దేశంలో ఈ లాక్‌డౌన్ కాలంలో మనం కొన్ని అంశాలను గమనించవచ్చు. మొదటిది, భారతదేశ ప్రజలంతా ప్రభుత్వ సూచనలను అనుసరించడం ద్వారా తమ బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఆకస్మికంగా ప్రకటించిన లాక్‌డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు తలెత్తినప్పటికీ, కరోనా మహమ్మారిని నిరోధించేందుకు ప్రజలంతా ఐక్యంగా తమ పాత్రను పోషిస్తున్నారు.దేశ వ్యాప్తంగా సాధ్యాసాధ్యాల మేరకు భారత కమ్యూనిష్టు పార్టీ (మార్క్సిస్టు) కార్యకర్తలు, పార్టీ అనుబంధ కార్మిక సంఘాలు, ఇతర ప్రజాసంఘాల కార్యకర్తలు...నిరాశలో, అవసరాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడటం మనకు ప్రోత్సాహకరమైన మరొక అనుభవం. ఎర్రజెండా ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేసే చిహ్నంగానే ఉంటుంది.ఈ కాలంలో ప్రతికూలమైన విషయం ఏమంటే... దేశ ప్రజల మాదిరిగా, మన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వహించడం లేదు. ఇతర దేశాలు కూడా లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. కానీ రానున్న ఇబ్బందులను ఎదుర్కోవడానికి సంసిద్ధం కావాల్సి ఉందన్న ప్రజల హక్కులను గౌరవిస్తూ, అనేక దేశాలు లాక్‌డౌన్ విధించడానికి ఒక రోజు నుంచి మూడు రోజుల మధ్య నోటీసులు ఇచ్చాయి. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రభుత్వం కేవలం నాలుగు గంటల ముందే నోటీసు ఇచ్చింది, ఎందుకు? ఒక దేశంలో లాక్‌డౌన్ చేయాలంటే మొత్తం ప్రజల సహకారం అవసరం. కానీ ఈ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కోసం ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలన్న ఆలోచన చెయ్యదనేది స్పష్టమైంది.
లాక్‌డౌన్ ప్రకటన చేయడానికి ముందు ప్రజల్లో నెలకొన్న భయాలను తొలగించేందుకు...ఆఖరికి బడా పెట్టుబడిదారీ దేశాల్లోని ప్రభుత్వాలు కూడా ప్రజల కోసం ప్యాకేజీలను ప్రకటించాయి. ఈ ప్యాకేజీలన్నీ వ్యాపారానికి సహాయ పడేందుకు ఉద్దేశించబడినవనేది వాస్తవం. అయినప్పటికీ ఆ ప్రభుత్వాలు తమ ప్రజల కోసం 'ప్రత్యక్ష నగదు బదిలీ'ని ఆ ప్యాకేజీలో చేర్చాయి. ప్రయివేటు రంగంలో కార్మికుల వేతనాల తగ్గింపులు లేదా తొలగింపును నిరోధించేందుకు గాను...తమ ప్రభుత్వాలు ప్రయివేటు రంగంలో పని చేసే కార్మికులకు 70-80 శాతం జీతాలు చెల్లిస్తాయని బ్రిటన్, జర్మనీలు ప్రకటించాయి. కానీ భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌కు ముందు ప్రజలకు సహాయం చేసే ఏ ఒక్క చర్యనూ ప్రకటించలేదు.
లాక్‌డౌన్ ప్రకటించి, నాలుగు గంటలలో దానిని అమలు చేస్తే, ప్రతి ఇంటి ముందు ప్రధాని గీసిన లక్ష్మణరేఖను ప్రజలు దాటరని తెలిసిన మోడీ ప్రభుత్వానికి...కోట్ల మంది భారతీయుల సామాజిక, ఆర్థిక మూలాల జాడలు తెలియదా? దేశ రాజధాని ఢిల్లీ లోని మురికివాడల్లోని చిన్న గదుల్లో, నిర్మాణం జరిగే ప్రదేశాలలో, వారు పని చేసే చిన్న దాబాలలో, హోటళ్ళలో, ఆఖరికి మూతపడిన షట్టర్లలో తోటి వలస కార్మికులతో కలిసి జీవనం సాగిస్తున్న వారు ఢిల్లీలో లక్షల్లో ఉన్నారు. ఒక్కసారిగా ఈ పని ప్రదేశాలన్నీ మూత పడ్డాక, ఈ లక్షలాది కార్మికులకు ఆకలి భయంతో ప్రధాని లక్ష్మణరేఖను దాటి కాలినడకన సొంత గ్రామాలకు బయలుదేరడం తప్ప వేరే మార్గం లేకపోయింది.ఢిల్లీలో వలస కార్మికులు సుమారు 1.2 మిలియన్ల మంది ఉన్నారని 'ఢిల్లీ ఎకనామిక్ సర్వే' తెలిపింది. ముంబయిలో కూడా పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా వారికి ఉన్న ఒకే ఒక సందేశం ఏమంటే 'వారు సొంత ఇంటికి వెళ్ళవలసిన అవసరం ఉంది'. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నుంచి ఎటువంటి రక్షణ హామీలు పొందని, వందల కిలోమీటర్లు నడిచి వెళ్తున్న ఈ లక్షలాది కార్మికులు, మహిళలు చిన్నారులతో జాతీయ రహదారులు నిండిపోయాయి. వారి బాగోగులను చూసుకుంటామన్న ఒక్క మాట కూడా ప్రభుత్వం నుంచి రాలేదు సరికదా.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వలస కార్మికుల పట్ల ప్రదర్శించిన క్రూరత్వం జాతీయ ఛానళ్ళ ద్వారా ప్రతి ఇంటికీ చేరింది.
ఉత్తర ప్రదేశ్‌లో వలస కార్మికులపైన రసాయనాలు స్ప్రే చేయడం, ఏడుస్తున్న కార్మికులను బీహార్‌లో ఒక షెడ్డులో బంధించడం, హర్యానాలో వారి కోసం తాత్కాలిక జైళ్లు తెరవడం, దేశ వ్యాప్తంగా జాతీయ రహదారుల పైన సౌకర్యాలు లేని నిర్భంధ కేంద్రాల్లో గుంపులు గుంపులుగా ఉంచడం, విపత్తుల నిర్వహణ చట్టం ప్రకారం అటువంటి వారిని జైల్లో పెట్టాలని హోం మంత్రిత్వ శాఖ నుంచి సర్క్యులర్ రావడం వారిని తీవ్రమైన మానసిక హింసకు గురిచేశాయి. వారిని అమానవీయంగా హింసించిన తీరు చూసి భారతదేశం సిగ్గు పడింది. హర్యానా నుంచి చాలా దూరం నడిచి నీరసించిన ఒక కార్మికుడు 'మమ్ముల్ని వాళ్ళు కాల్చి పారేస్తే పొయ్యేది' అనడం వారి వేదనకు అద్దం పడుతోంది.
బాధ్యత వహించడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం లోని కొంతమంది అధికారులను బలిపశువులను చేస్తూ, తప్పుడు పద్ధతిలో శిక్షిస్తున్నది. ప్రయాణ ప్రాంగణాలకు పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్మికుల కోసం...ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు వరకు బస్సులు సమకూర్చినందుకు...ఢిల్లీ రవాణా శాఖలో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్న అధికారిణిపై చర్యలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ కార్మికులను వారి గమ్యానికి చేర్చడానికి కొన్ని బస్సులను సమకూర్చింది. మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిని కూడా తొలగిస్తారా?
ఈ ఘటన అనంతరం అన్ని రాష్ట్రాల సరిహద్దులు మూసివేయాలన్న ప్రకటనతో పాటు 'ఎవ్వరూ అద్దెలు చెల్లించవలసిన అవసరం లేదు. అన్ని రకాల జీతభత్యాలు యాజమాన్యాలే చెల్లిస్తాయి' అని ప్రభుత్వం తెలియజేసింది. ఇంతకీ దీని అమలుకు ఎవరు హామీ ఇవ్వాలి? ఇతర దేశాల్లో జరుగుతున్న విధంగా తమను ప్రభుత్వమే ఆదుకుంటుందనే విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించాల్సింది ప్రభుత్వమే. కానీ, ఈ చర్యలతో పాటే...గతంలో ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీ సైతం...ఎవరికోసమైతే ఉద్దేశించబడిందో వారిలో ఆ విశ్వాసాన్ని కల్గించలేదు. ప్రకటించిన రూ.1.7 లక్షల కోట్లు వాస్తవానికి అంచనా బడ్జెటే.ప్రత్యక్ష నగదు బదిలీకిగాను ప్రకటించిన రూ.35 వేల కోట్లు ప్రపంచంలోనే అత్యంత తక్కువ కేటాయింపు. పైగా పెద్ద సంఖ్యలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికులను దీని నుంచి మినహాయించారు. ప్రభుత్వం ఇవ్వజూపిన ప్యాకేజీకి, వారు తమ స్వస్థలాలకు కాలినడకన చేసిన యాత్ర ఒక అవిశ్వాస ఓటు యాత్ర. ప్రభుత్వం ఇంకా అనేక కొలమానాలను పరిగణన లోకి తీసుకొనవలసిన అవసరం ఉంది. జన్‌ధన్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి చెందిన ఖాతాదారులకు ఒక్కొక్కరికి నెలకు కనీసం రూ.5 వేల చొప్పున మూడు వారాల లాక్‌డౌన్‌కు సరిపోయే విధంగా మొదటి వాయిదాను బదిలీ చేయాలి.
సరిహద్దుల మూసివేత అంశాన్ని పరిశీలిస్తే, ఇది అంతర్రాష్ట్ర నిత్యావసర సరుకుల రవాణాపై ప్రభావం చూపుతుంది. ప్రతి రాష్ట్రం ఇతర రాష్ట్రాల పైన కొన్ని నిత్యావసర సరుకుల కోసం ఆధారపడి ఉంటుంది. సరిహద్దుల మూసివేత రవాణాలో సంక్షోభానికి దారి తీయకూడదు కదా..?
కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కన్నా మంచి నిర్ణయాలను తీసుకున్నాయి. ఇందుకు గాను రాష్ట్రాలకు నిధులు అవసరం. ఇప్పుడు కార్మికులను తీవ్రమైన చర్యల ద్వారా నిర్బంధించడానికి ఉపయోగించే విపత్తుల నిర్వహణ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు బదిలీ చేయాలన్న నిబంధన కూడా ఉంది. ఆ చట్టం ప్రకారం రాష్ట్రాలకు నిధుల బదిలీకి సహకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సామర్థ్యాన్ని బలోపేతం చేయాలి.
కేరళ రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర ప్రభుత్వం కరోనా వైరస్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాల ఫలితంగా నేడు కేరళ దేశంలోనే ఒక స్ఫూర్తిదాయకమైన రాష్ట్రంగా నిలిచింది. ప్యాకేజితో పాటు లాక్‌డౌన్‌కు ముందే ఆ ప్రభుత్వం వలస కార్మికులకు ఆహారం, ఆశ్రయానికి గాను ఒక విధానాన్ని రూపొందించింది. కేరళ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సన్నాహాలను సుప్రీంకోర్టు కూడా గుర్తించి, ప్రశంసించింది. మార్కెట్ రుణ పరిమితిని పెంచుకునే విధంగా అనుమతి ఇవ్వాలని ఆ ప్రభుత్వం అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ, కేంద్రం అనుమతివ్వలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి పేరుతో ఒక ట్రస్ట్‌ను స్థాపించింది. ఇప్పటికే ప్రధానమంత్రి సహాయనిధి ప్రశ్నార్థకంగా ఉంటే, మళ్ళీ ఈ ట్రస్ట్ దేనికి?
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో, వైద్య రంగం లోని అవసరాలను తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం చాలా వెనుక పడినట్టు ఈ కాలంలో చూశాం. వైద్యరంగంలో పని చేసే డాక్టర్లు, నర్సులు మొదలగు వారి కోసం అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు వారి దగ్గర లేవు. గ్రామీణ ప్రాంతాల్లో లక్షల సంఖ్యలో పని చేసే ఆశా వర్కర్ల శిక్షణ గురించి ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వీరంతా వారి పరిధి లోని గ్రామాల్లో వైద్య సంబంధమైన కేసులను పర్యవేక్షణ చేసే వైద్య కార్మికులు. సరయిన పరీక్షా పరికరాలు లేని కారణంగా నాణ్యత లేని పరీక్షా విధానాలను అనుసరించడం వల్ల భారతదేశం అంటువ్యాధిని గుర్తించలేని ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. కాబట్టి దాదాపు వైద్య రంగ నిపుణులు అందరూ ఆ విధానాలను అపాయకరమైనవిగా పరిగణిస్తున్నారు. ఈ లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఖాళీగా వున్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. ఇందుకు సరిపడా నిధులు కేటాయించాలి. కానీ ప్రకటించిన రూ.15 వేల కోట్లు ఏ మాత్రం సరిపోవు.
హెల్త్ ఎమర్జెన్సీ కాలంలో చర్యలు చేపట్టేటప్పుడు భారత రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలను దృష్టిలో వుంచుకోవాలి. ఫెడరలిజం, రాజ్యాంగం లోని నిబంధనలకు అనుగుణంగా...జాతీయ ఆదాయం లోంచి రాష్ట్రాలు న్యాయంగా తమకు రావాల్సిన వాటాను పొందగలగాలి. కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించుకునే పోరాటంలో భారత దేశ ఐక్యత చాలా కీలకమైనది. భారత ప్రభుత్వం దేశం మొత్తం పైన ప్రభావం చూపే నిర్ణయాలను తీసుకునే సమయంలో రాజ్యాంగం యొక్క ప్రజాతంత్ర, సమాఖ్య లక్షణాలను దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడే భారతదేశ ఐక్యత మరింత బలపడుతుంది.
బ్రిందా కారత్ (వ్యాసకర్త సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు)