కరోనాపై పోరు - నేర్పుతున్న పాఠాలు

కరోనా వైరస్‌ మహమ్మారి మన సామూహిక జీవనంలోని అత్యంత తీవ్రమైన సమస్యలనూ, దాని ప్రధాన వైరుధ్యాలనూ బట్టబయలు చేసింది.ఎంత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టినా కొనలేని ఎన్నో వస్తువులు ప్రపంచంలో ఉన్నాయనీ, ''మార్కెట్‌ అదృశ్య హస్తం'' మీద ఆధారపడి పరిష్కరించలేని అత్యంత కష్టతరమైన సమస్యలెన్నో ఉన్నాయనీ, జనానికి 'హఠాత్తుగా' తెలిసివస్తున్నది. అంతే కాదు, ఆ సమస్యలను మనం ఒంటరిగా పరిష్కరించలేమని కూడా తెలిసివస్తున్నది. మన ప్రపంచమంతా ఒకటేననీ, దాన్ని రక్షించడానికి అందరమూ కలిసి పని చేయవలసిందేననీ తెలిసి వస్తున్నది. క్వారంటైన్‌ లూ, కలవకుండా ఉండడాలూ ఎంత ముఖ్యమైనప్పటికీ, ఈ మహా విపత్తును ఓడించాలంటే మనందరమూ కలిసి, ప్రపంచమంతా ఒకటిగా, ఉమ్మడిగా పని చేయవలసిందేననీ తెలిసివస్తున్నది.మన కళ్ల ముందరే కొన్ని విషయాలు మారిపోతున్నాయి. అన్ని చోట్లా మార్పు జరుగుతున్నదని కాదు. అయినా, పెద్దవారికి సాయపడాలనీ, స్వచ్ఛంద సంస్థల పనిలో భాగం పంచుకోవాలనీ యువకులలో తపన కనబడుతున్నది. నిన్నటిదాకా ఎక్కడో ఒక చిత్రమైన మినహాయింపుగా మాత్రమే ఉండిన ఈ ధోరణి ఇవాళ ఒక విస్తృతమైన ధోరణిగా మారింది. ఇటాలియన్లు సాయంత్రం ఆరు గంటలకల్లా తమ వరండాలలో నిలబడి వైద్య సిబ్బందికి ప్రశంసలు అందిస్తున్నారు. ఒకరికొకరు పాటలు పాడుకుంటున్నారు. మాస్కో స్టేట్‌ యూనివర్సిటీ విద్యార్థులు 65 ఏళ్లు దాటిన తమ ప్రొఫెసర్లకు సహాయం అవసరమైతే సంకోచించవద్దని చెపుతున్నారు. యువజనుల సంస్కృతిలో పరస్పర సహాయం నిత్యకృత్యమైపోయింది. ఒకప్పుడు వామపక్ష శిబిరాల్లో మాత్రమే ఉండిన పరస్పర సహాయం ఇవాళ విస్తృత ప్రజా సమూహాల్లో కనబడుతున్నది. ప్రజల జీవితాల్లో నిన్నటివరకూ ప్రధాన స్వభావంగా ఉండిన వ్యక్తివాదం ఇవాళ ఇంకెంతమాత్రమూ నెల రోజుల కింద కనబడినంత పవిత్రంగా కనబడడం లేదు.

మహా మాల్‌లన్నీ ఖాళీ అయిపోయాయి. సరుకులు కొంటూ కాలం గడపడం అనేది లేకుండా వాస్తవంగా జీవితాలు గడపవచ్చునని మనం హఠాత్తుగా గుర్తించడం మొదలుపెట్టాం. మార్కెట్‌ లోకి వచ్చిన కొత్త కారు కొనడం కోసమే జీవించడమనేది ఏమంత గొప్ప విషయం కాదనీ, బహుశా తెలివితక్కువ తనమనీ తెలిసివస్తున్నది. కుటుంబమంతా కలిసి పుస్తకాలు చదువుకోవచ్చుననీ, సినిమాలు చూడవచ్చుననీ తెలిసి వస్తున్నది. కొత్త సామాజిక వాతావరణంలో వినియోగదారీ సమాజపు ఎండమావులు కదిలిపోతున్నాయి, కరిగిపోతున్నాయి, చెల్లాచెదురైపోతున్నాయి.మొట్టమొదటిసారిగా కోట్లాది మంది మనుషులు డబ్బుకూ, ఘనత వహించిన బ్రాండ్లకూ, అత్యాధునిక జీవన శైలికీ భిన్నమైన సంగతుల గురించి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించారు. తమ జీవితాలను పోటీ లేని ప్రపంచంలో, సంఘీభావం విలసిల్లే ప్రపంచంలో సాగించగల అవకాశాల గురించి ఆలోచించడం ప్రారంభించారు.ఇవాళ ప్రపంచమంతటా ఒక దృశ్యం స్పష్టంగా బైటపడుతున్నది. అదేమంటే ఎక్కడైతే ప్రభుత్వ రంగం బలహీనంగా ఉన్నదో, ఎక్కడైతే రాజ్యం సామాజిక ప్రయోజనాల కోసం కాకుండా ఒక అత్యల్ప సంఖ్యాక వ్యాపార, అధికార ప్రయోజనాల కోసం పని చేస్తున్నదో, అక్కడ అతి ఎక్కువ మంది జీవితాలను వైరస్‌ బలిగొంటున్నది.
ప్రత్యామ్నాయం సుస్పష్టమే. అది రాజ్యమూ పౌర సమాజమూ కలిసి అత్యంత కీలకమైన వ్యవస్థలలో ప్రణాళికాబద్ధమైన, ప్రత్యక్ష (మార్కెటేతర), సంఘీభావ చర్యలు తీసుకోవడం. ఆ చర్యల వల్ల మొట్టమొదట ఆరోగ్య రంగం, సామాజిక భద్రత, మౌలిక సౌకర్యాలు, విద్యుత్‌ సరఫరా, ప్రజల సహకారయుత ఉత్పాదక సామర్థ్యం వికసిస్తాయి. ఇక్కడ మనం తప్పనిసరిగా ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేషన్లను సాహసికంగా సామాజికీకరించే వైపు అడుగులు వేయాలి.ఇప్పుడు కూడా, పెట్టుబడి యజమానులు 'ప్రపంచ జనాభాలో సగానికి ఈ అంటువ్యాధి అంటినా సరే' అని సిద్ధంగా ఉన్నారు గాని, తమ విదేశీ ఆర్థిక స్థావరాల మీద నిషేధం విధించడానికి గాని, తమ సొంత ఖర్చులలో ఒక పెద్ద భాగాన్ని ప్రజా అవసరాలు తీర్చడానికి మళ్లించడానికి గాని సిద్ధంగా లేరు. కాని వీళ్లు తమ సంపదలో కొంచెమైనా పంచుకునేలా ఒత్తిడి తేవడం అవసరమని అశేష ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు. చివరికి రాజ్యం కూడా ఆ విషయం అర్థం చేసుకుంటున్నది. ఈ మహా సంపన్నులకు సేవ చేయడమే దానికి ఇప్పటివరకూ తెలిసింది. కాని ఇప్పుడు మాత్రం దాని వెన్నెముకలో ఒక చిన్న గగుర్పాటు కలుగుతున్నది. పౌరుల జీవితాల పట్ల తన బాధ్యతను గుర్తు తెచ్చుకొమ్మని ఆ గగుర్పాటు సూచిస్తున్నది. ఈ వ్యవహారంలో రాజ్యపు నిష్క్రియనూ, తాత్సారాన్నీ మనం ఎప్పటికీ క్షమించలేం. ఈలోగా, మహమ్మారులూ క్వారంటైన్‌ లూ నిండిన ప్రపంచంలో జీవించడం కన్న తమ ఆదాయాలలో, చివరికి ఆస్తులలో కూడా ఒక భాగాన్ని ఇతరులతో పంచుకోవడం మంచిదని కోటీశ్వరుల, శత కోటీశ్వరుల పరివారాలలోని కొందరు వ్యక్తులైనా గుర్తిస్తున్నారు.

బహుశా ఇక్కడ ప్రధాన విషయం, ఈ సందర్భంలో వైరస్‌ కు వ్యతిరేక పోరాటంలోని అన్ని విజయాలూ, అన్ని నూతన ఆవిష్కరణలూ, వ్యాక్సిన్‌ సృష్టించడానికీ ఉన్న అన్ని రకాల మార్గాలూ, తదనంతర చర్యలూ, వ్యాక్సిన్‌, దాన్ని ఉత్పత్తి చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానమూ అన్నీ కూడ మానవాళి అంతటికీ చెందినవిగా గుర్తించాలి. ఎటువంటి ధర లేకుండా, ఎటువంటి పరిమితులు లేకుండా మానవాళి అంతటితో పంచుకోవాలి. ఈ వ్యాక్సిన్‌ ను ఎవరు ఎక్కడ సృష్టించినప్పటికీ దాని మీద ప్రైవేటు మేధో హక్కుల ఆంక్షలు ఉండగూడదు.

తళుకు బెళుకుల తారలకూ ఫుట్‌బాల్‌ క్రీడాకారులకూ మీరు నెలకు లక్షల యూరోలు ముట్టజెపుతారు. జీవ శాస్త్రవేత్తలకు నెలకు రెండు వేల యూరోలివ్వడానికి గింజుకుంటారు. ఇప్పుడేమో మీకో వ్యాక్సిన్‌ కావాలని మా దగ్గరికి వచ్చారా? వెళ్లండి ఆ తారల దగ్గరికే. వాళ్లు మీకోసం ఒక వ్యాక్సిన్‌ తయారు చేస్తారేమో చూడండి' అని ఒక శాస్త్రవేత్త అన్నాడట. తారలు, మార్కెట్‌ డిరైవేటివ్‌లు, బ్రాండ్లు, సరికొత్త వేలంవెర్రి మోజులు, అతి ప్రదర్శనలు వంటి ఎన్నో ప్రేరణా వస్తువుల తయారీ ద్వారా తన మనుగడ కొనసాగించుకుంటున్న ఇటీవలి పెట్టుబడిదారీ విధానపు ప్రపంచం, వైరస్‌ వంటి సమస్యను అడ్డుకోవడానికి గాని, పరిష్కరించడానికి గాని తనకు శక్తి సామర్థ్యాలు లేవని రుజువు చేసుకున్నది. ఈ ప్రపంచాన్ని మార్చక తప్పదు. ఈ మహమ్మారి దాడి చేసిన సందర్భంలో గత ఇరవై సంవత్సరాలలో రెండో పెద్ద ప్రపంచ స్థాయి ఆర్థిక సంక్షోభం ప్రారంభం కాబోతుంది. అది కూడా ఈ ఫలితాన్నే పరోక్షంగా సూచించింది. ఇప్పుడు మహమ్మారి దాన్నే ప్రత్యక్షంగా సూచిస్తున్నది.

ముగింపుగా చెప్పాలంటే, సంఘీభావం కోసం, న్యాయం కోసం, అంతర్జాతీయత కోసం వెలువడుతున్న ఆకాంక్షలన్నీ ఒక కొత్త సమాజ ఆవిర్భావపు తొలి సూచనలు. ఈ కొత్త సమాజం ఆవిర్భావం కోసం రెండు శతాబ్దాలుగా పెనుగులాడుతున్నది. అనేక హింసలు భరించింది. అనేక వైరుధ్యాల గుండా పయనించింది. ఎంతో నెత్తురూ చెమటా కార్చింది. జన్మనెత్తడానికి రెండు శతాబ్దాలుగా ప్రయత్నిస్తున్నది. నూట యాబై సంవత్సరాల కింద మార్క్స్‌, ఎంగెల్స్‌ లు దాన్ని 'స్వేచ్ఛా ప్రపంచం' అని పిలిచారు. దాన్ని కమ్యూనిజం అంటారు. దాని అసలు పేరు అదే. దాని సారాంశంలో ఉన్నవి మూడు అంశాలు: సంఘీభావం, న్యాయం, అంతర్జాతీయత. వాటితో పాటు మరొక అంశం ఉంది. అది స్వేచ్ఛ. చారిత్రక అభివృద్ధి నియమాలను తెలుసుకునే స్వేచ్ఛ. ఆ సూత్రాలకు అనుగుణంగా ప్రపంచాన్ని మార్చడానికి స్వేచ్ఛ. ప్రపంచాన్ని మార్చడానికిదే సమయం. రేపు అని కూచుంటే చాలా ఆలస్యమైపోవచ్చు. ఇవాళే మనం కచ్చితంగా స్థిరంగా వామపక్షం వైపు కదలకపోతే, మన మీద రేపు దిగబోయేది ఫాసిజం అనే మహా గత్తర. అది కరోనా వైరస్‌ మహమ్మారి కన్న మరింత భయంకరమైనది.