అబ్దుల్ కలాం కన్నుమూత

భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపిజె అబ్దుల్‌ కలాం (84) సోమవారం కన్నుమూశారు. ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త కూడా అయిన కలామ్‌ మేఘాలయలోని షిల్లాంగ్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఇనిస్టి ట్యూట్‌ ఆఫ్‌ మేనేజిమెంట్‌లో సోమవారం సాయంత్రం ప్రసంగిస్తూ, 6.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్పకూలారు. చికిత్స నిమిత్తం ఆయనను మేఘాలయ రాజధాని నాంగ్రిమ్‌ హిల్స్‌లోని బెథాని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్సనిందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈశాన్య ప్రాంత హెల్త్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌ఇఐజిఆర్‌ఐహెచ్‌ఎంఎస్‌) నుంచి వైద్యులను బెథాని ఆసుపత్రికి ప్రత్యేకంగా రప్పించారు. మేఘాలయ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిబిఓ వర్జీరి ఆసుపత్రి వెలుపల విలేకరులతో మాట్లాడుతూ ఆయన చనిపోయారన్న విషాద వార్తను వెల్లడించారు. కలామ్‌ మృతికి సంతాప సూచకంగా కేంద్ర ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. కలామ్‌ భౌతిక కాయాన్ని గౌహతి నుంచి ఢిల్లీకి మంగళవారం ఉదయం తరలిస్తారు. మేఘాలయ గవర్నరు వి షన్ముగనాథన్‌, స్పీకర్‌ అబూ తహెర్‌ మొండల్‌, హోం మంత్రి రోషన్‌ వర్జిరి తదితరులు ఆసుపత్రికి వెళ్లి అబ్దుల్‌ కలామ్‌కు నివాళులర్పించారు.