బుల్డోజర్‌ సంస్కృతి

భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉండే సుసంపన్నమైన మన సంస్కృతిని ధ్వంసం చేసేందుకు అత్యంత దుర్మార్గమైన బుల్డోజర్‌ సంస్కృతిని బిజెపి ముందుకు తేవడం ఆందోళన కలిగిస్తోంది. బిజెపి అనుసరిస్తున్న ఈ ధోరణి చాలా ప్రమాదకరం. రాజ్యం క్రూరత్వానికి, అధికార దుర్వినియోగానికి ఈ బుల్డోజర్‌ సంస్కృతి ప్రతీక. ఏళ్ల తరబడి ఈ నిర్మాణాలున్నా ఏనాడూ లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకొచ్చింది? అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా , అవి ఏ వర్గానికి చెందినవైనా చర్య తీసుకోవాల్సిందే. కానీ, రోహింగ్యాలు, బంగ్లాదేశీల పేరుతో అమాయకులైన వలస శ్రామికులను, పేదలను ఉపాధికి దూరం చేసి నిలువ నీడలేకుండా చేయడం అమానుషం. మానవ హక్కులకే విరుద్ధం. అక్రమ కట్టడాలను కూల్చాల్సి వస్తే ఢిల్లీలో నాలుగింట మూడొంతులు ఉండవు. 2008-09లో ఢిల్లీలో నిర్వహించిన ఒక సర్వే ప్రకారం 24 శాతమే ప్లాన్డ్‌ కాలనీలు. మిగతావన్నీ అన్‌ప్లాన్డ్‌ కాలనీలేనని తేలింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం ఇల్లు కలిగివుండడం ప్రతి ఒక్కరి హక్కు. దానిని బుల్డోజర్‌తో కాలరాయాలని చూడడం దారుణం. ఏదైనా అక్రమ కట్టడాన్ని కూల్చివేయాల్సి వస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ముందుగా నోటీసులివ్వడం, పరిహారం చెల్లింపు వంటివి ఉంటాయి. ఈ కనీస నియమాలేవీ పాటించకుండా బుల్డోజర్లతో కూల్చివేయడం ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే. ఈ బుల్డోజర్‌ సంస్కృతిని మొట్టమొదట బుల్డోజర్‌ బాబాగా పేరొందిన యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రారంభించగా, బుల్డోజర్‌ మామ (మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి) దానిని విస్తరింపజేశారు. మోడీ, అమిత్‌షా కనుసన్నల్లోని ఉత్తర, దక్షిణ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్లు దీనిని మరింత తీవ్రతరం చేశాయి. యు.పి లో బిజెపి రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత మత పరమైన సమీకరణలను మరింత తీవ్రతరం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న దుష్ట తలంపుతోనే సంఫ్‌ు పరివార్‌ ఈ బుల్డోజర్‌ సంస్కృతిని తీసుకొచ్చిందనేది కాదనలేని సత్యం. ముస్లింల ఇళ్లు, షాపులను లక్ష్యంగా చేసుకుని వారిని సామూహికంగా శిక్షించే ఆయుధంగా బుల్డోజర్లను అది ఎంచుకున్నది. గోవధను అరికట్టే పేరుతో మైనార్టీలపై ఇన్నాళ్లు సాగిస్తున్న మూక దాడులకు తోడు ఇప్పుడీ బుల్డోజర్లను తీసుకొచ్చి వారిని మరింత అభద్రతకు గురిచేస్తున్నది. ఈ దేశంలో వారు జీవించాలనుకుంటే ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండాలన్న ఆరెస్సెస్‌ ఫాసిస్టు సిద్ధాంతాన్ని బిజెపి పాలిత రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. జహంగీర్‌పురి కేసు కోర్టులో ఉండగా షాహీన్‌బాగ్‌ కు బుల్డోజర్లను పంపడంలో ఔచిత్యమేమిటి? అక్రమ కట్టడాల కూల్చివేత పేరుతో షాహీన్‌ బాగ్‌కు బుల్డోజర్లను, ఏదో శత్రువుపై యుద్ధానికి వెళ్తున్నట్లు పెద్ద సంఖ్యలో పోలీస్‌ బలగాలను, కార్పొరేట్‌ మీడియా బాకాలను వెంటదీసుకుని వెళ్లాల్సిన అవసరమేమొచ్చింది? అక్రమ కట్టడాల కూల్చివేత కన్నా మైనార్టీలను భయభ్రాంతులకు గురి చేయడమే దాని అసలు లక్ష్యం. దీనికి తగినట్లుగానే స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. బుల్డోజర్‌ సంస్కృతి ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ, ఇక్కడ మాత్రం చెల్లదు అని షాహీన్‌బాగ్‌ వాసులు ఢంకా బజాయించారు. జహంగీర్‌పురిలో సుప్రీం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి మైనార్టీల ఇళ్లు, షాపులను కూల్చేయడంపై పెద్దయెత్తున విమర్శలొచ్చినా లెక్కచేయకుండా షహీన్‌బాగ్‌కు బుల్డోజర్లను తరలించింది. షాహీన్‌బాగ్‌ లో కూల్చివేతలను ఆపాలని మార్క్సిస్టు పార్టీ వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయ స్థానం తిరస్కరిస్తూ, ఢిల్లీ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ స్థితిలో ప్రజలే ప్రతిఘటించడంతో ఒక్క ఇటుక కూడా తొలగించకుండానే బుల్డోజర్లు వచ్చిన తోవనే వెనుదిరగాల్సి వచ్చింది. ఇది షాహీన్‌బాగ్‌ ప్రజల విజయం. వాస్తవానికి షాహీన్‌బాగ్‌ లోని వ్యాపారుల్లో అత్యధికులు హిందువులే. 2020లో వివక్షాపూరిత పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), వివాదాస్పద జాతీయ పౌరసత్వ నమోదు ( ఎన్‌ఆర్‌సి), జాతీయ జనాభా రిజిష్టర్‌ (ఎన్‌పిఆర్‌) వ్యతిరేక ఆందోళనలతో ప్రపంచ వ్యాపితంగా షాహీన్‌బాగ్‌ పేరు మార్మోగిపోయింది. దీనిని జీర్ణించుకోలేని సంఫ్‌ుపరివార్‌ శక్తులు షాహీన్‌బాగ్‌ ను ఎలాగైనా దెబ్బ తీయాలన్న దుష్ట తలంపుతో ఈ చర్యకు ఒడిగట్టాయి. బుల్డోజర్లతో వారు కూల్చివేస్తున్నది మైనార్టీల ఇళ్లు, ఆస్తులే కాదు, ఈ దేశ చట్టాలను, న్యాయ పాలనను, రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని కూడా. ఈ బుల్డోజర్‌ సంస్కృతిని ఇంకెంత మాత్రం అనుమతించరాదు.