
కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకువచ్చిన భూ సేకరణ బిల్లు-2015పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా దాడిచేశారు. వచ్చే ఆరు నెలల్లో రైతులు మోడీ ధీమాను తగ్గిస్తారు కానీ ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోరని వ్యాఖ్యానించారు. లలిత్ మోడీతో వసుంధర రాజె ప్రభుత్వానికి సంబంధాలు వున్నాయని, లండన్‌లో వుంటూ లలిత్ మోడీ ఇక్కడ ప్రభుత్వానికి రిమోట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇక్కడ పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ రాహుల్, పార్లమెంట్లో భూ సేకరణబిల్లును ఆమోదించనివ్వబోమని ప్రతిన చేశారు. వచ్చేవారం ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వివాదాస్పదమైన భూ సేకరణబిల్లును ఆమోదింపచేసుకోవడానికి ప్రభుత్వం తీవ్రంగా యత్నాలు చేస్తున్న నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు వెలువడ్డాయి. వసుంధర రాజె ప్రభుత్వాన్ని గత బ్రిటీష్ ప్రభుత్వంతో రాహుల్ పోల్చారు. అక్కడ ఆయన బటన్ నొక్కితే ఇక్కడ ఈమె గెంతులు వేస్తారని వ్యాఖ్యానించారు. ఒక నేరస్తుడికి, నల్లధనాన్ని పోగుచేసిన అవినీతిపరుడికి సహాయం చేయడం ద్వారా ఆమె భారతీయ చట్టాలను ఉల్లంఘించారని విమర్శించారు.