కరోనా సోకిన రోగి డాక్టర్ మీద వాంతి చేసుకుంటే ఏం చెయ్యాలి? క్వారంటైన్ లో వాంతి చేసుకుంటే ఏం చేయాలి? ఆపరేషన్ జరుగుతున్న సమయంలో వైరస్ నిండిన రక్తం చిందితే ఏం చేయాలి? ఆస్పత్రిలో వైరస్ సోకిన ప్రాంతానికి, సురక్షిత ప్రాంతానికి మధ్య తేడాను ఎలా పాటించాలి? ఎటువంటి అనుమానితులను వైద్య పరీక్షలకు ఎంపిక చేసుకోవాలి? కరోనా వైరస్ బారినపడి చనిపోయిన వారిని ఎలా అప్పగించాలి?గత మూడు నెలలుగా ముందు వరుసలో నిలబడి పని చేసిన డాక్టర్లు, నర్సుల అనుభవాలను క్రోడీకరించి...ప్రపంచ దేశాలకు ఉపయోపడే విధంగా చైనా ఒక నివేదిక విడుదల చేసింది. పై ప్రశ్నలకు సమాధానం అందులో లభిస్తుంది. నివేదిక లోని పలు అంశాలను 'బిజినెస్ స్టాండర్డ్' దినపత్రిక ధారావాహికగా ప్రచురించే ప్రయత్నంలో ఉన్నది. అందులోని మొదటి భాగాన్ని ఇక్కడ పొందుపరుస్తున్నాం.అక్కడ ఆస్పత్రులలో ఉన్న స్థల లభ్యత, సదుపాయాలను పరిశీలించి ముందుగా కొన్ని మార్పులు చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల నుంచి... అప్పటికే అక్కడ ఉన్న వారికి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఆస్పత్రిలో ఒక ఫీవర్ విభాగాన్ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళడానికి ప్రత్యేకంగా ఒక మార్గం ఏర్పాటు చేశారు. ఇతరులకు అటువైపు అనుమతి నిరాకరించారు. ఆస్పత్రిలో 'మూడు విభాగాలు- రెండు దారులు' అనే విధానాన్ని అమలుచేసి, పౌరుల రాకపోకలను నియంత్రించారు. వ్యాధి సోకిన వారిని ఒక విభాగంలో ఉంచారు. 'సోకవచ్చు' అనే అనుమానం ఉన్నవారిని రెండో విభాగంలో ఉంచారు. చివరి విభాగాన్ని 'క్లీన్ జోన్' అన్నారు. ఇందులో వ్యాధి సోకని వారిని ఉంచారు. ప్రతి రెండు విభాగాలకు మధ్య చాలా దూరం ఉంచారు. చికిత్సకు వాడిన వైద్య పరికరాలు, ఇతర వస్తువులను నిరంతర పర్యవేక్షణ మధ్య మరో ప్రత్యేక మార్గం ద్వారా బయటికి తరలించారు.
చైనాలో కచ్చితమైన స్క్రీనింగ్ ద్వారా అనుమానితులను వేరు చేసి 'కోవిడ్-19 అనుమానితుల' ప్రత్యేక జోన్‌కు తరలిస్తున్నారు. వివిధ శాఖల ద్వారా లభించిన సమాచారాన్ని వినియోగించి ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలలో ప్రయాణం చేసినవారిని గుర్తిస్తున్నారు. వారు తిరిగిన ప్రాంతంలో ఎక్కడైనా కరోనా వ్యాధిగ్రస్తులు ఉన్నారా? శ్వాసకోస వ్యాధులతో బాధ పడుతున్నవారు ఉన్నారా? అనేది నిగ్గు తేల్చుతున్నారు. ఒక వ్యక్తికి పైన చెప్పుకున్న ఏ రెండు అంశాలతో సంబంధం ఉన్నా... అతడిని వైరస్ ఉన్న వ్యక్తిగా గుర్తించి మొత్తం పరీక్షలు చేయిస్తున్నారు. వారిని కలిసిన వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారికి కూడా పరీక్షలు చేస్తున్నారు. అలాంటి వారికి సీటి స్కాన్, రక్తపరీక్షలు చేస్తున్నారు. వారి ఊపిరితిత్తులు పారదర్శకంగా లేకపోయినా, వాటిపై మచ్చలు ఉన్నా వారికి కరోనా వైరస్ ఉండే అవకాశముంది. ఎవరికైనా తెల్ల రక్త కణాలు తగ్గిపోతుంటే వైద్య పరీక్షల ద్వారా 'అనుమానితుడా లేక వ్యాధిగ్రస్తుడా' నిర్ధారిస్తున్నారు.అనుమానితులను, వ్యాధి నిర్ధారణ అయిన వారిని వేరు చేస్తున్నారు. అనుమానితులను విడిగా వేరే గదుల్లో ఉంచుతున్నారు. వారి బాత్‌రూమ్‌లు వేరుగా ఉంటున్నాయి. వ్యాధి నిర్ధారణ అయిన వారిని ఒకే వార్డులో ఉంచి నాలుగు అడుగుల దూరంలో మంచాలు ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులు కలవడాన్ని నిషేధించారు. వారు రోగులతో సెల్‌ఫోన్ ద్వారా మాట్లాడుకోవడానికి సదుపాయం కల్పించారు.
చైనా అనుసరించిన వ్యూహంలో కీలకమైనది వైద్య సిబ్బంది నైపుణ్యంతో పని చేయడం. అందుకోసం వైద్య సిబ్బంది లోని ప్రతి ఒక్కరికి శిక్షణ ఇచ్చి, పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత రక్షణ పరికరాలను సరైన పద్ధతిలో తొడుక్కోకపోయినా వారిని వ్యాధి సోకిన వార్డులలో పని లోకి తీసుకోవడం లేదు. మొత్తం సిబ్బందిని అనేక బృందాలుగా విడదీశారు. ఐసొలేషన్ వార్డు సిబ్బందితో నాలుగు గంటలు మాత్రమే పని చేయిస్తున్నారు. ఈ సిబ్బందిని అంటే డాక్టర్లు, నర్సులు, టెక్నికల్ సిబ్బందిని విడిగా ఐసొలేషన్ వసతి గృహాలలో ఉంచుతున్నారు. వీరు బయటికి పోవడానికి, కుటుంబ సభ్యులను కలవడానికి వీలు లేదు. పై అధికారుల అనుమతితో మాత్రమే ఎవరినైనా కలవవచ్చు. సాధారణ జీవితానికి వెళ్ళే అనుమతి పొందినవారిని నూక్లిక్ యాసిడ్ టెస్ట్ (ఎన్‌ఏటీ) చేసి....అది నెగటివ్‌గా వచ్చినప్పటికీ 14 రోజులు ఐసొలేషన్ వార్డులో ఉంచిన తరువాతే బయటకు పంపుతున్నారు.ఇన్‌ఫెక్షన్ తొలగించడానికి అమెరికా సైన్యం భూదహన విధానాన్ని పాటిస్తుంది. అదే పద్ధతిని ఇప్పుడు చైనా అనుసరిస్తున్నది. ఐసొలేషన్ వార్డుల గోడలు, నేలను 30 నిమిషాల పాటు క్లోరిన్ కలిపిన నీళ్ళతో బాగా శుభ్రపరుస్తున్నారు. ఇలా (క్లోరిన్‌ని క్రిమిసంహరక పదార్థంతో కలిపిన ద్రవంలో) రోజుకు మూడుసార్లు శుభ్రం చేస్తారు. ఏదైనా తేడా వస్తే మరోసారి చేస్తున్నారు.
రోగి మలాన్ని క్రిమిసంహారక పదార్థం కలిపిన ద్రవంలో (ప్రతి లీటర్‌కు 40 మిల్లీగ్రాముల క్లోరిన్ కలిపి) 90 నిమిషాల పాటు శుద్ధి చేసిన తర్వాత మాత్రమే నాళా లోకి వదులుతున్నారు. రక్తపు చుక్కలు పడినప్పుడు కూడా ఇదే పద్ధతుల్లో క్రిమిసంహారక పదార్థం కలిపిన ద్రవంతో (5000 మిల్లీగ్రాముల క్లోరిన్ కలిపి) తుడిచి, తొలగిస్తున్నారు. ఎక్కువ రక్తం పడితే పైన చెప్పిన దానికంటే రెండింతలు క్లోరిన్ కలిపి శుద్ధి చేస్తున్నారు.
రోగి వాంతులు చేసుకుంటే దానిని ఒక డబ్బా లోకి సేకరించి 20,000 మిల్లీగ్రాముల క్లోరిన్‌ను క్రిమిసంహారక ద్రవంలో కలిపి మూడు గంటలపాటు శుద్ధిచేస్తారు. భద్రపరచిన డబ్బాలను కూడా 5000 మిల్లీగ్రాముల క్లోరిన్‌తో శుద్ధి చేసిన తరువాతనే చెత్తలో కలుపుతారు. వాడిన సిరెంజీలను కూడా ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచి శుద్ధి చేసి చెత్తలో కలుపుతున్నారు.
శవాలను కూడా చాలా జాగ్రత్తగా బయటికి తరలిస్తున్నారు. శరీరంలో ఉన్న అన్ని ద్వారాలు (చెవి, ముక్కు, నోరు, మల ద్వారాలను) దూదితో మూసివేస్తారు. ఆ దూదిని కూడా క్లోరిన్ కలిపిన క్రిమిసంహరక ద్రవంతో శుద్ధి చేసి పెడతారు. శరీరాన్ని క్రిమిసంహరక ద్రవంతో శుద్ధిచేసిన గుడ్డ, ప్లాస్టిక్‌తో 4 పొరలలో చుట్టి వీలైనంత త్వరగా తరలించి అంత్యక్రియలు పూర్తి చేస్తున్నారు. చైనా తన అనుభవాలను ప్రపంచ దేశాలతో బహిరంగంగా పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నది. అయితే భారతదేశం ఆ అనుభవాలను నుంచి ఏం నేర్చుకుంటుందనేది చూడాల్సి ఉంది.