
తమ డిమాండ్లు నెరవేర్చాలని మున్సిపల్ పారిశుధ్య కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె మంగళవారానికి 11 రోజులు పూర్తిచేసుకుంది. ఓపక్క పోరాటం ఉధృతంగా మారుతున్నా ప్రభుత్వంలో స్పందన లేకపోగా విజయవాడలో పారిశుధ్య కార్మికులు మంగళవారం చేపట్టిన రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ అధికారుల బంగ్లాల ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకుని అరెస్టులకు తెగబడింది. పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించి 200 మందికి పైగా అరెస్ట్ చేశారు. మహిళలనీ చూడక ఈడ్చికెళ్లి వ్యానులో పడేశారు. అరెస్టయి వన్‌టౌన్ పోలీసుస్టేషనులో ఉన్న ఆందోళనకారులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలతో పాటు పలు ట్రేడ్ యూనియన్ల రాష్ట్ర నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగానూ ఆందోళనల వెల్లువ కొనసాగుతోంది.