BJP కి ఊహించని షాక్..

బీజేపీకి సొంతపార్టీ నేతలే షాక్‌ల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే లలిత్‌ గేట్‌, వ్యాపం తదితర కేసులపై విపక్షాల దాడిని ఎదుర్కొనేందుకు నానాతంటాలు పడుతున్న బిజెపికి ఊహించని విధంగా సొంత పార్టీ నేత నుండే మరో గట్టి షాక్‌ తగిలింది. పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగేలా కుంభకోణాలు బయటపడడం పార్టీకి సిగ్గుచేటని ఓ బీజేపీ ఎంపీ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాశారు. నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా ఉన్నాయని, మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం బీజేపీ సిగ్గుతో తలదించుకునేలా చేసిందని ఆయన ఘాటుగా విమర్శించారు. పార్టీలో, ప్రభుత్వంలో అవినీతిని నిర్మూలించేందుకు లోక్‌పాల్‌ లాంటి 'విలువల కమిటీ'ని ఏర్పాటు చేయాలని శాంతకుమార్‌ సూచించారు. పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర, రాజస్థాన్‌లలో కూడా అవినీతి పేరుకుపోయిందని పేర్కొన్నారు. లలిత్‌ గేట్‌ వ్యక్తులు వసుంధర రాజే, మహారాష్ట్ర మంత్రి పంకజముండే పేర్లు ప్రస్తావించకుండానే వారిపై విమర్శలు గుప్పించారు. పార్టీకి మచ్చ తెచ్చిన లలిత్‌ గేట్‌, వ్యాపం తనకు విచారం కల్గించిందని తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు రెండు పేజీల లేఖను ఆయన తన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ పేజీల్లో పోస్ట్ చేశారు. అయితే లేఖ విషయాన్ని తాను మీడియాకు చెప్పాలనుకోలేదని, కానీ అందులోని ప్రతీ పదానికి తాను కట్టుబడి ఉన్నానని తెలపడానికే మీడియా ముందుకు వచ్చానని శాంతకుమార్‌ అన్నారు.