వ్యవస్థలపై దాడి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఇసి) నియామక నిబంధనలను పూర్తిగా మార్చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అత్యయిక ఆదేశం (ఆర్డినెన్స్‌) నిరంకుశ ఏకపక్ష చర్య. కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా, సమయం, సందర్భం లేని దుస్సాహసం. ఎస్‌ఇసి పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదిస్తూ ఎ.పి పంచాయతీరాజ్‌ చట్టం (1994) లోని సెక్షన్‌ 200ను సవరిస్తూ శుక్రవారం ఆగమేఘాల మీద ప్రభుత్వం ఆర్డినెన్స్‌ ఆమోదించి గవర్నర్‌కు పంపగా, వెనువెంటనే గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. ఆ రాత్రే ఆర్డినెన్స్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ జీవో, మూడేళ్ల కాలపరిమితి ముగిసిందంటూ ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తొలగిస్తూ మరో జీవో జారీ అయ్యాయి. తెల్లవారి శనివారం పొద్దున పొద్దున్నే కొత్త ఎస్‌ఇసిగా మద్రాస్‌ హైకోర్టు మాజీ జస్టిస్‌ కనగరాజ్‌ను నియమిస్తూ జీవో ఇవ్వడం, కొన్ని నిమిషాల్లో ఆయన బాధ్యతలు చేపట్టడం ముందుగా రాసుకున్న స్క్రిప్టు మాదిరి చకచకా జరిగిపోయాయి. సర్కారు నిర్ణయంపై బాధితుడు, మాజీ ఎస్‌ఇసి రమేశ్‌ కుమార్‌, మరికొందరు రాష్ట్ర హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ వ్యాజ్యాలపై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు, గురువారానికల్లా అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వచ్చే సోమవారానికి విచారణను వాయిదా వేసింది. ఇటీవలి కాలంలో జగన్‌ సర్కారు ట్రాక్‌ రికార్డును పరిశీలిస్తే, కోర్టులు వేసిన మొట్టికాయలు, పెట్టిన చీవాట్లు ప్రజలకు ఎరుకే. ఇప్పుడు ఎస్‌ఇసి నియామకం కోసం తెచ్చిన ఆర్డినెన్స్‌ భవితవ్యం ఏమవుతుందో వేచి చూడాలి. ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను అన్ని ప్రతిపక్ష పార్టీలు, పలువురు న్యాయ నిపుణులు, ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించారు.
అభ్యుదయకరంగా ఎన్నికల సంస్కరణలను ఆశించి వైసిపి ప్రభుత్వం తాజా ఆర్డినెన్స్‌ తెచ్చిందంటే నమ్మేవారెవ్వరూ లేరు. తనను కాదని, తాను చెప్పిన సమయానికి స్థానిక ఎన్నికలను పూర్తి చేయకుండా, ఆరు వారాలు వాయిదా వేయడమే రమేశ్‌ కుమార్‌ చేసిన మహాపరాధం. రమేశ్‌ కుమార్‌ ఎన్నికలను వాయిదా వేసిన కొన్ని గంటల్లోనే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారపార్టీ నేతలు ఆయనపై ఏ విధంగా బరితెగించి విరుచుకుపడ్డారో, ఉద్దేశాలు ఆపాదించారో రాష్ట్ర ప్రజానీకం చూసింది. ఈ పూర్వరంగంలో తెచ్చిన ఆర్డినెన్స్‌ ముమ్మాటికీ రమేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలిగించే లక్ష్యంతో తెచ్చిందేననని ఎవరికైనా అర్థమవుతుంది. ఎస్‌ఇసిని తొలగించా లంటే హైకోర్టు జడ్జి అభిశంసనకు అనుసరించాల్సిన ప్రక్రియ చేపట్టాలి. పార్లమెంట్‌ దాకా వెళ్లాలి. అది జరిగే పనే కాదు కనుక 'దొడ్డిదారి'ని ఆశ్రయించింది సర్కారు. ఎస్‌ఇసి నియామకంపై రాష్ట్ర ప్రభుత్వానికి దఖలుపడ్డ అధికారాలను ఉపయోగించుకొని, ఎస్‌ఇసి నియామకంపై పంచాయతీరాజ్‌ చట్టంలో ఉన్న 200 సెక్షన్‌ను సమూలంగా సవరించింది. ఎస్‌ఇసి పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించింది. ఇప్పటి వరకు ఆ పోస్టుల్లో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన ఐఎఎస్‌ అధికారిని నియమిస్తుండగా, హైకోర్టు జస్టిస్‌గా పని చేసిన వ్యక్తిని నియమించేలా మార్పులు చేసింది. ఇంతకు ముందు ఎస్‌ఇసి వయసు 65 సంవత్సరాలే. ఇప్పుడు ఆ పరిమితి లేదు. ఇప్పటి వరకు ఎస్‌ఇసిగా ఒక వ్యక్తిని రెండవమారు నియమించే అవకాశం లేదు. ఇప్పుడు నియమించొచ్చు. ఈ మార్పులు ఏ విధంగా అభ్యుదయకరమో ప్రభుత్వమే చెప్పాలి.

వైసిపి ప్రభుత్వం ఆరోపించినట్లు నిజంగానే రమేశ్‌ కుమార్‌ ప్రతిపక్ష టిడిపికి చెందిన వ్యక్తే అయితే, తాము అధికారం లోకి రాగానే చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసుకోవాల్సి ఉంది. మార్చి లోనే, అదీ అన్ని స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేసిన అభ్యర్ధన దగ్గర నుంచి షెడ్యూల్‌ విడుదల వరకు, నామినేషన్ల సమయంలో దాడులు, బెదిరింపుల, అవకతవకల వరకు రమేశ్‌ కుమార్‌తో అధికార పక్షానికి ఎలాంటి వైరం లేదు. తాను తలచినట్లు కాకుండా ఎన్నికలను వాయిదా వేశాక, కొంత మంది అస్మదీయ అధికారులపై చర్యలకు సిఫారసు చేశాక ఘర్షణ మొదలైంది. నిజానికి రమేశ్‌ కుమార్‌ ఎన్నికల నిర్వహణలో తొలుత అలసత్వం వహించారు. రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 243(కె) ప్రకారం ఒకసారి ఎస్‌ఇసిని రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుతో గవర్నర్‌ నియమించాక, ఆ అధికారి తొలగింపుపై పార్లమెంట్‌ నిర్ణయించాలి. ఐదేళ్లకు నియమించి మధ్య లోనే, అదీ ఎన్నికల ప్రక్రియ నడుస్తున్న వేళ రమేశ్‌ పదవీకాలాన్ని కుదించి ఇంటికి పంపడం తగని పని. ఏదేని చట్టం తదుపరి నియామకాలకు వర్తిస్తుంది మినహా అప్పటికే పదవిలో ఉన్న వారికి కాదు. ఇలాంటి చిన్న చిన్న లీగల్‌ లాజిక్‌లను ప్రభుత్వం తరచూ ఎందుకు మిస్‌ అవుతున్నదో తెలీదు. ఒక వేళ సి.ఎం చెప్పినట్లు ఎన్నికలు నిర్వహిస్తే కరోనా వలన ప్రజలకు వాటిల్లే ప్రమాదం ఊహించలేం. రమేశ్‌ తీసుకున్న వాయిదా నిర్ణయం సందర్భోచితమైనా, ప్రభుత్వం అంగీకరించలేక పోవడం అధికార అహాన్ని తెలుపుతుంది. స్వతంత్ర, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలపై ప్రభుత్వ ఉద్దేశపూర్వక రాజకీయ దాడి ప్రజాస్వామ్యానికి విఘాతం, రాజ్యాంగ విరుద్ధం. ఇలాంటి చర్యల వలన ఎన్నికల వ్యవస్థ పైనా, ప్రజాస్వామ్యం పైనా ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది