
‘మా ఆత్మ గౌరవాన్నయినా పునరుద్ధరించండి.. లేదా మమ్మల్ని చనిపోవడానికైనా అనుమతించండి’ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఈ అప్పీల్ చేసింది ఎవరోకాదు. మధ్యప్రదేశ్‌ను కుదిపేస్తున్న వ్యాపం కుంభకోణం బాధిత విద్యార్థులు. ప్రీమెడికల్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన ఐదుగురు విద్యార్థులపై అనేక రకాలుగా ఛీటింగ్ ఆరోపణలు రావడంతో ఈ భావోద్వేగపూరిత అప్పీల్ చేశారు. తాము స్వీయ ప్రతిభతో ప్రవేశ పరీక్షల్లో పాస్ అయినప్పటికీ అక్రమ మార్గంలోనే అడ్మిషన్లు సంపాదించినట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. వీటితో తాము తీవ్రస్థాయిలో వేధింపులకు గురవుతున్నామని, మానసిక స్థయిర్యాన్ని కూడా కోల్పోయామని గ్వాలియర్‌కు చెందిన మనీష్ శర్మ, రాఘవేంద్ర సింగ్, పంకజ్ బన్సాల్, అమిత్ చద్దా, వికాస్ గుప్తా రాష్టప్రతికి రాసిన లేఖలో స్పష్టం చేశారు.