భారత కమ్యూనిస్టు ఉద్యమంలో మూలమలుపు

చరిత్రలో సిపిఎం-1

అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంతో భారత కమ్యూనిస్టు ఉద్యమాన్ని విడదీసి చూడలేం. 1914-18 మధ్య మొదటి ప్రపంచ యుద్ధకాలంలో రష్యన్‌ విప్లవ ప్రభావంతో భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఆవిర్భవించింది. భారత స్వాతంత్య్రోద్యమంలో భాగంగా జర్మనీ, అమెరికా తదితర దేశాల్లో పనిచేస్తూ, అక్టోబరు విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టులై భారత్‌ తిరిగివచ్చినవారూ, ఖిలాఫత్‌, హిజ్రత్‌ ఉద్యమాలపై అక్టోబరు విప్లవప్రభావంవల్ల కమ్యూనిస్టులైనవారూ, గదర్‌ పార్టీ నుంచి కమ్యూనిస్టులుగా మారినవారూ, భారతదేశంలోనే రష్యా విప్లవ ప్రభావంతో కమ్యూనిస్టులైన అతివాద కాంగ్రెస్‌ వారూ - ఇలా వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఉద్యమకారులు భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీకి పునాది వేశారు. 1920 అక్టోబరులో తాష్కెంట్‌లో పనిచేస్తున్న కమ్యూనిస్టులు ఎం.ఎన్‌.రారు ప్రభృతులతో కలిసి భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించారు. ఆ తరువాత బంబాయి, బెంగాల్‌ మొదలైన రాష్ట్రాల్లో చిన్నచిన్న గ్రూపులుగా వున్న కమ్యూనిస్టులు 1925 డిసెంబరు 26న కాన్పూర్‌లో తొలి మహాసభ జరిపి కమిటీని ఎన్నుకున్నారు. ఆ విధంగా ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్రోద్యమంలో ముఖ్యపాత్ర వహించింది. సంపూర్ణ స్వాతంత్య్రం కోసం తొలిసారి నినదించింది కమ్యూనిస్టులే. ప్రజాసంఘాల ద్వారా రైతు కార్మిక పోరాటాలను నడిపింది కమ్యూనిస్టులు. హైదరాబాద్‌ సంస్థానం విముక్తి కోసం సాగిన తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం చరిత్రలో మహత్తరమైనది. భారతదేశ విప్లవానికి దిక్సూచిగా మారింది. అయితే పార్టీలో సైద్ధాంతిక విబేధాలు కూడా ఆకాలంలోనే ప్రారంభమయ్యాయి. చివరికి అది 1964లో సి.పి.ఐ.(యం) ఏర్పాటుకు దారితీసింది. 1964.. భారతకమ్యూనిస్టు ఉద్యమంలో నిజంగా ఒక మూలమలుపు. ఆ సంవత్సరంలోనే కలకత్తాలో పార్టీ 7వ మహాసభ జరిగింది. డిసెంబరు మాసంలో జరిగిన ఆ మహాసభలోనే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆవిర్భవించింది. దశాబ్దకాలానికి పైగా ఉమ్మడి పార్టీలో జరిగిన తీవ్రమైన సైద్ధాంతిక పోరాటానికి తుది ఘట్టం ఈ మహాసభ. కమ్యూనిస్టు పార్టీ విప్లవాన్ని సాధించి సమాజంలో మౌలిక మార్పు కోసం పోరాడుతుంది. దోపిడీవర్గ పాలన స్థానంలో కార్మికవర్గం నాయకత్వాన కష్టజీవుల రాజ్యాన్ని సాధించడమే ఈ విప్లవం లక్ష్యం. విప్లవాన్నిసాధించాలంటే కచ్చితమైన పథనిర్దేశం అవసరం. వర్గ శత్రువులు ఎవరు అన్న విషయంపై స్పష్టమైన అవగాహన తప్పనిసరి. ఈ మౌలిక విషయాలపైనే భారత కమ్యూనిస్టు ఉద్యమంలో విభేదాలు నెలకొన్నాయి. స్వాతంత్య్రానంతరం అధికారంలోకి వచ్చిన నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం జాతీయ బూర్జువా వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తుందని, మౌలికంగా సామ్రాజ్యవాద వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నదని ఒక వర్గం గట్టిగా భావించింది. కాంగ్రెస్‌తో కలిసి జాతీయ ప్రజాస్వామ్యాన్నిసాధించడం ద్వారా సోషలిజం వైపుకు సాగిపోవచ్చునని వారు ప్రతిపాదించారు. ఇది వర్గ సంకర విధానమని, రివిజనిస్టు ధోరణి అని మరొక వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. స్వాతంత్య్రానం తరం అధికారంలోకి వచ్చింది బడా బూర్జువా నాయకత్వంలోని బూర్జువా, భూస్వామ్య ప్రభుత్వమని, సామ్రాజ్య వాదంతో మిలాఖత్తు అయ్యే ప్రభుత్వమని, దీనిని సమూలంగా నిర్మూలించి ఆ స్థానంలో కార్మికవర్గం నాయకత్వాన జనతా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారానే సోషలిజం దిశగా సాగిపోవచ్చునని వీరు ప్రతిపాదించారు. ఈ రెండు పరస్పర విరుద్ధ ధోరణుల మధ్య తీవ్రమైన సైద్ధాంతిక పోరాటం జరిగింది. 1962లో విజయవాడ లో జరిగిన పార్టీ 6వ మహాసభలో రెండు కార్యక్రమాలు, రెండు రాజకీయ తీర్మానాల ముసాయి దాలతో ఇరుపక్షాలూ తలపడ్డాయి. పార్టీ చీలికను నివారించే ఉద్దేశంతో కార్యక్రమం, రాజకీయ తీర్మానం ఆమోదించకుండా వాయిదా వేశారు. ఆనాటి పార్టీ ప్రధాన కార్యదర్శి అజరుఘోష్‌ ఉపన్యాసాన్నే రాజకీయ తీర్మానంగా భావించి తాత్కాలికంగా ఐక్యతను కాపాడారు. ఆతర్వాత కొద్దిరోజుల్లోనే భారత్‌ - చైనా యుద్ధం వచ్చింది. ఈ సమస్యను శాంతియుతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధం వద్దని అన్నందుకు ఉమ్మడి పార్టీలోని సిపిఎం నాయకత్వాన్నిజాతి విద్రోహులని ముద్ర వేశారు. మొత్తం నాయకులందరినీ ప్రభుత్వం అరెస్టు చేసి జైళ్లలో నిర్బంధించింది. ఈనాడు చైనా పట్ల అన్ని పార్టీలూ తీసుకుంటున్న వైఖరి గమనిస్తే ఆనాడు సిపిఎం తీసుకున్న వైఖరి ఎంత సరైందో అర్థమవుతుంది. అయినప్పటికీ మార్క్సిస్టులు సైద్ధాంతిక పోరాటాన్ని విరమించలేదు. 6వ పార్టీ మహాసభ నాటి సభ్యత్వం ప్రాతిపదిక మీద మహాసభ నిర్వహించి కార్యక్రమం, రాజకీయ తీర్మానాలను ఆమోదిద్దామని ప్రతిపాదించారు. నాటి సిపిఐ నాయకత్వం ససేమిరా అన్నది. ఈ దృక్పథాన్ని వ్యతిరేకించేవారు జాతీయ కౌన్సిల్‌ నుంచి వాకౌట్‌ చేసి బయటికొచ్చేశారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మార్క్సిస్టులు ప్రత్యేకంగా మహాసభ జరుపుకోవాలని నిర్ణయించారు. దీనికి సన్నాహంగానే తెనాలి సదస్సు జరిగింది. కలకత్తాలో జరిగిన ఏడవ మహాసభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. వర్గ సంకర విధానాలకు తావులేని కార్యక్రమాన్ని, రాజకీయ విధానాన్ని ఆమోదించింది. అత్యధిక పార్టీ సభ్యుల మద్దతు పొంది, ప్రజాదరణ కలిగిన సిపిఎం కార్యక్రమాన్నిరెండు అంతర్జాతీయ పెద్ద కమ్యూనిస్టు పార్టీలైన సోవియ ట్‌, చైనా వ్యతిరేకించాయి. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ మద్దతు లేనివారు ఇంత పెద్దఎత్తున మహాసభను నిర్వహించగలరని ఎవ్వరూ ఊహించ లేదు. మహాసభ వేదికపై కమ్యూనిస్టు ఉద్యమ హేమాహేమీలు కామ్రేడ్స్‌ పుచ్చలపల్లి సుందరయ్య, ఎ.కె.గోపాలన్‌, ముజఫర్‌ అహ్మద్‌, మాకినేని బసవ పున్నయ్య, ప్రమోద్‌దాస్‌ గుప్తా, పి.రామ మూర్తి, ఇ.ఎం.ఎస్‌.నంబూద్రిపాద్‌, జ్యోతిబసు, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌లాంటి వారు ఆశీనులయ్యారు. పేరు గాంచిన విప్లవ వీరులు, గదర్‌ పార్టీకి చెందిన వారు, భగత్‌సింగ్‌ అనుచరులు, అనుశీలన్‌ జుగన్‌తారలలో సభ్యులుగా పని చేసిన వారు మహాసభల్లో ప్రతినిధులుగా పాల్గొన్నారు. అనేక కార్మికవర్గ పోరాటాల్లోనూ, తెలంగాణా సాయుధ పోరాటం లాంటి రైతాంగ పోరాటాల్లోనూ పాల్గొన్న యోధులెందరో ఆ మహాసభలో తారల్లా మెరిశారు. వీటన్నింటినీ మించి పార్టీ సభ్యత్వాన్ని కదిలించడంలో ఈ మహా సభ ఘన విజయం సాధించింది. మొత్తం లక్షా 75 వేల పార్టీ సభ్యత్వం ఉంటే లక్షా 40 వేల మంది ఈ మహాసభల్లో పాలు పంచుకున్నారు. ఈ చారిత్రాత్మక మహాసభ బూర్జువా, భూస్వామ్య పాలకుల వెన్నుల్లో వణుకు పుట్టించింది.