పార్లమెంట్‌లో తాజా బిల్లు?

విదేశీ ప్రభుత్వాధికారులు లంచాలు ఇవ్వడాన్ని లేదా స్వీకరించడాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించి వారికి ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనుంది. వాస్తవానికి విదేశీ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ ప్రభుత్వ సంస్థల అధికారుల లంచాల నిరోధక బిల్లును 2011లోనే రూపొందించినప్పటికీ గత ఏడాది మే నెలలో 15వ లోక్‌సభ రద్దవడంతో ఆ బిల్లుకు కాలం చెల్లిపోయింది. దీంతో మళ్లీ తాజాగా ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం దీనిపై అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా న్యాయ కమిషన్‌ను కోరిందని, అయితే మంగళవారం నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలా లేదా అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం జరగలేదని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం విదేశీ ప్రభుత్వాధికారులు లంచాలు ఇవ్వడం లేదా స్వీకరించడం దేశీయ అవినీతి నిరోధక చట్టాల పరిధిలోకి రాదు. దీంతో విదేశీ అధికారుల నుంచి ఏ రకమైన లంచాలకు తావులేకుండా చూసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టంగా ఈ చట్టాన్ని రూపొందిస్తోంది. గత బిల్లు లంచాలను ఇచ్చేవారితో పాటు స్వీకరించే వారిని కూడా శిక్షించేందుకు వీలుకల్పిస్తోంది. అలాగే ఈ చట్టం అమలుకు విదేశాలు, విదేశీ ప్రభుత్వ సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకుని దర్యాప్తు సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు కూడా ఇది వీలుకల్పిస్తోంది.