ప్రజా ఉద్యమాల్లో నిగ్గుతేలిన స్వతంత్ర పంథా

చరిత్రలో సిపిఎం 2 రివిజనిజంతో తెగతెంపులు చేసుకున్న సిపిఎం- బర్ద్వాన్‌ ప్లీనంలో అతివాద పెడ ధోరణి నుంచి కూడా స్పష్టంగా వేరుపడింది. అటు రష్యా మార్గం, ఇటు చైనా మార్గం అని కాక భారతదేశ నిర్ధిష్ట పరిస్థితులకు అనుగుణంగా రూపొందించుకున్న స్వతంత్ర పంథాలో ముందుకు సాగింది. దేశవ్యాపితంగా ప్రజా ఉద్యమాలను, పోరాటాలను నిర్వహించింది. సిపిఎం పంథా సరైందని ప్రజలు నిరూపించారు. కేరళ, బెంగాల్‌, త్రిపురలో కూడా అధిక సంఖ్యలో ఆ పార్టీ అభ్యర్థులను ఎన్నుకొన్నారు. 
    సిపిఎం ఏడవ మహాసభలో కార్యక్రమాన్ని, ఇతర డాక్యుమెంట్లను ఆమోదించినప్పటికీ సిద్ధాంత సమస్యలపై సమగ్ర చర్చను వాయిదా వేసింది. సిద్ధాంత సమస్యలపైనా, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో విభేదాలపైనా చర్చించి ఒక నిర్ణయానికి రావడానికి ప్రత్యేకంగా ఒక ప్లీనం జరపాలని భావించింది. పశ్చిమ బెంగాల్‌లోని బర్ద్వాన్‌లో 1968 ఏప్రిల్‌లో ఈ ప్లీనం జరిగింది. దీనికి ముందే కేంద్ర కమిటీ ఒక తీర్మానాన్ని ఆమోదించి, చర్చ కోసం కింది కమిటీలకు విడుదల చేసింది. దీనిపై జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్లీనం సమావేశాలు జరిగాయి. రివిజనిజంపై ఏడవ మహాసభలో నిర్ణయాత్మకంగా తెగతెంపులు చేసుకొని ఏకాభిప్రాయంతో ఉన్నప్పటికీ, రివినిజంపై వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మరొక రకమైన పెడధోరణి చోటు చేసుకొంది. ఆ అతివాద ఒంటెత్తు ధోరణికి చైనా కమ్యూనిస్టు పార్టీ మద్దతు సంపూర్ణంగా లభించింది. భారత రాజ్యాంగ యంత్రం పట్ల సిపిఎం వర్గ విశ్లేషణ తప్పని, నెహ్రూ ప్రభుత్వం దళారీ బూర్జువా వర్గానికి సాధనమని, అమెరికన్‌ సామ్రాజ్యవాదులకు బంటుగా పని చేస్తుందని ప్రచారం చేసింది. ఈ పెడ ధోరణుల నుంచి బర్ద్వాన్‌ ప్లీనంలో సిపిఎం స్పష్టంగా విడగొట్టుకొంది. అంతేకాదు; అంతర్జాతీయ సమస్యలపై తన స్వతంత్ర పంథాను స్పష్టం చేసింది. 'సోవియట్‌ పార్టీ నాయకత్వం, సోవియట్‌ యూనియన్‌ అనుసరిస్తున్న రాజీ ధోరణులను, వర్గ సంకర విధానాలను వ్యతిరేకిస్తున్నామంటే సోవియట్‌ యూనియన్‌ అమెరికా మిత్రునిగా మారిపోయిందని భావించడం కాదు. అమెరికాతో పాటు ప్రపంచాధిపత్యాన్ని పంచుకునేందుకు కృషి చేస్తున్నదని చెప్పడమూ కాదు. అలా చేయడమంటే సోవియట్‌ యూనియన్‌ను సోషలిస్టు శిబిరానికి వెలుపల ఉంచడమే' అన్న అంశంపై అతివాదుల అభ్యంతరాలను తోసిపుచ్చి తీర్మానంలో కొనసాగించింది. సిపిఎం ఆవిర్భవించిన దగ్గర నుంచి స్వతంత్ర పంథాను చేపడుతూ వచ్చింది. అందువల్లనే సోవియట్‌ యూనియన్‌ కుప్పకూలి సోషలిస్టు శిబిరానికి తీవ్రమైన ఎదురుదెబ్బలు తగిలిన సమయంలో కూడా సిపిఎం చలించకుండా దృఢంగా నిలబడింది. అంతర్జాతీయంగా కమ్యూనిస్టు పార్టీలను ఒక వేదికపై తీసుకువచ్చి చర్చించడానికి కూడా కృషి చేసింది.
    ఒక విధానం సరైందా కాదా అన్నది తేలేది ఆచరణలోనే. తన విధానాన్ని ఆచరణలో పెట్టడానికి ట్రేడ్‌ యూనియన్‌ రంగంలోను, రైతు రంగంలోను, పార్టీ నిర్మాణంలోను ప్రత్యేకంగా తీర్మానాలను రూపొందించుకొని సిపిఎం ముందుకుసాగింది. ఈ కాలంలో అనేక ప్రజా ఉద్యమాలను దేశ వ్యాపితంగా నిర్వహించింది. పార్టీ బలంగా వున్న బెంగాల్‌, కేరళ, త్రిపురలో ఉధృతమైన పోరాటాలు జరిగాయి. సిపిఎం విధానం సరైందని మొట్టమొదటిసారిగా 1965లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయి. ఆనాడు సిపిఎం నాయకులు జైళ్ళలో ఉండి నామినేషన్లు వేసినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో వారిని గెలిపించారు. 1967 జనరల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడి, 8 రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. కేరళ, బెంగాల్‌లలో సిపిఎం ప్రధాన పార్టీగా అవతరించింది. త్రిపురలో బలం పెంచుకొంది. అనేక కాంగ్రెసేతర రాష్ట్ర ప్రభుత్వాల్లో పాలు పంచుకోమని ఆహ్వానాలు అందినప్పటికీ.. తాను ప్రభుత్వ విధానాలను శక్తివంతంగా ప్రభావితం చేయగలిగితే తప్ప ప్రభుత్వాల్లో భాగస్వామి కారాదని సిపిఎం సూత్రబద్ధమైన వైఖరి తీసుకొంది. కెేరళలో సిపిఎం నాయకత్వాన మిశ్రమ ప్రభుత్వం ఏర్పడగా, బెంగాల్‌లో సిపిఎం ప్రధాన భాగస్వామిగా ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వాల పరిమితులను గుర్తిస్తూ ప్రజలకు చేయకలిగినంత సేవ చేస్తూ పార్టీ విశిష్టతను ఆచరణలో తెలియచెప్పాలని పార్టీ తన మంత్రులను ఆదేశించింది. ఇటువంటి పూర్వరంగంలో సిపిఎం 8వ మహాసభ 1968 డిసెంబర్‌లో కేరళలోని కొచిన్‌లో జరిగింది. పాలకవర్గం ఎంత ఉధృతంగా దాడులు చేసి, ఒంటరిపాటు చెయ్యాలని ప్రయత్నించినా పార్టీ ప్రజల్లో ఉండి పనిచేయడం వల్ల దృఢంగా నిలబడిందని మహాసభ గుర్తించింది. మితవాద, అతివాద ధోరణులకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తూ, మార్క్సిజం - లెనినిజాన్ని భారతదేశ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించుకుంటూ ముందుకు సాగాలని తీర్మానించింది.