
అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమలైతే మరింత కష్టకాలం తప్పదు. తెలంగాణలో మందుబాబులకు తక్కువ ధరకే మద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు అక్కడి సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది. ఈ విధానం అమల్లోకి వచ్చి.. సారా ప్యాకెట్ల(సాచెట్లు) తరహాలో చీప్‌లిక్కర్ మద్యం దుకాణాల్లోకి ప్రవేశిస్తే.. ఏపీ ఆదాయానికి భారీగా గండిపడే అవకాశాలున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ఏపీకి చెందిన ప్రధానమైన ఐదు జిల్లాల్లో తెలంగాణ చీప్‌లిక్కర్ ఏరులై పారనుంది. రాయలసీమలోని కర్నూలు, కోస్తాలోని గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాలు తెలంగాణకు సరిహద్దు జిల్లాలుగా ఉన్నాయి. ఈ ఐదు జిల్లాల నుంచి మందుబాబులు సరిహద్దుల్లోని ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు కాలినడకన సైతం వెళ్లి అక్కడి నుంచి తక్కువ ధరకు లభించే చీప్‌లిక్కర్‌ను తెచ్చుకునే అవకాశముంది. ఇదే గనక జరిగితే.. ఏటా సుమారు రూ. 2000 వేల కోట్ల ఏపీ ఆదాయానికి గండిపడడం ఖాయమని ఎక్సైజ్ ఉన్నతాధికారులు బెంబేలెత్తుతున్నారు. తెలంగాణలో పేదల జీవితాలను ఛిద్రం చేస్తున్న గుడుంబాను అరికట్టి.. దాని స్థానంలో సాచెట్లు లేదా సారా ప్యాకెట్ల మాదిరి చీప్‌లిక్కర్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు.. 180 మిల్లీ లీటర్ల మద్యం సీసాల పరిమాణాన్ని 60 మిల్లీ లీటర్లకు పరిమితం చేస్తూ ప్యాకెట్లను తీసుకురానున్నారు. దీనిద్వారా తక్కువ ధరకే మందుబాబులకు మద్యం ప్యాకెట్లను అందించి గుడుంబాను అరికట్టవచ్చని, అదే సమయంలో సర్కార్ ఖాజానాకు భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని అక్కడి ప్రభుత్వం మద్యం విధానంలో సమూల మార్పులు తేబోతోంది. దీంతో ఆందోళన చెందుతున్న ఏపీ ప్రభుత్వం.. 60 మిల్లీలీటర్ల చీప్‌లిక్కర్‌ను తీసుకువచ్చే ప్రయత్నాలను విరమించుకోవాలంటూ తెలంగాణ సర్కార్‌కు ఇప్పటికే లేఖ కూడా రాసింది. అయినా తెలంగాణ ప్రభుత్వం ఏపీ లేఖ అంశాన్ని పట్టించుకునే స్థితిలో లేనట్లు సమాచారం.