
'ప్రపంచీకరణ-సంస్కృతి' సంకలనం లోని వ్యాసాలు మీడియా, సంస్కృతి, నాగరికత, సామాజిక పోకడల వివిధ పార్శ్వాలను తెలియజేస్తాయి. ఈ వ్యాసకర్తలలో అత్యధికులు అధ్యయనపరులుగా ప్రసిద్ధులే (వారిలో ఒకరిద్దరు ఇప్పుడు సజీవంగా లేరు.). వ్యాసాల నేపథ్యం, అవి రాసిన లేదా ప్రసంగం చేసిన సందర్భాలు కూడా భిన్నమైనవే. అయితే వీటన్నిటిలోనూ పూసల్లో దారంలాగా ఒక ఇతివృత్త ఏకత వుంది. ఆలోచనా పరులైన వారెవరైనా తరచూ ప్రస్తావించుకునే అంశాల పరామర్శ వీటిలో లభిస్తుంది. అలాగే మన ఇంట్లో, సమాజంలో దేశంలో వచ్చిన ఏ అవాంఛనీయ మార్పుల గురించి మనం మథన పడుతుంటామో అవి యాదృచ్ఛికంగా వచ్చినవి కాదని ఈ రచనలు మనకు తెలియజెబుతాయి. కనిపించే తళుకు బెళుకుల వెనక వున్న అదృశ్య అంతర్జాతీయ హస్తాలను చూపిస్తాయి. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలను విశ్లేషిస్తాయి. తెలియకుండానే కొన్ని తరాలు ఆ ప్రభావానికి ఎలా లోబడిపోయాయో చెబుతాయి. పైగా ఇవన్నీ ఒకసారి రాసినవి కాకపోవడంలో ఒక సౌలభ్యం కూడా వుంది. ఏమంటే మొదట్లో వూహించిన భయాందోళనలు తర్వాత నిజంగా నిజం కావడం ఇప్పుడు మన అనుభవంలో కనిపిస్తుంటుంది. వ్యాసాలు వివిధ సందర్భాల్లో రాసినవి గనుక అన్నిటి తేదీలు, వివరాలు అందుబాటులో లేవు. కాని అత్యధిక భాగం గత పుష్కర కాలంలోవే. సంస్కృతిపై తెలుగులోనే గాక ఇంగ్లీషులో కూడా ప్రత్యేకంగా పుస్తకాలు ఏమంత అందుబాటులో లేవు. అందుకే ఇది ఆసక్తిరమైనదే గాక అరుదైన సంకలనం అవుతందని ఆశించవచ్చు. అదనంగా ఈ రెండో ముద్రణలో చేర్చిన వ్యాసాలు ఈ పుస్తక ప్రాధాన్యతను మరింతగా పెంచుతాయి.
ప్రపంచీకరణ-సంస్కృతి
సంకలనం: తెలకపల్లి రవి
పేజీలు:301/-, వెల: 175/-
ప్రతులకు: ప్రజాశక్తి బుకహేౌస్, 27-1-54,
ఏలూరు రోడ్, గవర్నర్‌పేట, విజయవాడ.