మత కలహాలు సృష్టించి.. ప్రజల శవాలపై రాజకీయాలా? : వి.వెంకటేశ్వర్లు

బిజెపి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టి, మత కలహాలు సృష్టించి, ప్రజల శవాలపై రాజకీయాలు చేస్తోందని, దీనిని ప్రజలు ఎన్నడూ క్షమించరని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై సిపిఎం రాష్ట్ర కమిటీ చేపట్టిన రాజకీయ ప్రచార యాత్ర కార్యక్ర‌మంలో భాగంగా గురువారం చిత్తూరు జిల్లా పలమనేరు అంబేద్కర్‌ సర్కిల్‌ నుండి బస్టాండ్‌ కూడలిలోని ఎటిఎం సర్కిల్‌ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి గిరిధర్‌ గుప్త అధ్యక్షతన జరిగిన సభలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బిజెపి, దాని అనుబంధ సంస్థలు చిన్నచిన్న గుడులు, మసీదులు ఎంచుకొని మతకలహాలు సృష్టించడానికి ప్రయత్సిస్తున్నాయని విమర్శించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వారైతే రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై, కార్మిక వ్యతిరేక చట్టాలపై పోరాడాలని హితవు పలికారు. అంతేకానీ మతకలహాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే సిపిఎం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తోందని, రైళ్లను ప్రైవేటీకరించిందని, కార్మిక చట్టాల్లో పెను మార్పులు చేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందిన బిజెపి ప్రజలను పక్కదారి పట్టించేందుకు మత విద్వేషాలు రెచ్చగొడుతోందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులకు కోత విధిస్తోందని, ప్రత్యేక హోదా ఎగొట్టి, కడప స్టీల్‌, దుగరాజపట్నం ఓడరేవు తదితరాలకు మొండిచెయ్యి చూపిందని అన్నారు. విశాఖ రైల్వేజోన్‌ ఇప్పటికీ అతీగతి లేదని, రాజధాని నిధులు ఇవ్వలేదని చెప్పారు. వీటిపై బిజెపిని ప్రశ్నించాల్సిన వైసిపి, తెలుగుదేశం పార్టీలు ఆ పని చేయకుండా పరస్పరం నిందించుకుంటూ ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశాయని పేర్కొన్నారు. కరోనా విపత్తు కారణంగా రైతులు కూలీలు కార్మికులు ఉపాధి లేక అల్లాడుతుంటే ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని వాపోయారు. కేంద్ర ప్రభుత్వం షరతుల మేరకు మోటారుకు మీటర్లు, ఆస్తి పన్ను, చెత్త పన్ను వంటి భారాలు వేస్తున్నాయని వైసిపి పాలకులు చెబుతున్నారని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది బిజెపి చెప్పింది చేయడానికా? లేక ప్రజల బాగోగులు పట్టించుకోవడానికా? అని ప్రశ్నించారు. రానున్న కాలంలో సిపిఎం, సిపిఐ నాయకత్వంలో ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాలు, కార్మిక వ్యతిరేక చట్టాలపై పోరాడుతామని, దళితులు, ముస్లింలు, బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓబులారాజు మాట్లాడుతూ.. బిజెపి పాలనలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర హాని జరుగుతోందనీ, దేశంలో ఆకలి చావులు, మత కలహాలు, నిరుద్యోగం పెరిగాయని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి పాలకులు పట్టించుకోలేదని వాపోయారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అన్ని పక్షాలను కూడగట్టూకుని పోరాటాలు ఉధృతంగా చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు భువనేశ్వరి, ఈశ్వర్‌, హైదర్‌, జయంతి, సుశీలమ్మ, బాలసుబ్రహ్మణ్యం, శివకుమార్‌, శ్రీరాములు, జ్యోతి, ధనమ్మ తదితరులు పాల్గొన్నారు.