వైతాళికులు

'సత్యం కోసం పోరాడటానికి కమ్యూనిస్టు ఎల్లప్పుడూ సంసిద్ధంగా వుండాలి. ఎందుకంటే, సత్యం ప్రజల ప్రయోజనాల కనుగుణమైనది. కమ్యూనిస్టు తమ తప్పులను దిద్దుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా వుండాలి. ఎందుకంటే, తప్పులు ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకమైనవి' అంటాడు మావో. అంతేకాదు... 'ప్రజలు భూమిలాంటివారు. కమ్యూనిస్టులమైన మనం విత్తనాల లాంటివారం. మనం ఎక్కడకు వెళ్లినా, మనం ప్రజలతో ఐక్యమవ్వాలి. ప్రజల్లో వేరూని, పెరిగి...వారి మధ్యనే వికసించాలి' అంటాడు. ప్రజా ఉద్యమాల్లో పనిచేసే కమ్యూనిస్టులు పార్టీకి, జనసామాన్యానికి మధ్య సంబంధాలను దృఢపరచడంలో ముందుంటారు. ప్రజలకు స్నేహితుడుగా, ఉపాధ్యాయుడుగా ప్రజలతో ఐక్యమవుతాడు. ఈ క్రమంలో జరిగే మంచి చెడులను చర్చించుకొని ఆచరణ యుక్తంగా, ఆదర్శవంతంగా ప్రజలతో కలిసి అడుగు వేస్తాడు. దేశ ప్రయోజనాలు, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా శ్రమిస్తాడు. అవసరమైతే... దేశం కోసం, ప్రజల కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పిస్తాడు. ఇది కమ్యూనిస్టు వారసత్వం. ఈ వారసత్వాన్ని నిలుపుకోడానికి, సవాళ్లను ఎదుర్కోడానికి నిరంతరం పాటుపడతాడు. ఇలాంటి పోరాటాలను, సవాళ్లను సమీక్షించుకునే కమ్యూనిస్టుల పండుగ కేరళలోని కన్నూరులో జరుగుతోంది. అదే... సిపిఐ(ఎం) 23వ అఖిల భారత మహాసభ. బిగిసిన పిడికిళ్లు... ఎగిసిన ఎర్రజెండాలు... మారుమోగిన నినాదాలతో ''ఎర్రజెండాను విడిచేది లేదు, ఎర్రజెండా నీడనే మునుముందుకు సాగిపోతా''మంటూ కదిలే ఎర్రసైన్యం కవాతు అక్కడ జరుగుతోంది. దేశంలో అనేక పార్టీల మహాసభలను చూస్తుంటాం. ఆయా పార్టీల నాయకుల భజన, పదవుల కోసం తాపత్రయం... ఇవి తప్ప మరోటి కనబడవు. ఎన్నికల్లో గెలవడం అధికారంలోకి రావడం ఒక్కటే పరమావధిగా వారి సభలు, చర్చలు, నాయకత్వ భజనలు, విధేయతలు వుంటాయి. కానీ, కమ్యూనిస్టు మహాసభలు వీటికి పూర్తి భిన్నంగా వుంటాయి. ఈ సభల్లో మొత్తం అంతర్జాతీయ పరిస్థితిపైన, ఆర్థిక పరిణామాలపైన, దేశంలోని పరిణామాలపైనా చర్చిస్తారు. మొత్తం ఒక ప్రాపంచిక దృక్పథాన్ని ప్రజలకు అందించాలనే తపన, లక్ష్యం, ఒక విశాల దృక్పథం ఈ సభల్లో కనబడుతుంది. పొగడ్తలు, శ్లాఘించుకోవడాలు వుండవా? అంటే కచ్చితంగా వుంటాయి. ప్రజల కోసం త్యాగాలు చేసిన అమరవీరుల బలిదానాలను పొగుడుతారు. ఆ త్యాగాల గొప్పతనాన్ని స్మరించుకుంటారు. గతకాలపు ఉజ్వల పోరాటాల వారసత్వం నుంచి తిరిగి ప్రేరణ పొందుతారు. విజయాలు సాధించినప్పుడు జబ్బలు చరుచుకోవడం, ఓటమి చెందినప్పుడు నిందించుకోవడం ఇతర పార్టీల్లో కనబడితే, గెలిచినా ఓడినా... సమిష్టిగా గుణపాఠాలు తీసుకొని, మరింత ఉన్నత శిఖరాలకు ఎదగడానికి మార్గాన్ని సుగమం చేసుకునే దిశగా అడుగులు వేయడం కమ్యూనిస్టు పార్టీలో కనిపిస్తుంది. మరే పార్టీలోనూ లేనివిధంగా తమ రాజకీయ విధానాన్ని రెండు నెలల ముందుగానే ప్రజల మధ్య చర్చకు పెడతారు. కమ్యూనిస్టు పార్టీ ఎజెండా అంటే ప్రజల ఎజెండా అని, ఇందులో ఎలాంటి దాపరికాలకు తావులేదని, ఆచరణలో రుజువుకు నిలబడే పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని చాటి చెబుతారు. ఎన్నికల్లో అధికారంలోకి ఎలా రావాలన్నదే మిగతా పార్టీల ఎజెండాగా వుంటుంది. కానీ, ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎత్తుగడలు తీసుకుందాం... దానికంటే ముందు ప్రజలను ఆదుకోవడం, ప్రజలపై పడుతున్న భారాలను ఎదుర్కోవడం, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం, రాజ్యాంగ స్వభావాన్ని, ప్రజల సమైక్యతను కాపాడటం, వే ప్రధానమని కమ్యూనిస్టులు కన్నూరులో అంటున్నారు. ఇంకే పార్టీ అయినా ఈ విధంగా ముందుకొచ్చి చెప్పే పరిస్థితి వుందా? హిందూత్వ-కార్పొరేట్‌ విధానాలపై రాజీ లేని పోరు సలుపుతామని, దేశ సమగ్రతను, సమైక్యతను నాశనం చేయాలనుకునే శక్తులను ఏకాకిని చేస్తామని జబ్బ చరిచి మరీ చెప్పగల దమ్ము ఒక్క కమ్యూనిస్టు పార్టీది మాత్రమే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెభాగా పోరాటం, పున్నప్ర వాయిలార్‌ పోరాటం, కయ్యూరు వీరుల బలిదానం... దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాలలో కమ్యూనిస్టులు పోషించిన పాత్ర నేటికీ స్ఫూర్తివంతంగా నిలిచే ఉద్యమ వారసత్వం. ఆ వారసత్వ స్ఫూర్తిని నవతరానికి అందించే సభలు ఇవి. దేశం ఎదుర్కొంటున్న సంక్షోభానికి, ప్రజా సమస్యలకు పరిష్కారాన్ని ఆలోచించడం, చర్చించడం, ఒక ఎజెండాను రూపొందించడం ఈ సభల్లో చేస్తారు. ఆ అరుణ కాంతుల దిశలో ప్రజా సమస్యలను తలకెత్తుకొని పోరాటపథంలో పయనించడానికి ఈ సభలు రూపొందించిన ఎజెండా ఒక టార్చ్‌ బేరర్‌గా నిలుస్తుంది. ప్రజాసమస్యల పరిష్కారానికి ముందడుగుగా మారుతుంది.