సాంఘిక సమానత్వ సాధనలో రిజర్వేషన్ల ఆవశ్యకత, పరిమితులు

ఉద్యోగాలలో, చదువుల్లో దళితులకు, గిరిజనులకు, ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఒక తాత్కాలిక ఉపశమనంగా పరిగణిస్తూనే సిపిఐ(ఎం) రిజర్వేషన్లను సమర్ధిస్తుంది. అదే సమయంలో దీర్ఘకాల పరిష్కారంగా సమూలంగా భూసంస్కరణలను చేపట్టాలని, కొద్దిమంది చేతుల్లో ఉన్న సంపద కేంద్రీకరణను బద్దలు కొట్టాలని, అన్ని తరగతులవారికీ ప్రయోజనాలు కలిగే విధంగా ఆర్థికాభివృద్ధి ఉండాలని కోరుతుంది.
      దేశంలో వివిధ ప్రాంతాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పలు గ్రూపులు ఆ యా తరగతుల డిమాండ్లపై ఆందోళనలు చేపడుతున్నాయి. వారి వారి ఎన్నికల ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కోసం బూర్జువా రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ ఆందోళనలను ప్రోత్సహిస్తున్నాయి. అందరికన్నా ఎక్కువగా ఈ ఆందోళనలను, ఆ యా తరగతుల సమస్యలను ఆర్‌.ఎస్‌.ఎస్‌ అతి శ్రద్ధగా తన సోషల్‌ ఇంజనీరింగ్‌ వ్యూహానికి అనుగుణంగా వినియోగించుకుంటోంది. ఇది ఆ యా బలహీన వర్గాలపై ప్రేమ కొద్దీ చేస్తున్న పని కాదు, తన హిందూత్వ సిద్ధాంతాన్ని బలపరుచుకోవడం కోసం ఆ యా కులాల్లో, సమూహాల్లో చొరబడడానికి వినియోగించుకుంటోంది. ఈ విషయంలో తన జోక్యంతో న్యాయ వ్యవస్థ సైతం కొత్త వివాదాలకు, సమస్యలకు కారణమౌతోంది. మొత్తంగా చూసినప్పుడు ఒకవైపున రిజర్వేషన్ల వలన కలుగుతున్న ప్రయోజనాలు తగ్గిపోతూంటే, మరోవైపున తమకూ రిజర్వేషన్లు కావాలన్న తాపత్రయం మరిన్ని తరగతులలో పెరుగుతోంది. ఇదే ప్రస్తుత పరిస్థితి లోని వైచిత్రి.
                                                                 రిజర్వేషన్లు - సి.పి.ఐ(ఎం) వైఖరి

సాంఘిక సమానత్వాన్ని, న్యాయాన్ని సాధించడంలో భాగంగా సమాజంలోని దళిత, గిరిజన, తదితర బలహీన తరగతుల ప్రజలకు తోడ్పడడానికి భారత రాజ్యాంగం పలు అవకాశాలను కల్పించింది. 330, 332, 243-డి, 243-టి అధికరణలు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాయి. 15, 15(4), 16(4) , 29(2) అధికరణలు విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాయి. 17వ అధికరణ అంటరానితనాన్ని రద్దు చేసింది. 338 అధికరణ దళితులకు, గిరిజనులకు జాతీయ కమిషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. సామాజిక న్యాయ సాధన దిశగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా 1989లో ఎస్‌.సి, ఎస్‌.టి అత్యాచార నిరోధక చట్టాన్ని జారీ చేశారు. 1975 తర్వాత ఎస్‌.సి, ఎస్‌.టి స్పెషల్‌ కాంపొనెంట్‌ ప్లాన్‌ ను బడ్జెట్‌లో భాగంగా ప్రవేశపెట్టారు. ఐతే, బిజెపి అధికారంలోకి వచ్చాక దీనిని నీరుగార్చారు. మన రాజ్యాంగంలో పలు అవకాశాలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందాలన్న లక్ష్యం మాత్రం ఇంకా చాలా దూరంగానే ఉండిపోయింది. భారత పాలక వర్గాలలో రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడమే దీనికి కారణం. మతోన్మాద, మనువాద బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీసి నీరుగార్చే విధంగా నేరుగా దాడి జరుగుతోంది. రిజర్వేషన్ల వలన ఎటువంటి ఉపయోగాలూ కలగకుండా చూడడానికి పలు వక్ర మార్గాల్లో మతోన్మాద శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ ప్రయత్నాలను ప్రతిఘటించి తిప్పికొట్టకపోతే బలహీన వర్గాలకు రిజర్వేషన్ల సదుపాయం లేకుండానే పోయే ప్రమాదం ఉంది.
     చారిత్రికంగా అతి హీనమైన రీతిలో సామాజిక అణచివేతకు గురైన తరగతులకు ప్రస్తుత పెట్టుబడిదారీ సంబంధాల చట్రం పరిధిలో, ఆ పెట్టుబడిదారుల ప్రయోజనాలకు భంగం కలగకుండానే, కనీసమైన ఊరటను రిజర్వేషన్లు కలిగిస్తాయన్నది సిపిఐ(ఎం) అభిప్రాయం. అంతే తప్ప పాలక వర్గాలు చెప్పుకుంటున్నట్టు రిజర్వేషన్లతోటే సామాజిక విముక్తి సాధ్యం కాదు.
     రిజర్వేషన్లు కుల వ్యవస్థ యొక్క సాంప్రదాయ పట్టును సడలింపజేయడానికి దోహదపడతాయని, కొద్దిపాటి సంఖ్యలోనైనా 'కింది కులాల' వారు సామాజికంగా పైకి ఎక్కి రావడానికి వీలు కల్పించడం ద్వారా సమాజంలోని వివిధ వర్గాలలో బహుళత్వాన్ని పెంచడానికి దోహదపడతాయని, ఆవిధంగా చూసినప్పుడు రిజర్వేషన్లు ఒక ప్రజాతంత్ర సారాంశం కలిగివున్నాయని సి.పి.ఐ(ఎం) భావిస్తుంది.
    ఉద్యోగాలలో, చదువుల్లో దళితులకు, గిరిజనులకు, ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని ఒక తాత్కాలిక ఉపశమనంగా పరిగణిస్తూనే సిపిఐ(ఎం) రిజర్వేషన్లను సమర్ధిస్తుంది. అదే సమయంలో దీర్ఘకాల పరిష్కారంగా సమూలంగా భూసంస్కరణలను చేపట్టాలని, కొద్దిమంది చేతుల్లో ఉన్న సంపద కేంద్రీకరణను బద్దలు కొట్టాలని, అన్ని తరగతులవారికీ ప్రయోజనాలు కలిగే విధంగా ఆర్థికాభివృద్ధి ఉండాలని కోరుతుంది.
    సామర్ధ్యం పేరుతోనో, మెరిట్‌ పేరుతోనో, సమానత్వం పేరుతోనో రిజర్వేషన్లను రద్దు చేయాలన్న డిమాండ్‌ ను సి.పి.ఐ(ఎం) తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
     సామాజిక వెనుకబాటుతనం వాస్తవంగా ఉన్న తరగతులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్లను సి.పి.ఐ(ఎం) బలపరుస్తుంది. ఇప్పటికీ రిజర్వేషన్లు అమలులోకి రాని రంగాల్లో, ప్రభుత్వ విభాగాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్‌ను బలపరుస్తుంది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ఉండాలన్న డిమాండ్‌ను సమర్ధిస్తుంది. రిజర్వేషన్ల అమలులో తలెత్తుతున్న అసమానతలను సరి చేయాలన్న డిమాండ్‌ను బలపరుస్తుంది. ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్‌ ను, రిజర్వేషన్ల అమలు ఫలితంగా ఒకే కేటగిరీలో ఉన్న వివిధ కులాల మధ్యలో అసమాన ప్రయోజనాలు కలిగితే దానిని సరి చేయడానికి ఆ కులాలను వర్గీకరించాలన్న డిమాండ్‌ ను సిపిఐ(ఎం) బలపరుస్తుంది. ఒబిసిలలో గణనీయంగా దొంతరలు తయారైన కారణంగా, ఒబిసి రిజర్వేషన్ల అమలులో ఆర్థిక ప్రాతిపదికను (క్రీమీ లేయర్‌) పాటించాలన్న డిమాండ్‌ ను బలపరుస్తుంది. ఆ విధంగా చేసినప్పుడే ఎవరికి నిజంగా అవసరం ఉందో వారే రిజర్వేషన్ల వలన ప్రయోజనం పొందగలుగుతారు. అదే సమయంలో దళితుల్లో, గిరిజనుల్లో కూడా ఆర్థిక ప్రాతిపదికను (క్రీమీ లేయర్‌) ప్రవేశ పెట్టాలన్న డిమాండ్‌ను సిపిఐ(ఎం) వ్యతిరేకిస్తుంది. ఆ సామాజిక తరగతుల లోపల గణనీయమైన స్థాయిలో అంతరాలు ఏర్పడనందువల్ల ఈ విధమైన డిమాండ్‌ వారికి వర్తింపజేయకూడదు.
     అగ్ర కులాలవారికి, ఆధిపత్య కులాలవారికి కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండకూడదన్నది సిపిఐ(ఎం) వైఖరి. ఇందుకు మినహాయింపుగా ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాల వారికి, ఆధిపత్య కులాల వారికి రిజర్వేషన్‌ సదుపాయం కల్పించడాన్ని, అది సామాజిక వెనుకబాటుతనంతో సంబంధం లేనిదే అయినా, సిపిఐ(ఎం) సమర్థిస్తుంది. పేద తరగతుల ప్రజల్లో రిజర్వేషన్‌ సదుపాయం వర్తించనివారిలో రిజర్వేషన్‌ విధానం పట్ల ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి, వర్గ ఐక్యతను నిలబెట్టడానికి ఇది ఉపయోగపడుతుందన్న భావనతోనే ఈ వైఖరిని సిపిఐ(ఎం) తీసుకుంది.
     సమాజంలో ఏ కులం జనాభా ఎంత శాతం ఉందో అంత శాతం మేరకు వారికి రిజర్వేషన్‌ కల్పించాలన్న డిమాండ్‌ ను సిపిఐ(ఎం) వ్యతిరేకిస్తుంది. ఒక్క దళిత, గిరిజన తరగతుల విషయంలోనే దీనికి మినహాయింపు ఉంటుంది. సామాజిక వెనుకబాటుతనం మౌలిక ప్రాతిపదికగా ఏ తరగతికైనా రిజర్వేషన్‌ కల్పించాలే తప్ప జనాభాలో ఎవరెంత శాతం ఉన్నారన్న లెక్కన కాదు. ఆ విధంగా చేస్తే అది కులవ్యవస్థ యొక్క అణచివేసే నిచ్చెనమెట్ల నిర్మాణపు దుర్మార్గాన్ని కప్పిపుచ్చడమే అవుతుంది.
                                                                    రిజర్వేషన్ల అమలు-ఫలితాలు

స్వతంత్ర భారతదేశంలో గత ఏడు దశాబ్దాలుగా అమలు జరిగిన రిజర్వేషన్ల వలన వచ్చిన అనుభవాలను, ఫలితాలను దిగువ పేర్కొన్న విధంగా సంక్షిప్తీకరించవచ్చు.
1. సామాజికంగా ప్రతికూలతను ఎదుర్కొంటున్న తరగతుల్లో విద్యావ్యాప్తికి రిజర్వేషన్లు తోడ్పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో, ప్రభుత్వ రంగ సంస్థలలోని ఉద్యోగాల్లో అవకాశాలు పొందిన ఈ తరగతుల వారు, చట్ట సభల్లో రిజర్వేషన్ల వలన పదవులు పొందినవారు సామాజికంగా పై స్థాయికి ఎదగడానికి కొంత అవకాశాన్ని రిజర్వేషన్లు కల్పించాయి.
2. అయితే, సామాజికంగా ప్రతికూలతను ఎదుర్కొంటున్నవారిలో అవసరమైన వారందరికీ రిజర్వేషన్‌ ఫలాలు అందలేదు. వారిలో అతిచిన్న భాగం మాత్రం ప్రయోజనం పొంది ఒక చిన్న మధ్యతరగతిగా రూపొందారు. ఒకే గ్రూపులో పలు కులాలవారు ఉన్నప్పుడు ఆ కులాల్లో ఎక్కువ జనాభాగా ఉన్న కులాలవారు, సాపేక్షంగా తక్కినవారికన్నా ముందున్న కులాలవారు రిజర్వేషన్‌ కల్పించిన అవకాశాలను ఎక్కువగా దొరకబుచ్చుకోగలిగారు. వాస్తవానికి కాస్త మెరుగైన పరిస్థితిలో ఉన్నవారికే రిజర్వేషన్‌ వలన ఎక్కువగా ప్రయోజనాలు కలిగాయి. ఆ తర్వాత కూడా వారికే ఆ ప్రయోజనాలు కలుగుతూ వస్తున్నాయి. తద్వారా ఎవరికి ఎక్కువ అవసరం ఉందో వారు రిజర్వేషన్‌ ఫలాలను పొందలేకపోతున్నారు. సామాజికంగా ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నవారిలో అత్యధిక భాగం ప్రజానీకాన్ని ఇప్పటికీ, పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, నిరుద్యోగం, అణచివేత, వివక్షత వెన్నాడుతూనే వున్నాయి. కొద్ది మంది ప్రజలు సామాజికంగా పైకి ఎదగడానికి మాత్రమే రిజర్వేషన్లు తోడ్పడ్డాయి తప్ప అస్థిత్వ వాదులలో పలువురు చెప్పుకుంటున్నట్టు సాంఘిక సమానత్వాన్ని సాధించడానికి తోడ్పడలేదు.
3. నయా ఉదారవాద ఆర్థిక విధానాల అమలు ప్రారంభమయ్యాక రిజర్వేషన్ల పరిమిత ప్రయోజనం కూడా కుదించుకుపోతూ వుంది. ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగాన్ని కూలదొయ్యడం, ఉద్యోగాల కాంట్రాక్టీకరణ, యాంత్రీకరణ విధానాల వలన, వాటి పర్యవసానాలైన ఉపాధి రహిత అభివృద్ధి వలన, విద్య వ్యాపారీకరణ వలన విద్యావకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రభుత్వ రంగంలో తగ్గిపోతున్నాయి. ఆ విధంగా రిజర్వేషన్ల అమలు వర్తించే రంగాల పరిధి రోజు రోజుకూ ముడుచుకుపోతోంది.
4. ఇలా అవకాశాలు కుదించుకుపోతున్నదానికి ప్రత్యామ్నాయంగా సామాజిక ఉద్యమాలు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తున్నాయి. సిపిఐ(ఎం) కూడా ఈ డిమాండ్‌ను గట్టిగా బలపరుస్తోంది. కాని ప్రైవేటు రంగం చాలా తీవ్రంగా ఈ డిమాండ్‌ ను వ్యతిరేకిస్తోంది. ఒకవేళ ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్‌ను ఆమోదించినా దానివలన ప్రయోజనాలు పరిమితంగానే ఉంటాయి తప్ప మౌలికమైన మార్పు ఏమీ ఉండబోదు. ఎందుకంటే సంఘటిత ప్రైవేటు రంగంలో ఉద్యోగాల లభ్యత చాలా స్వల్పం. అణచివేతకు గురౌతున్న సామాజిక తరగతులనుండి ఉద్యోగాలు కోరుతున్నవారి సంఖ్య దానితో పోల్చితే చాలా ఎక్కువ.
5. రిజర్వేషన్‌ రొట్టె పరిమాణం తగ్గిపోతున్నకొద్దీ అలా తగ్గిపోతున్నదానిలో తాము ఎక్కువ వాటా దక్కించుకోవాలన్న పోటీ బలహీనవర్గాల లోని వివిధ తరగతుల్లో పెరుగుతోంది. దాని ఫలితంగా ఇప్పటికే తగ్గిపోతున్న అవకాశాలను పొందే ప్రయత్నంలో వివిధ తరగతుల మధ్య, వివిధ కులాల మధ్య వైరుధ్యాలు, ఘర్షణలు పెరుగుతున్నాయి. కొత్త తరగతులు, సమూహాలు తమకు సైతం రిజర్వేషన్లు వర్తింపజేయాలన్న డిమాండ్‌ ను ముందుకు తెస్తున్నాయి. దానితోబాటు ఇప్పుడున్న రిజర్వేషన్ల పరిధిలోనే వర్గీకరణ చేపట్టి అవకాశాల పంపిణీలో మరింత సమన్యాయం చేయాలన్న డిమాండ్‌ కూడా ముందుకొచ్చింది.
6. ఈ పరిణామాల పర్యవసానంగా రిజర్వేషన్లకు సంబంధించిన వివిధ డిమాండ్లను చేపట్టి అనేక ఆందోళనలు, ఉద్యమాలు రానురానూ ఎక్కువౌతున్నాయి. కులం, సామాజిక అస్థిత్వం ప్రధాన అంశాలుగా ఈ ఆందోళనలలో సమీకరణలు జరుగుతున్నాయి.

/ వ్యాసకర్త సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు/
/ ముగింపు తదుపరి సంచికలో /
బి.వి. రాఘవులు