బలమైన రాజకీయ శక్తిగా సిపిఎం

బలమైన రాజకీయ శక్తిగా సిపిఎం
రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
బిజెపిని వదిలేస్తే రాష్ట్రాన్ని మూసేస్తుంది
రాష్ట్రంలో వైసిపి, టిడిపి కళ్లు తెరవాలి

రాష్ట్రంలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహించడంతోపాటు బలమైన రాజకీయ శక్తిగా సిపిఎంను తీర్చిదిద్దాలని రాష్ట్ర మాహాసభ నిర్ణయించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని నిలువరించకపోతే రాష్ట్రాన్ని కూడా మూసేస్తుందని మండిపడ్డారు. గురువారం ఉదయం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిహెచ్‌.బాబూరావు, మంతెన సీతారాం, బి.తులసీదాస్‌, పి.జమలయ్య, వి.వెంకటేశ్వర్లుతో కలిసి మాట్లాడారు. సిపిఎం రాష్ట్ర 26వ మహాసభలు తాడేపల్లిలో మూడు రోజులపాటు జరిగాయని, వీటిల్లో రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ప్రజలస్థితి, సమస్యలు, ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, వాటిపట్ల పార్టీ వైఖరి ఎలా ఉండాలనే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. అనంతరం రాజకీయ తీర్మానాన్ని ఆమోదించామని వివరించారు. హోదా కోసం ఏడేళ్ల నుండి పోరాడుతుంటే ఇవ్వకపోగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు భారాలు వేస్తోందని, వీటిని గతంలో అధికారంలో ఉన్న టిడిపి, ప్రస్తుత వైసిపి అమలు చేస్తూ ఇబ్బడి ముబ్బడిగా భారాలు మోపుతున్నాయని అన్నారు. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించి ప్రజాపోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్ల ప్రజలపై భారాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని వివరించారు. ముఖ్యంగా రైతులు, యువతకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిన బిజెపి నాయకులు ఎందుకు మాట తప్పారో చెప్పలేదన్నారు. కనీసం రాష్ట్ర ప్రజలకు క్షమాపణ కూడా తెలుపలేదని మండిపడ్డారు. ఇన్నేళ్లలో రాష్ట్రంలో ఒక్క కేంద్ర సంస్థను కూడా పూర్తిస్థాయిలో నిర్మించలేదని అన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని కోరుతున్నా అతీగతి లేదని, అదే సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామని, ఎవరూ కొనకపోతే మూసేస్తామని చెప్పడం దుర్మార్గమని అన్నారు. ‘చీపు’ రాజకీయాలు చేస్తున్న బిజెపి నాయకులు ఎక్కువ కాలం మోసం చేయలేరని, తిరగబడే రోజు వస్తుందని ప్రజలే ముకుతాడు వేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికైనా వైసిపి, టిడిపి కళ్లు తెరిచి బిజెపి నైజం తెలుసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెత్తపన్ను, విద్యుత్‌ భారాలు మోపుతోందని అన్నారు. దీనికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కార్మిక, రైతాంగ ఉద్యమాలు బలోపేతమయ్యాయని తెలిపారు. వారందరినీ కలుపుకుని బలమైన ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తామని వివరించారు. సిపిఎంను ప్రజాబాహుళ్యంతో కూడిన బలమైన పార్టీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, ఉద్యమాలకు బలమైన కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయించామని వివరించారు.
రాష్ట్రంలో సమస్యలు పెరిగిపోతున్నాయని, సహకార రంగంలో డెయిరీ మూతపడుతోందని అన్నారు. అమూల్‌ను తీసుకొచ్చి సహకార డెయిరీలను మూసేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. గ్రామాల్లో విచక్షణా రహితంగా అమూల్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి బలవంతంగా పాలు పోయాలని ఒత్తిడి చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. మామూలు రేటుకన్నా నాలుగు రూపాయలు అదనంగా బోనస్‌ వస్తుందని సిఎం ప్రకటించారని, అదన్నా అమలు చేయాలని డిమాండు చేశారు. నిజంగా పాల రైతులను ఆదుకోవాలంటే సహకార డెయిరీలకు నిధులు లేదా అప్పులు ఇచ్చైనా సాయం చేయొచ్చని, అవసరమైతే దీనిలో అమూల్‌ సాంకేతికతను వాడుకోవచ్చని సూచించారు. సహకార రంగంలో వచ్చే లాభాల్లో కొంత రైతులకు వాటా ఇచ్చేవారని, ఇప్పుడు అమూల్‌ కంపెనీ లాభాలను గుజరాత్‌కు తీసుకెళుతుందని తెలిపారు. పాలు పోసినా బిల్లులు రాని పరిస్థితి నెలకొందన్నారు. సహకార డెయిరీలను పెంచితే రైతుల అభివృద్ధి జరుగుతుందని వివరించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో అస్పత్రులను అభివృద్ధిచేసి, వనరులను పెంచి ఒమిక్రాన్‌ కట్టడికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. సిపిఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ విజయనగరంలో ధాన్యానికి రేటులేక రైతులు రోడ్డుపైపోసి తగులబెడుతున్నారని అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మిర్చికి తెగుళ్లు వచ్చి వేల, లక్షల ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారని పేర్కొన్నారు. అనంతపురంలో రైతులు అష్టకష్టాల పాలవుతున్నారని వివరించారు. కేంద్రం నుండి ఇన్‌పుట్‌ సబ్సిడీకి సంబంధించిన చర్యలు ఏమీ లేవన్నారు. వైసిపి వచ్చిన తరువాత అసంఘటితరంగ కార్మికులు కనీస వేతన సలహా బోర్డు పెట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని చెప్పినా ఇప్పటికీ చర్యలు లేవని అన్నారు.

జె.ప్రభాకర్‌
ఆఫీసు కార్యదర్శి