
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తుపానును మరిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆ విషయాన్ని పరోక్షంగా అంగీకరించారు. కాంగ్రెస్ నాయకుడు గిరిధర్ లాల్ డోగ్రా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం కోసం శుక్రవారం ఇక్కడికి వచ్చిన మోదీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, జమ్మూ, కాశ్మీర్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కరణ్ సింగ్‌తో కలిసి వేదికను పంచుకున్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘మనమంతా ఇక్కడ కూర్చుని ఉన్నాం. అయితే మనమంతా పార్లమెంటులో ఘర్షణ పడే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి. అదీ చూద్దాం’ అని కాంగ్రెస్ నేతలనుద్దేశిస్తూ మోదీ అన్నారు. 21నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వ్యాపం కుంభకోణం, లలిత్ మోదీ వివాదం, కుల గణనలాంటి వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశాల్లో ప్రభుత్వానికి సంబంధించిన కార్యకలాపాలు పూర్తి చేసుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి ఎన్డీఏ నేతలు మంతనాలు జరపడం తెలిసిందే.