కరోనా కారణంగా దేశవ్యాప్తంగా అమలవుతోన్న లాక్‌డౌన్ ప్రభావం తూర్పు గోదావరి లోని సుమారు 1.50 లక్షల మంది ట్రాన్స్‌పోర్టు రంగ కార్మికులపై తీవ్రంగా పడింది. అత్యవసర సరకుల రవాణా మినహా మిగిలిన సరకుల రవాణా నిల్చిపోవడంతో లారీ డ్రైవర్లకు, క్లీనర్లకు ఉపాధి కరువైంది. ఆర్థిక సంక్షోభం, ఇటీవల వరకు ఎదుర్కొన్న ఇసుక కొరత వల్ల ఇప్పటికే రవాణా రంగం తీవ్ర ఒడిదొడుకుల్లో ఉంది. దీనికి లాక్‌డౌన్ కూడా తోడు కావడంతో ట్రాన్స్‌పోర్టు రంగ కార్మికులు, ట్రాన్స్‌పోర్టు వాహనాల యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. కార్మికులు అప్పులు చేసి కుటుంబాలను నెట్టుకురావాల్సి వస్తోంది.తూర్పుగోదావరి జిల్లాలో పది టన్నుల కెపాసిటీగల టిప్పర్, క్వారీ లారీలు 6,500 వున్నాయి. 20 టన్నుల కెపాసిటీ వున్న మార్కెట్ లారీలు మూడు వేలు ఉన్నాయి. ఒక్కో లారీపై ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు క్లీనర్లు, లారీ యజమాని, లారీపై ఆధారపడిన కూలీలు మరో ఐదుగురు చొప్పున మొత్తం పది మంది వరకూ ఆధారపడుతున్నారు. ఈవిధంగా జిల్లాలో సుమారు 95 వేల కుటుంబాలు ఆధాపడి ఉన్నాయి. రావులపాలెం, జొన్నాడ, పి.గన్నవరం, ముమ్మిడివరం, కాకినాడ, రాజమహేంద్రవరం, పిఠాపురం, చిత్రాడ, ప్రత్తిపాడు, తుని, ఏలేశ్వరం, పెద్దాపురం, సామర్లకోట తదితర మండలాల్లోనూ, ఆత్రేయపురం మండలం అంకంపాలెం లోనూ లారీలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 40 వేలు ఆటోలుండగా, కొందరు డ్రైవర్ కమ్ ఓనర్లు ఉన్నారు. కొన్నింటిని యజమాని, డ్రైవర్లు నడుపుతున్నారు. ఈ విధంగా ఆటోలపై దాదాపు 50 వేల మంది ఆధారపడి ఉన్నారు. 407 మోడల్ వాహనాలు రెండు వేలు ఉండగా, వాటిపై నాలుగు వేల మంది ఆధారపడుతున్నారు. సుమారు రెండు వేల గూడ్స్ ఆటోలు ఉన్నాయి. వీటిపై రెండు వేల మంది ఆధారపడి బతుకుతున్నారు. ఇవి కాకుండా జిల్లాలోని తొమ్మిది ఆర్‌టిసి డిపోల పరిధిలో 180 ప్రయివేటు అద్దె బస్సులు ఉన్నాయి. ఒక్కో బస్సుకు ఇద్దరు చొప్పున 360 మంది డ్రైవర్లు ఉన్నారు. ప్రయివేట్ వాహనాలు, ఆర్‌టిసి బస్సులు కూడా నిల్చిపోవడంతో వీరంతా ఉపాధికి దూరమయ్యారు. ఫైనాన్స్‌పై లారీని కొనుగోలు చేసిన వారికి ఫైనాన్స్ కంపెనీ నుంచి వాయిదాల కోసం ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఏ రోజుకారోజు వాహనాలు కదిలినా సక్రమంగా ఫైనాన్స్ కట్టే పరిస్థితి లేదని, ఇప్పుడు రోజుల తరబడి వాహనాలు కదలకపోతే తమ జీవనాధారం ఎలా అంటూ పలువురు డ్రైవర్లు, క్లీనర్లు, యజమానులు, లారీలపై ఆధారపడిన కూలీలు వాపోతున్నారు.