కామన్ యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సియుఇటి) ప్రతిపాదనను కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మొన్న సోమవారం తమిళనాడు శాసనసభ ఆమోదించిన ఏకగ్రీవ తీర్మానం పెద్ద మేల్కొలుపు. ఉన్నత విద్యనభ్యసించగోరు విద్యార్థులు అవకాశాలు కోల్పోతారన్న భయాందోళనలు ముమ్మాటికీ నిజం. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ను 2022-23 విద్యాసంవత్సరం నుండే అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు యూనివర్శిటీలలో క్లాస్ 12 మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇచ్చేవారు. ఇక నుండి కామన్ ఎంట్రన్స్ మార్కులను బట్టి ప్రవేశాలు ఉంటాయి. సియుఇటి అత్యధిక సంఖ్యాక విద్యార్థులకు నష్టదాయకం. వారి భవిష్యత్తును అంధకారంలో పడేస్తుంది. ఉన్నత విద్య అభ్యసించాలన్న వారి అభిలాషకు గండి కొడుతుంది. డిగ్రీ చదివేందుకు సెంట్రల్ యూనివర్శిటీలో చేరాలంటే కామన్ ఎంట్రన్స్ తప్పనిసరి చేయడం విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తుంది. కేంద్ర నిర్ణయం కోచింగ్ సెంటర్ల వ్యాపారానికి వాటంగా మారుతుంది. ఇప్పటికే ఇంజనీరింగ్, మెడికల్ ఇత్యాది వృత్తి విద్య ప్రవేశ పరీక్షల కోసం శిక్షణా కేంద్రాలు నడుస్తున్నాయి. ఇక కేంద్ర యూనివర్శిటీలలోని సాధారణ డిగ్రీ కోర్సులకూ కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తాయి. మారుమూల, వెనకబడ్డ, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, బడుగు బహీనవర్గాలు, అల్పాదాయ వర్గాలు, పేదలు కోచింగ్ సెంటర్ల దరిదాపుల్లోకి కూడా వెళ్లలేరు. అలాంటప్పుడు సమాన అవకాశాలు ఎలా సిద్ధిస్తాయి? సామాజిక న్యాయం పరిస్థితేంటి? విస్తారమైన దేశంలో ప్రాంతీయ అసమానతల మాటేంటి? 12వ తరగతి తర్వాత సియుఇటి రాయాలనగానే విద్యార్థుల దృష్టి 10వ తరగతి నుండీ ఆ ఎంట్రన్స్ పరీక్ష మీదే ఫోకస్ అవుతుంది. ఆ పరీక్ష కోసమే చదువుతారు తప్ప సబ్జెక్టు తెలుసుకోవాలనే దృష్టి ఉండదు. ఆబ్జెక్టివ్ టైపు పరీక్షలతో వచ్చే చిక్కే ఇది. దాని వలన సామాజిక శాస్త్రాలు, భాష నేర్చుకోవడం తగ్గిపోతుంది. సామాజిక స్పృహ కూడా కొరవడుతుంది. ప్రశ్నించడమే మరిచిపోయే విధంగా యువతరం తయారవుతుంది. ప్రజాస్వామ్యానికి, సైన్సు పురోగమనానికి ఇది పెద్ద గుదిబండగా మారుతుంది. రాజ్యాంగం ప్రకారం విద్య అనేది కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోనిది. కేంద్రం సియుఇటి వంటి నిర్ణయాలు చేసేటప్పుడు విధిగా రాష్ట్రాలతో చర్చించాలి. మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ఫెడరల్ స్ఫూర్తిని ఏనాడూ పట్టించుకున్న దాఖలా లేదు. అన్నీ ఏకపక్ష నిర్ణయాలే. సియుఇటి వలన రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుందన్న నిపుణుల అభిప్రాయాలనూ విస్మరించింది. పాత విధానంలో అయితే వర్శిటీల్లో ప్రాంతీయ, ఆర్థిక, సామాజిక విభిన్నత సాక్షాత్కరించేది. ఇప్పుడా పరిస్థితి ఉండదు. అందుకే సియుఇటి ప్రతిపాదన రాగానే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాలు ముందుగా స్పందించి వ్యతిరేకించాయి. తమ రాష్ట్ర విద్యార్థులు తమ రాష్ట్రంలోని వర్శిటీల్లో చేరే అవకాశం కోల్పోతారని ఆందోళన చెందాయి. మైనార్టీ స్టేటస్ కలిగిన జెఎంఐ, ఎఎంయు వంటివి ఇప్పటి వరకు తమ సొంత విధానంలో అడ్మిషన్లు ఇచ్చేవి. కామన్ ఎంట్రన్స్ పరిధిలోకి తేవడంతో వాటి స్వయంప్రతిపత్తి ప్రమాదంలో పడింది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏక కాలంలో విద్య కాషాయీకరణకు, విద్యా వ్యాపారానికి పెద్ద ఎత్తున పూనుకుంది. 'ఒకే జాతి- ఒకే ప్రమాణం' పేరుతో ప్రాంతీయ వైవిధ్యాలను విస్మరించి కొద్ది మంది సంపన్నులకు, ఉన్నత కులాల వారికి మాత్రమే అత్యధిక అవకాశాలు దక్కే విధంగా నూతన విద్యా విధానాన్ని రూపొందించింది. వైద్య విద్యలో ప్రవేశానికి నీట్ అయినా, యుపిఎస్‌సి పరీక్షల్లో ప్రాంతీయ భాషలు ఎత్తేస్తామన్నా, ప్రస్తుత సియుఇటి అయినా అందుకే. తమిళనాడు ప్రభుత్వం నీట్‌కు వ్యతిరేకంగా బిల్లు ఆమోదించింది. ఇప్పుడు సియుఇటిని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. మిగతా రాష్ట్రాలూ ఆ కోవలో ప్రయాణించి కేంద్రంపై ఒత్తిడి తెస్తేనే భావి భారత పౌరులైన విద్యార్థులకు భవిష్యత్తూ, యావత్ జాతి మనుగడ.