి తగదు. దేశ ప్రయోజనాలను, ప్రజల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే సమాచారాన్ని ఫణంగా పెట్టి అదానీ మెప్పు కోసం, మోడీని ప్రసన్నం చేసుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ డేటా సెంటర్ల ప్రారంభానికి ముందుకు వచ్చింది. దీనిపై సాంకేతిక నిపుణులు, న్యాయ కోవిదులు, సామాజిక శాస్త్రవేత్తల అభిప్రాయాలు తీసుకోకుండా ముందుకు పోరాదు.