ఉగాదికి విద్యుత్ షాక్

విద్యుత్‌ చార్జీల భారాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యులే. ఇందులో ప్రధాన ముద్దాయి కేంద్రం, మోడీ ప్రభుత్వం. ఒకనాడు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ రంగంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలను ప్రజలు తిప్పికొట్టారు. అదే సంస్కరణలు నేడు కేంద్ర ప్రభుత్వం తన విధానాల పేరుతో అమలు చేస్తోంది. కేంద్ర విద్యుత్‌ చట్టానికి సవరణలకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం కేంద్ర విద్యుత్‌ చట్ట సవరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా నిలబడింది. ప్రస్తుతానికి చట్ట సవరణ చేయకపోయినా అనేక రూపాలలో ఆ ప్రమాదకరమైన విధానాల అమలుకు పూనుకుంటున్నాయి. రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ చార్జీల భారాన్ని ఉగాది కానుకగా ఇచ్చింది. రూ. 4300 కోట్లకు పైగా భారాన్ని మోపింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల పెట్రోలు, డీజిల్‌, వంట నూనెలు, నిత్యావసరాలన్నీ పెరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏనాడూ లేని చెత్త పన్ను భారం వేసింది. ఆస్తి పన్నులు పెంచింది. ఇప్పుడు విద్యుత్తు బాదుడు తోడయ్యింది. ఎన్నికలకు ముందు జగన్‌ మోహన్‌ రెడ్డి గత టిడిపి ప్రభుత్వాన్ని 'బాదుడే బాదుడు' అంటూ విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే కరెంటు చార్జీలు తగ్గిస్తామని, 200 యూనిట్ల లోపు వాడుకునే వారందరికీ ఉచితంగా కరెంటు ఇస్తానని మాట ఇచ్చారు. ఆ హామీని తుంగలో తొక్కి ప్రజలకి కరెంట్‌ షాక్‌ ఇచ్చారు. ఇది స్వల్ప పెరుగుదల మాత్రమేనని, ఇతర రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రంలో కరెంటు చార్జీలు తక్కువగా ఉన్నాయని, ప్రజలు త్యాగాలు చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు, ప్రభుత్వ పెద్దలు బుకాయిస్తున్నారు. రాష్ట్రంలోని కోటి 70 లక్షల విద్యుత్‌ వినియోగించే కుటుంబాలపై ఈ భారం పడుతుంది. మరో 20 లక్షల మంది వినియోగదారులపై పరోక్ష భారం తప్పదు. గత 20 సంవత్సరాల కాలంలో ఏ ప్రభుత్వమూ 50 యూనిట్ల లోపు వాడుకునే పేదల జోలికి రాలేదు. ఈ ప్రభుత్వం 30 యూనిట్ల లోపు వాడుకునే నిరుపేదలను కూడా వదలలేదు. పేదలు, దిగువ మధ్యతరగతి లక్ష్యంగా ఈ చార్జీలు పెంచింది. 30 యూనిట్ల లోపు వాడుకునేవారిపై 30 శాతం, 75 యూనిట్లు వాడేవారిపై 44 శాతం, 125 యూనిట్ల లోపు వాడుకునే వారిపై 45 శాతం వరకు వడ్డించింది. 400 ఆపైన వాడుకునేవారికి ఒక శాతం లోపు మాత్రమే పెరిగింది. అంటే ధనికులకు వరాలు, పేదలకు భారాలు మిగిల్చింది. ఈ చార్జీల పెంపు ద్వారా రూ. 1,400 కోట్ల భారం ప్రజలపై పడుతుంది. ఇదే కాకుండా ట్రూ అప్‌ చార్జీల పేరుతో 2014 -19 వరకు వాడుకున్న విద్యుత్‌పై మరో రూ. 2900 కోట్ల భారం వేశారు. ఈ దుర్మార్గమైన చార్జీల పేరుతో 36 నెలలపాటు నెలకు పెంచిన బిల్లులతో పాటు, యూనిట్‌కు అదనంగా 23 పైసల చొప్పున వసూలు చేస్తారు. అంటే దాదాపు రెండూ భారాలు కలిపి యూనిట్‌కు 68 పైసల నుండి రూపాయి ఎనభై పైసల వరకు చార్జీలు పెరుగుతాయి. ప్రజలకు మాత్రం ఇది అధిక భారమే. 300 యూనిట్లు దాటితే వారి కార్డులు రద్దు చేసి, సంక్షేమ పథకాలు తొలగిస్తున్నారు. ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం 300 యూనిట్ల లోపు వాడేవారిని లక్ష్యంగా చేసుకుని ఈ చార్జీల భారాన్ని వారిపై అధికంగా వేయడం అన్యాయం. గత ప్రభుత్వాల మాదిరిగానే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా దొడ్డిదారిన ప్రజల కళ్ళకు కనపడకుండా విద్యుత్‌ భారాలు మోపుతోంది. మూడేళ్లలో స్లాబ్‌లు మార్చి భారం మోపింది. ఇంట్లో అదనపు గృహోపకరణాలు (టీవీ, ఫ్రిజ్‌, ఏసీ) కొనుగోలు చేస్తే దానిపై వినియోగించుకునే కరెంటుకు బిల్లు కడుతున్నా, అదనపు డిపాజిట్ల పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇవే కాకుండా కస్టమర్‌ చార్జీలు, స్థిర చార్జీలు, విద్యుత్‌ సుంకాలు, పెనాల్టీలు ఇలా అనేక రూపాలలో అసలు చార్జీలతో పాటు కొసరు చార్జీలు ఉంటాయి. విద్యుత్‌ పంపిణీ సంస్థలు 82 వేల కోట్ల రూపాయలు అప్పులో ఉన్నాయని, 27 వేల కోట్ల రూపాయల వరకు నష్టాల్లో ఉన్నాయని, పూడ్చాలంటే చార్జీలు పెంచక తప్పదని పాలకులు నమ్మబలుకుతున్నారు. ఇది నిజమా? వేరే ప్రత్యామ్నాయం లేదా? ఎందుకు నష్టాలు వస్తున్నాయి? కారకులెవరు? పరిశీలించాల్సిందే. విద్యుత్‌ చార్జీల భారాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ బాధ్యులే. ఇందులో ప్రధాన ముద్దాయి కేంద్రం, మోడీ ప్రభుత్వం. ఒకనాడు ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ రంగంలో ప్రపంచ బ్యాంకు సంస్కరణలను ప్రజలు తిప్పికొట్టారు. అదే సంస్కరణలు నేడు కేంద్ర ప్రభుత్వం తన విధానాల పేరుతో అమలు చేస్తోంది. కేంద్ర విద్యుత్‌ చట్టానికి సవరణలకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం కేంద్ర విద్యుత్‌ చట్ట సవరణ ప్రయత్నాలకు వ్యతిరేకంగా నిలబడింది. ప్రస్తుతానికి చట్ట సవరణ చేయకపోయినా అనేక రూపాలలో ఆ ప్రమాదకరమైన విధానాల అమలుకు పూనుకుంటున్నాయి. కరోనా కష్టకాలంలో రాష్ట్రాలకు రుణ పరిమితి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులను పెట్టింది. మన రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం షరతులను అంగీకరించి రుణ పరిమితిని పెంచుకున్నది. విద్యుత్‌ రంగానికి 2,500 కోట్ల రూపాయలకు పైగా అప్పు తెచ్చుకున్నది. భవిష్యత్తులో ధనికులతో సమానంగా పేదలకు, అందరికీ ఒకటే స్లాబు ఉండాలనే షరతు ముఖ్యమైనది. విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చు మొత్తాన్ని, పేదలతో సహా అందరి నుండి రాబట్టాలి, క్రాస్‌ సబ్సిడీలు రద్దు చేయాలి. విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రైవేటీకరించాలి. ఇదే కేంద్ర సంస్కరణల సారం. కేంద్రం సంస్కరణలకు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అంగీకరించింది. ధనికుల అధికంగా వాడే కరెంటు స్లాబులకు రేటు పెంచకుండా, పేదలు, దిగువ మధ్యతరగతి వాడే వారికి భారీగా పెంచడం ఈ కుట్రలో భాగమే. విద్యుత్‌ అందించడం ప్రభుత్వ బాధ్యతగా కాకుండా విద్యుత్‌ని ఒక సరుకుగా మార్చేశారు. మోడీ చూపిన ఈ దారిలోనే జగన్‌ మోహన్‌ రెడ్డి నడుస్తున్నారు. పెట్రోలు, డీజిల్‌ ప్రతిరోజు రేటు పెంచినట్టే, భవిష్యత్తులో విద్యుత్‌కు నెల నెలా రేట్లు సవరించే ప్రమాదం రావచ్చు. ఇప్పుడు ప్రతి మూడు నెలలకు అదనంగా అయ్యే ఖర్చును బట్టి ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో అదనంగా భారం పెంచే ప్రక్రియ అమలులో పెట్టారు. విద్యుత్‌ ఉత్పత్తికి, పంపిణీకి ఖర్చు పెరగడానికి ఉద్యోగులు, ప్రజలు బాధ్యులు కారు. ప్రభుత్వ విధానాలే కారణం. ఇప్పటికే 47 శాతం విద్యుత్తు ప్రైవేటు కంపెనీల నుండి కొనుగోలు చేస్తున్నారు. ఇది కాకుండా ప్రతి రోజు స్వల్పకాలిక కొనుగోళ్లు చేస్తున్నారు. ఇందులో కార్పొరేట్‌ కంపెనీలకు లాభాలు చేకూర్చడం, పాలక పార్టీ నేతలు జేబులు నింపుకోవడం, అవినీతికి పాల్పడటం షరామామూలుగా మారిపోయింది. అంతేకాదు కరెంటు తయారు చేయటానికి వినియోగించే బొగ్గు, గ్యాస్‌ తదితర ముడిసరుకు కేంద్ర ప్రభుత్వ గుప్పెట్లో ఉన్నాయి. కేంద్రం వీటిని కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తోంది. వారు రేట్లు పెంచేస్తున్నారు. కొరత సృష్టిస్తున్నారు. విదేశాల నుండి దిగుమతి చేస్తున్నారు. ఈ భారం అంతా పరోక్షంగా విద్యుత్‌ వినియోగదారులపై పడుతోంది. ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి. కార్పొరేట్ల ఖజానాలు నిండుతున్నాయి. గతంలోని తెలుగుదేశం ప్రభుత్వం ప్రైవేటు విద్యుత్‌ కంపెనీలతో దీర్ఘకాలిక ఒప్పందాలు (పిపిఎ) చేసుకొని అధిక రేట్లకు కరెంట్‌ కొనుగోలు చేయడంవల్ల దోపిడీ సాగుతోందని, వీటికి అడ్డుకట్ట వేస్తామని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పింది. ఈ విద్యుత్‌ ఒప్పందాలను పున:సమీక్ష చేస్తామని గొప్పగా ప్రకటించింది. మొదట్లో కొంత హడావిడి చేశారు. ప్రైవేటు విద్యుత్‌ కంపెనీలు కోర్టులకు వెళ్లాయి. కేంద్ర ప్రభుత్వంతో సహా ఇతర బూర్జువా పార్టీలు, మీడియా గగ్గోలు పెట్టింది. చివరకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా చల్లబడింది. గత టీడీపీ ప్రభుత్వం 25 సంవత్సరాల పాటు చేసుకున్న ఒప్పందాలను వ్యతిరేకించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నేడు అదే దారిలో నడుస్తున్నది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా అదానీ సంస్థతో సోలార్‌ విద్యుత్‌ కొనుగోలుకు 25 సంవత్సరాల ఒప్పందం ఈ ప్రభుత్వం ఆగమేఘాల మీద చేసింది. ఇందులోనూ కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగిపోయిందని విమర్శలు ఉన్నాయి. ఒకనాడు పది రూపాయలకు కొన్న సోలార్‌ విద్యుత్‌ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది రెండు రూపాయలకు తగ్గింది. ఇంకా భవిష్యత్తులో తగ్గిపోతుంది. అయినా 25 ఏళ్ల పాటు యూనిట్‌కు రెండు రూపాయల యాభై పైసలు చెల్లించే విధంగా ఈ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం ఏమిటి? 7 వేల మెగావాట్ల విద్యుత్తు అధికంగా కొనుగోలు చేస్తే ప్రభుత్వ విద్యుత్‌ సంస్థలలో తయారయ్యే విద్యుత్తు ఏం చేస్తారు? ఈ భారమంతా ఎవరు మోస్తారు? ప్రజలపై వేయాల్సిందే. గత ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ కంపెనీలతో తగాదా తప్ప, ప్రైవేట్‌ విద్యుత్‌ విధానంపై వైసిపి కి తేడా లేదు. ఇందులో బిజెపి, వైసిపి, టిడిపి అందరిదీ ఒకటే దారి. ఈ ప్రమాదం రేపు రైతుల ఉచిత విద్యుత్‌కు ఎసరు పెడుతుంది. ఎస్సీ, ఎస్టీ, వృత్తిదారులు ఇతర వర్గాల ఉచిత విద్యుత్‌ ప్రమాదంలో పడుతుంది. కేంద్రం విధానాలకు లొంగిపోయి రైతుల మోటార్లకు మీటర్ల బిగిస్తున్నారు. బిల్లు వచ్చినా ఆ బిల్లు ప్రభుత్వమే భరిస్తుందని, వైయస్సార్‌ కాంగ్రెస్‌ నేతలు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం ఇస్తారు. కానీ భవిష్యత్‌ ఏమిటి? వంట గ్యాస్‌ సబ్సిడీ బ్యాంకులో వేస్తామని చెప్పి, ఇప్పుడు ఆ సబ్సిడీ ఏమైంది? సున్నా చుట్టారు. ఉద్యోగుల వేతనాలు సకాలంలో చెల్లించలేని ప్రభుత్వాలు రేపు రైతులకు సబ్సిడీ ఇస్తారని గారంటీ ఏమిటి? నెమ్మదిగా, దశలవారీగా ఉచిత విద్యుత్‌ నుండి ప్రభుత్వాలు తప్పుకోవడానికి ప్రయత్నిస్తాయి. అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి. ప్రీ పెయిడ్‌ స్మార్ట్‌ మీటర్ల బిగించడానికి ఇతర సంస్కరణల అమలుకు 'రీవాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌ స్కీం' పేరుతో రూ. 17,625 కోట్ల ప్రాజెక్టు అమలుకు రంగం సిద్ధం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు ఫోన్‌లో ముందు బ్యాలన్స్‌ వేసుకున్నట్లే, కరెంటుకు ముందు బ్యాలెన్స్‌ వేయించుకుంటే బ్యాలెన్స్‌ ఉన్నంతవరకు కరెంటు ఉంటుంది. మళ్లీ బ్యాలెన్స్‌ వేయించుకుంటే కరెంటు వస్తుంది. ఇది ఆఫీసులకే కాదు. ఇళ్లకు త్వరలో రాబోతుంది. డబ్బు ఉంటే బ్యాలెన్స్‌ వేయించుకోవటం లేకపోతే కారు చీకట్లో మగ్గటమే. సంస్కరణల పేరుతో ఇటువంటి ప్రమాదకర పద్ధతులు మరిన్ని రాబోతున్నాయి. వీటివల్లనే ఖర్చులు పెరుగుతున్నాయి. అప్పులు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు చెల్లించాల్సిన సబ్సిడీలు విద్యుత్‌ సంస్థలకు చెల్లించడం లేదు. ప్రజల సొమ్మును పాలకులు కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. అవినీతి, దుబారా పెరిగిపోయింది. వీటన్నిటి వలన ఖర్చులు పెరుగుతున్నాయి. సామాన్యులపై వీటిని రుద్దుతున్నారు. వీటన్నిటినీ నియంత్రించాల్సిన ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ప్రేక్షక పాత్ర వహిస్తోంది. ప్రభుత్వాలు చేతులు దులుపుకుని నియంత్రణ మండలి సాకుతో వారు తప్పించుకుంటున్నారు. ప్రైవేటుగా విద్యుత్‌ కొనడమే కాదు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లోని దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ను 25 ఏళ్ల పాటు ప్రైవేటు విద్యుత్‌ కంపెనీలకు సంస్థలకు కట్టబెట్టడానికి మంత్రి వర్గం తీర్మానం చేసింది. ఇది తొలి అడుగు. రాబోయే కాలంలో ప్రభుత్వ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలన్నింటిని అమ్మేస్తారు. ఉత్పత్తి, పంపిణీ ప్రైవేటు, కార్పొరేట్లకు చేతిలో పెడితే మొత్తం దొంగల దోపిడీనే. ఇప్పటికే ప్రభుత్వ ధర్మల్‌ పవర్‌ ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చు అధికంగా ఉందని వాటి ఉత్పత్తి తగ్గించేసి ప్రైవేటుగా స్వల్పకాలిక కొనుగోలు పేరుతో భారీగా కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ విద్యుత్‌ రంగాన్ని నాశనం చేయటమే దీని లక్ష్యం. విద్యుత్‌ చార్జీల పెంపు సామాన్యుడి నడ్డి విరిచింది. దీనికి కారణమైన ప్రభుత్వ విధానాల ప్రమాదం మరింత తీవ్రమైంది. తక్షణ ఛార్జీల పెంపు రద్దు చేయాల్సిందే. మరోవైపు ప్రమాదకర విద్యుత్‌ సంస్కరణలు అడ్డుకోవాలి. వాటి వేగానికి బ్రేకులు వేయాల్సిందే. ఇతర బూర్జువా పార్టీలు చార్జీల పెంపుపై కన్నీళ్లు కారుస్తాయి. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్కరణల విషయంలో అందరిదీ ఒకటే దారి. సిపిఎం, వామపక్షాలు మాత్రమే దశాబ్దాలుగా ఈ విధానాలపై పోరాడుతున్నాయి. 1997లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రారంభించిన ప్రపంచ బ్యాంకు విద్యుత్‌ సంస్కరణలపై పెద్దఎత్తున పోరు సాగింది. 2000 సంవత్సరంలో ఉద్యమం ఉధృతం అయింది. హైదరాబాద్‌ లోని బషీర్‌ బాగ్‌లో కాల్పులు జరిపి ముగ్గురు కార్యకర్తలను నాటి ప్రభుత్వం పొట్టన పెట్టుకున్నది. ప్రపంచ బ్యాంకు సంస్కరణలు బట్టబయలయ్యాయి. ప్రజాగ్రహంతో ప్రభుత్వం గద్దె దిగింది. చార్జీల భారం కొద్ది సంవత్సరాల పాటు ఆగింది. అయినా దొడ్డిదారిన ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సిగ్గుగా వాటినే అమలు చేస్తున్నాయి. అందుకే ప్రజలు చార్జీల పెంపుపై పోరాటంతోపాటు ప్రమాదకర విధానాలపై పోరుకు సిద్ధం కావాలి. (వ్యాసకర్త - సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు) సిహెచ్‌. బాబూరావు