మోడీ శుష్క ప్రసంగం

 కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నాల్గవసారి దేశ ప్రజల నుద్దేశించి చేసిన ప్రసంగంలో వాగాడంబరం తప్ప ఛిద్రమవుతున్న ప్రజల జీవితాల మెరుగుదలకు సంబంధించిన ఊసే లేదు. మూడు వారాల లాక్‌డౌన్‌ గడువు ముగియడంతో, దానిని మరో పందొమ్మిది రోజులపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు సరే. మరి ఈ లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి కోల్పోయి, ఆకలితో అలమటిస్తున్న కోట్లాది మంది దినసరి వేతన కార్మికులు, వలస కూలీలు, వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ రంగ కార్మికులు, ఆటో డ్రైవర్లు, ఇంటి పనివారల మాటేమిటి? మోడీ ప్రసంగంలో వీరికి సంబంధించిన కనీస ప్రస్తావన లేదు. వీరిని ఆదుకునేందుకు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా సాయం అందించలేదు. ఇంతకుముందు ప్రకటించిన 1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీలో ఒక్క పైసా కూడా అసంఖ్యాకంగా ఉన్న అసంఘటిత రంగ కార్మికులకు కానీ, వలస కూలీలకు కానీ అందలేదు. కరోనా దెబ్బకు 40 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు తీవ్ర పేదరికంలోకి నెట్టబడుతున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఒ) హెచ్చరించినా, మోడీ ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఎలాంటి నిర్దిష్ట చర్యలు ప్రకటించలేదు. కార్మికులను పని నుంచి తొలగించరాదని, వేతనాలను తగ్గించరాదంటూ పాత పాటే పాడారు. బ్రిటన్‌ తరహాలో వేతనాల్లో కొంత భాగం ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించడానికి కానీ, ఉపాధి కోల్పోయినవారికి ఈ మూడు మాసాలు నెలకు రూ.7,500 చొప్పున సాయం అందించడానికి కానీ ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. ప్రభుత్వ ఆలోచనంతా ఈ సంక్షోభాన్ని సైతం కార్పొరేట్లకు, పరిశ్రమల యజమానులకు లాభం చేకూర్చేలా చేయడం ఎలా అన్నదానిగురించే. కరోనాపై లాక్‌డౌన్‌ కొనసాగుతుండగా కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలకు పెంచేందుకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ లేదా ఆర్డినెన్సు జారీకి ప్రభుత్వం పూనుకుంటున్నదంటేనే ఈ ప్రభుత్వ వర్గ నైజమేమిటో అర్థమవుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించాక కార్మికులకు తక్కువ వేతనాలిచ్చి ఎక్కువ పని చేయించుకోవడానికి పరిశ్రమ యజమానులకు పూర్తి అధికారాలివ్వడమే ఈ ఆర్డినెన్స్‌ ఉద్దేశం.
వలస కార్మికుల సంక్షేమాన్ని రాష్ట్రాల పైకి నెట్టేసిన మోడీ ప్రభుత్వం అందుకు అవసరమైన నిధులు ఇవ్వకుండా తొక్కిపడుతున్నది. కేంద్రం నుంచి కరోనా సాయం లేకుంటే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుందని ఇటీవల ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముక్త కంఠంతో నివేదించారు. మంగళవారం నాటి ప్రధాని ప్రసంగంలోనైనా సాయం ప్రకటిస్తారేమోనని ఆశగా ఎదురుచూసిన రాష్ట్రాలకు నిరాశే మిగిలింది. లాక్‌డౌన్‌తో చితికిపోయిన రాష్ట్రాలను ఆదుకోవడం కేంద్రం బాధ్యత. కేంద్ర ఆహార గిడ్డంగుల్లో మూలుగుతున్న 7.5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఈ సంక్షోభ సమయంలో ప్రజలకు పంచిపెట్టవచ్చు. ఖాళీ అయిన నిల్వలను భర్తీ చేసేందుకు మళ్లీ రైతుల నుంచి పంటను కొనుగోలు చేయవచ్చు. దీని వల్ల అటు ప్రజలకు, ఇటు రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. నయా ఉదారవాద విధానాలను నెత్తికెత్తుకున్న మోడీ ప్రభుత్వం దీనికి కూడా ససేమిరా అంటోంది. కరోనాను సమర్థవంతంగా అరికట్టడంలో చైనా అనుభవం కళ్లెదుట ఉన్నా, దాని నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా లేదు. హ్యుబెయి ప్రోవిన్స్‌ లోని వుహాన్‌లో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చైనా ప్రభుత్వం ఆర్థిక వనరులను సమీకరించి, వైద్య సిబ్బందిని, పరికరాలను, ఆరోగ్య మౌలిక సదుపాయాలను కల్పించడంలో అద్భుతాలు సృష్టించింది. పదకొండు వారాల పాటు లాక్‌డౌన్‌ కొనసాగించినా వుహాన్‌లో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది.
మోడీ ప్రభుత్వం ఈ మూడు వారాల్లో కొత్తగా ఒక్క ఆసుపత్రి కూడా నిర్మించిన దాఖలాలేవు. అవసరమైన వారందరికీ పరీక్ష చేసేందుకు సరిపడా టెస్టు కిట్లు సైతం లేవు. కరోనాపై పోరులో ముందు భాగాన నిలిచిన పారిశుధ్య కార్మికులకు, డాక్టర్లకు, సర్సులకు ప్రొటెక్టివ్‌ గేర్స్‌ అందించడంలో విఫలమైన మోడీ ప్రభుత్వం ఆరోగ్య మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగుపరిచినట్లు చెప్పుకోవడమే విడ్డూరం. ప్రపంచంలో పేద దేశాలైన నైగర్‌, హోండూరస్‌ వంటి దేశాల్లో సైతం ప్రతి పది లక్షల మందికి 182 కరోనా టెస్ట్‌ కిట్లు అందుబాటులో ఉండగా, మన దేశంలో 149 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇదీ మన ఆరోగ్య రంగ పరిస్థితి.
లాక్‌డౌన్‌ అమలును ఈ నెల 20 సమీక్షించేటప్పుడు వలస కార్మికులను తిరిగి వారి ఇళ్లకు చేర్చే విషయం ప్రభుత్వ మొదటి ప్రాథాన్యతగా ఉండాలి. సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రాలకు కేంద్రం అదనపు నిధులు సమకూర్చాలి. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలి. లాక్‌డౌన్‌ కాలంలో అసంఘటిత రంగ కార్మికులకు, నిరుద్యోగులకు, అల్పాదాయ వర్గాలకు నెలకు రూ.7,500 చెల్లించాలి. ఆకలితో అలమటిస్తున్న పేదలకు నెలకు సరిపడా తిండిగింజలు, నగదు సాయం అందించాలి. కీలకమైన ఈ డిమాండ్ల గురించి ప్రస్తావించకుండా ప్రధాని ఏం చెప్పినా ఉపయోగం ఉండదు.