కాలంచెల్లిన చట్టాలురద్దు:మోడీ

దేశంలో కార్మిక సంస్కరణల పట్ల వెల్లువెత్తుతున్న విమర్శలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీటుగా సమాధానమిచ్చారు. న్యూఢిల్లీలో సోమవారం ఆయన 46వ అఖిల భారత కార్మిక సదస్సులో ప్రసంగిస్తూ, ఏకాభిప్రాయం సాధించిన తర్వాత మాత్రమే కార్మిక చట్టాలకు మార్పులు, చేర్పులు చేస్తామని, అలాగే కాలం చెల్లిన, అనవసరమైన కార్మిక చట్టాలను తొలగిస్తామని స్పష్టం చేశారు. దేశంలో కార్మికులు, కార్మిక సంఘాల ప్రయోజనాలకు మధ్య పలుచటి విభజన రేఖ ఉందని, అయినా దీనిని గౌరవించి తీరాల్సిందేనని మోదీ పేర్కొన్నారు. ఏకాభిప్రాయం ద్వారా కార్మిక చట్టాలను సవరించేందుకు ప్రయత్నిస్తామని, ఈ విషయమై కార్మిక సంఘాలతో ప్రభుత్వం జరుపుతున్న సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించుకున్న ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన’ (మినిమమ్ గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్) లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా కాలం చెల్లిన, అనవసరమైన కార్మిక చట్టాలను రద్దు చేస్తామన్నారు.