
ఆధార్ కార్డులు రైతుల ఉసురు తీస్తున్నాయి. రైతులకు అమలు చేస్తున్న అన్ని పథకాలకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ తీసుకున్న నిర్ణయం అన్నదాతలకు గుదిబండగా మారింది. రుణ మాఫీ మొదలుకొని విపత్తు సాయం వరకు ఏ లబ్ధి పొందాలన్నా ఆధార్‌నే అర్హత చేసింది సర్కారు. దీంతో అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ కేవలం ఆధార్ లేని కారణంగా లక్షలాది మంది రైతులు ప్రభుత్వ సాయానికి దూరవుతున్నారు. ఆధార్ లేని వారే కాకుండా సాంకేతిక కారణాలతో ఆధార్ నెంబర్ ఉన్నా సాఫ్ట్‌వేర్‌లో మ్యాచ్‌కాని వారు సైతం ప్రభుత్వ లబ్ధి పొందలేకపోతున్నారు. అర్హులకు స్కీంలు చేరేందుకు, అక్రమాలను సరి చేసేందుకు ఆధార్‌ను ఎంచుకున్నామని ప్రభుత్వం చెబుతు న్నప్పటికీ ఇంట్లో ఎలుకలున్నాయని ఇల్లు తగలబెట్టుకున్నట్లు తయారైంది వ్యవహారం. ఆధార్‌తో లీకేజీలను అరికట్టడం కంటే ఆ పేరుతో ఖర్చు తగ్గించుకోడానికి, నిధులు మిగుల్చుకోడానికి ఉపయోగపడుతోందన్న విమర్శలొస్తున్నాయి. ఎపి ప్రభుత్వం రైతుల రుణ మాఫీకి ఆధార్‌ను తప్పనిసరి చేసింది. అది లేకుంటే మాఫీకి అనర్హులని ఉత్తర్వులు జారీ చేసింది. మూడు దశల్లో రైతుల దరఖాస్తులను స్వీకరించినప్పటికీ ఆధార్ లేదనే సాకుతో సుమారు 20 లక్షల మందిని మాఫీకి అనర్హులుగా ప్రకటించింది. ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టినా ఆధార్ లేని కారణంగా స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ (ఎస్‌ఆర్‌డిహెచ్) సాఫ్ట్వేర్ తిరస్కరిస్తోంది. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న 83.28 లక్షల రైతుల ఖాతాల వివరాలను బ్యాంకులు ఆన్లైన్లో అప్లోడ్ చేయగా సరైన వివరాల్లేవనే పేర 30 లక్షల ఖాతాలను ఎన్ఐసి సాఫ్ట్వేర్ తిరస్కరించింది. కేవలం ఆధార్ లేక 20 లక్షల ఖాతాలను తోసిపుచ్చింది. మొత్తానికే ఆధార్ నమోదు చేసుకోనివాళ్లతోపాటు నెంబర్ ఇచ్చినా సాంకేతిక కారణాలతో మ్యాచ్‌కాని వారు లక్షల సంఖ్యలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సమైక్యరాష్ట్రంలో ఆధార్ నమోదు ప్రక్రియ నడిచింది. ఎపి, తెలంగాణలో కలిపి సుమారు 40 లక్షల మందికి ఆధార్ నెంబర్ వచ్చినా సాంకేతిక కారణాలతో ఎస్‌ఆర్‌డిహెచ్ సాఫ్ట్వేర్ తిరస్కరిస్తోంది. సాంకేతిక లోపాలతో ఆధార్ మ్యాచ్‌కాని వారిలో రైతులూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారికి ఎపి ప్రభుత్వం మాఫీ వర్తింపజేయలేదు. ఎపిలో భూములు కలిగి అక్కడి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులకు పొరుగు రాష్ట్రాల్లో ఆధార్ ఉన్నందున కొన్ని లక్షల మందికి మాఫీ అమలు కాలేదు. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆధార్ కలిగి ఎపిలో భూములున్నవారు మాఫీ కోసం దరఖాస్తు చేస్తే సాఫ్ట్వేర్ తిరస్కరించింది. తమిళనాడు, ఒరిస్సా, కర్నాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుగా కలిగిన జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఎపిలో భూములు, రుణాలు ఉన్నప్పటికీ పక్క రాష్ట్రంలో ఆధార్ ఉండటం వలన అర్జీలను తిరస్కరించారు. రుణ మాఫీలోనే లక్షలాది మంది రైతులు నష్టపోగా రైతుల అన్ని పథకాలకూ ఆధార్‌ను తప్పనిసరి చేస్తోంది సర్కారు. విపత్తుల బారిన పడ్డ రైతులకు చెల్లించే ఇన్పుట్ సబ్సిడీ, రాయితీ విత్తనాలు, పంటల బీమా, వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ, సూక్ష్మసేద్యం, సబ్సిడీపై ఇస్తున్న జింక్, జిప్సం, పచ్చిరొట్ట ఎరువులు, వ్యవసాయ యాంత్రీకరణ, పంటల బీమా, ఉచిత విద్యుత్, రైతుమిత్ర గ్రూపుల్లో సభ్యత్వం, కౌలు రైతు కార్డు, పంట రుణాలు ఇలా అన్ని పథకాలకూ ఆధార్‌ను తప్పనిసరి చేయడం వలన రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వ ప్రయోజనాలకు ఆధార్‌తో లింక్ పెట్టొద్దని సుప్రీం కోర్టు 2013లో తీర్పు చెప్పగా ఎపి సర్కారు అందుకు విరుద్ధంగా పని చేస్తోందన్న విమర్శలొస్తున్నాయి.