
ఆసియా వాణిజ్య కేంద్రంగా అమరావతి మారనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. జపాన్‌లో వ్యాపారవేత్తల బృందం, ప్రభుత్వ ప్రతినిధులూ వాణిజ్య కేంద్రాల రాజధానిగా అమరావతి రూపుదిద్దుకునే అవకాశ ముందని చెప్పినట్లు తెలిసింది. తమ రాజధాని కంటే అధునాతనమైన, ఉత్తమమైన రాజధానిని ఏర్పాటు చేసేందుకూ అవకాశాలున్నాయని జపాన్ ప్రతినిధులు తెలిపారని క్రిడా కమిషనర్ ఎన్.శ్రీకాంత్ చెబుతున్నారు. మాస్టర్ ప్లానొచ్చిన వెంటనే ఇక్కడ పనులు మొదలుపెట్టేందుకు తమ కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు జపాన్ సంస్థలు ఉత్సాహంగా ఉన్నాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వనరులపై ఇప్పటికే బహుళజాతి కంపెనీలు దృష్టి సారించిన విషయం తెలిసిందే. సుదీర్ఘమైన కోస్తాతీరం .. పోర్టులు అందుబాటులో ఉండడంతో ఆసియాకు కేంద్ర ప్రాంతంగా మారుతుందని ఆర్థిక రంగ నిపుణులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడున్న సహజ, మానవ వనరులను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు పెట్టేందుకు అనేక దేశాలు ముందుకు వస్తున్న నేపథ్యంలో ఆసియా అభివృది ్ధబ్యాంకు కూడా తనవంతు సాయం అందించింది. కోస్తా కారిడార్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అవసరమైన ఆర్థికపరమైన సాయాన్ని అందించనునంది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధత వ్యక్తం చేశాయి.
శ్రీకాకుళం జిల్లాలో జపాన్ కంపెనీ సుమిటోమొ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. కాకినాడ లాజిస్టిక్ హబ్‌గా, మచిలీపట్నం పెట్రోకెమికల్ హబ్, ఆక్వా హబ్‌గా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రాఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫెడరేషన్ కూడా ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏఏ యూనిట్లు ఏర్పాటు చేయాలనే అంశంపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీంతోపాటు మెకన్సీ నివేదికనూ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. దీనిఆధారంగానే ఒక్కో రంగానికి ఒక్కో కారిడార్‌నూ రూపకల్పన చేసింది. మచిలీపట్నం పోర్టుకు దగ్గరలో క్రాకర్(పెట్రో కెమికల్ ఆధారిత) యూనిట్‌ను పెట్టడం ద్వారా సుమారు లక్షకోట్ల పెట్టుబడులను ఆకర్షించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జపాన్‌లో పర్యటించిన బృందానికి అక్కడ నుండి సానుకూల సంకేతాలందాయి. వీలైనంత తొందరగా ఇక్కడ తమ యూనిట్లను ఏర్పాటు చేస్తామని కంపెనీల ప్రతినిధులు హామీలిచ్చారు. వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు పది నుండి 12 బహుళజాతి సంస్థలు ఉత్సాహంగా ఉన్నాయని క్రిడా కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. దీనిద్వారా జపాన్, భారతదేశ సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశముందనే సంకేతాలు వెలువడ్డాయని ఆయన తెలిపారు. దీనికోసం ప్రభుత్వము సింగిల్డెస్కు విధానాన్ని అమల్లోకి తెచ్చిందని వివరించారు. వీటితోపాటు రాకపోకలు కల్పించేందుకు వీలుగా విమానాశ్రయాలనూ విస్తరించేపని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోందని అధికారులు వివరించారు.