అమరావతి అఫిడవిట్‌

రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన తాజా అఫిడవిట్‌ రాజధాని వివాదాన్ని ఇంకా కొనసాగించే ఉద్దేశాన్ని సూచిస్తోంది. రాజధానిలో, రాజధాని ప్రాంతంలో ప్రధాన మౌలిక పనులను నెల రోజుల్లో పూర్తి చేయాలని, భూములిచ్చిన రైతులకు మూడు మాసాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను స్వాధీనం చేయాలని, ఆర్నెల్లలో రాజధానిని నిర్మించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ అమరావతిపై వ్యాజ్యాలలో మార్చి 3న హైకోర్టు తీర్పు వెలువరించింది. దానిపై నెల రోజులకు సర్కారు స్పందించి పనులన్నీ పూర్తి చేయడానికి ఐదేళ్లు కావాలని గడువు కోరింది. కాగా ఐదేళ్ల గడువు అడగడానికి స్పష్టమైన ప్రాతిపదిక, హేతువులేమీ తెలపక పోవడంతో కాలయాపన కోసం, కోర్టు ఆదేశాల అమలు నుండి తాత్కాలికంగా తప్పించుకోడానికేనని తప్పక అనుమానం కలుగుతుంది. అఫిడవిట్‌ లోనే పనులకు గడువులు ఎత్తేయాలని ఒక వైపు అభ్యర్ధిస్తూ మరో వైపు ఐదేళ్ల సమయం కావాలనడం విడ్డూరం. నిర్దిష్ట కాలావధులు నిర్ణయించడంకానీ, ఇంత డబ్బు ఖర్చు పెడతామనికానీ, ఫలానా సమయానికి ఇంత అభివృద్ధి చేస్తామనికానీ చెప్పలేమనడం పలాయన వాదమే. రాజధాని నిర్మాణం వంటి ప్రధాన కర్తవ్య సాధనకు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ లేకుండా ఏ పనికీ గడువు అడగొద్దనడం పలాయన వాదమే. కోర్టు తీర్పు అమలుపై న్యాయపరంగా ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నామని పేర్కొని రాజధానిగా అమరావతికి సుముఖం కాదని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో చెప్పకనే చెప్పింది. కాబట్టి ఐదేళ్ల గడువును కుంటిసాకుగానే పరిగణించాలి. టిడిపి హయాం ఐదేళ్లలో కాని రాజధాని ఆర్నెల్లలో కావాలన్న న్యాయస్థానం ఆదేశం అంతగా ఆచరణ సాధ్యం కాకపోవచ్చు. కానీ ఇప్పటికీ వైసిపి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా జీర్ణించుకోకపోవడమే అసలు సమస్య. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా రాజధానిపై గందరగోళం, అయోమయాన్ని కొనసాగించడం యావత్‌ రాష్ట్రానికీ నష్టదాయకం. రాజధాని అనేది న్యాయస్థానానికి, ప్రభుత్వానికి మధ్యనో, లేదంటే అధికార వైసిపికి, ప్రతిపక్ష టిడిపికి మధ్యనో సమస్య కానేకాదు. ఐదున్నర కోట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలందరికీ సంబంధించినది. ఈ విషయాన్ని వైసిపి ప్రభుత్వం బాధ్యతగా స్వీకరించట్లేదు. అమరావతిని రాజధానిగా నిర్ణయించేటప్పుడు నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసిపి తాను సైతం జైకొట్టింది. ఇప్పుడేమో న్యాయస్థానం చెప్పినా తన అసంబద్ధమైన మూడు రాజధానుల మంత్రాన్ని విడనాడట్లేదు. మెజార్టీ పార్టీల ఆమోదంతోనే అమరావతి నిర్ణయమైంది. ప్రజల ఆకాంక్ష, అభిప్రాయం సైతం ఇంచుమించు అలాగే వ్యక్తమైంది. రాష్ట్ర పాలన ఒకే చోటు అమరావతి నుండి సాగాలని, అభివృద్ధిని వికేంద్రీకరించాలని, వికేంద్రీకరణ అంటే రాజధానుల విభజన కాదనే వాస్తవాన్ని వైసిపి తలకెక్కించుకోవట్లేదు. ఈ వైఖరి రాష్ట్రానికి దిశ లేకుండా చేస్తుంది. రాజధాని అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధుల సమస్యను కారణంగా చూపడం ఎంతమాత్రం సహేతుకం కాదు. ప్రజల సంక్షేమాన్ని, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను రాజధానితో పోటీ పెట్టడం తగనిపని. అమరావతి నిర్మాణానికి రూ.లక్ష కోట్లు కావాలని గత ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసి, రూ.62 వేల కోట్ల డిపిఆర్‌లు పంపిందని, దానిపై కేంద్రం వివరణ కోరితే పంపే పనిలో ఉన్నామని అఫిడవిట్‌లో ప్రభుత్వం ప్రస్తావించింది. పునర్వ్యస్థీకరణ చట్టంలో రాజధాని నిర్మాణానికి నిధులన్నీ కేంద్రమే భరించాలని స్పష్టంగా ఉంది. భారీ ప్రణాళికలేసిన టిడిపి ప్రభుత్వం, అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోడీని పిలవగా, ఆయన గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లిచ్చి అదే తమ సాయమన్నారు. అయినా అప్పటి సర్కారు కేంద్రాన్ని నిధులడగలేదు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం సైతం కేంద్రాన్ని నిధులడగకుండా గమ్మునుంది. అమరావతిపై ప్రధాన ముద్దాయి కేంద్ర బిజెపి కాగా గతంలో టిడిపి, ఇప్పుడు వైసిపి అవకాశవాదంతో వ్యవహరించి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టాయి. కోర్టు తీర్పుతోనైనా ప్రభుత్వం రాజధానిగా అమరావతిని ప్రకటించి అయోమయానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. చిత్తశుద్ధితో అభివృద్ధి పనులు చేపట్టాలి. అన్ని పార్టీలనూ కలుపుకొని రాజధాని నిర్మాణానికి కావలసిన నిధుల కోసం కేంద్రంపై పోరు సల్పాలి.