కేంద్ర బడ్జెట్టులో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విజయవాడ ధర్నా చౌక్‌లో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ, ఎఐకెఎస్‌సిసి రాష్ట్ర కన్వీనర్ వడ్డే.శోభనాద్రీశ్వరరావు, సిఐటియు రాష్ట్రకార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.కేశవరావు, అఖిల భారత కిసాన్‌సభ జాతీయ ఉపాధ్యక్షులు రావుల.వెంకయ్య, వివిధ రాజకీయ, ట్రేడ్ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. కేంద్రం అవలంభిస్తున్న కార్పొరేటీకరణ విధానాలను ఖండించారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను ఆపకుంటే బిజెపిని రాష్ట్రప్రజలు బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరించారు. ముఖ్యమంత్రి లేఖ రాయడంతో సరిపెట్టుకోవడం కాదని, కచ్చితంగా విశాఖ ఉక్కును కాపాడేందుకు ఉద్యమానికి సారథ్యం వహించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ విశాఖ ఉక్కు ఉద్యమంలో పాల్గొని కార్మికుల పక్షాన నిలబడాలని కోరారు. ఉద్యమంలోకి రాకుంటే జగన్, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.