కుల దురహంకార హత్యలపై సిపిఎం ఆందోళన

తమిళ నాడులో కుల దురహంకార హత్యలు నానాటికీ పెరుగుతుండటంపై సిపిఎం ఆందోళనను వ్యక్తం చేసింది. ఆత్మగౌరవంతో ఎవరైతే కులాలను ఎదిరించి వివాహాలు చేసుకురటారో వారికి విద్యా సంస్థల్లోను, ఉద్యోగాల్లోను రిజర్వేషన్లు కల్పించాలని సిపిఎం డిమాండ్‌ చేసింది. బుధవారం ముగిసిన పార్టీ రాష్ట్ర కమిటీ రెండు రోజుల సమావేశాలలో ఆమోదించిన తీర్మానాన్ని గురువారం ఈ విడుదల చేసింది. కులదురహంకార హత్యలను పరిష్కరించడానికి ప్రత్యేక చట్టాన్ని చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. కుల సంబంధ సంఘటనలు రాష్ట్రంలో పెరిగిపోయాయని, గత ఏడాది కాలంలోనే గౌరవ హత్యల పేరుతో 60 మందిని చంపేశారని అది పేర్కొంది. అన్ని కులాలు ఒకటే అనే సహజ వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని అది పేర్కొంది. ఈ సమస్యపై రాజకీయ, సాంఘిక ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరాన్ని అది నొక్కి వక్కాణించింది. తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో కుల సంబంధ హింస జరగకుండా చేపట్టాల్సిన చర్యలపై 1998లో జస్టిస్‌ పి మోహన్‌ కమిటీ చేసిన ప్రగతిశీల సిఫార్సులను వెంటనే అమలు చేయాలని సిపిఎం కోరింది.