
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మికుల సమస్యలు, కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న సమ్మె ప్రకటించిన ప్రకారం సాగుతుందని సిఐటియు జాతీయ కార్యదర్శి డా|| హేమలత స్పష్టంచేశారు. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ కార్మిక సదస్సు మంగళవారం ముగిసింది. ఇందులో సెంటర్ ఫర్ ఇండియా ట్రేడ్ యూనియన్(సిఐటియు) తరపున పాల్గొన్న హేమలత మీడియాతో మాట్లాడుతూ...దేశంలో ఉన్న పదకొండు జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగానే ఉన్నాయని...సమ్మె ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో జాతీయ సమ్మెపై సదస్సులు జరిగాయని గుర్తుచేశారు. కాంట్రాక్ట్ కార్మికులు, కనీస వేతనాలు, స్కిల్డ్ వర్క్ర్స్పై 43,44,45 జాతీయ కార్మిక సదస్సులు చేసిన సిఫార్స్లు అమలు కాకపోవడంపై 46వ జాతీయ కార్మిక సదస్సు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిందని...కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశాయని చెప్పారు. గత ఐఎల్సిలో తీసుకొన్న సిఫార్సుల అమలపై సమీక్షించాలని సిఐటియు పట్టుబట్టిందనీ, ఇతర కార్మిక సంఘాలు మద్దతు పలికాయనీ ఈ సందర్భంగా వివరించారు. ఆర్థికాభివృద్ధి జరిగితే కార్మిక సంక్షేమ జరగుతుందని...కనుకనే పెట్టుబడులు ప్రోత్సహించాలని తక్షణ అవసరమని ప్రభుత్వ వాదనలో పెట్టుబడుదారులకు ఊడిగం చేసేందుకేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుదారులకు కొమ్ముకాస్తుందని ఈ సందర్భంగా ఘాటైనా విమర్శలు చేశారు. కార్మికులకు అనుకూలంగా చట్టాలు సవరిస్తే మద్దతిస్తామని...కాని పెట్టుబడుదారులకు అనుకూలంగా చేస్తే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. కార్మిక చట్టాలు సవరణపై త్రైపాక్షిక సంస్థలు ప్రాధన్యతను పరిగణలోకి తీసుకోవాలని డిమాండు చేశారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, సంస్థలు మనుగడ, ఉపాది కల్పన, పారిశ్రామిక శాంతి అంశాలను పరిగణలోకి తీసుకొని కార్మిక చట్టాలను సవరించాలని డిమాండు చేశారు.