ఒక విషాదానికి తెరతీసిన తీరు

దేశం యావత్తూ లాక్‌డౌన్‌లో ఉంది. కాని వేల సంఖ్యలో వలస కూలీలు ప్రతి పట్టణం లోనూ బస్‌స్టాండ్లలో కిక్కిరిసి పోయారు. లేదా రోడ్ల మీద ఉన్నారు. ఇక లాక్‌డౌన్‌కి అర్థం ఏంటి? ఈ మహమ్మారి వ్యాపించకూడదన్న లక్ష్యంతోనే లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు దేశాంతరవాసానికి బయలుదేరి ఇంతవరకూ ఈ మహమ్మారి సోకని పల్లె ప్రాంతాలకు పోతున్నారు. అక్కడేమో ప్రజారోగ్య వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది. వైరస్‌ వ్యాప్తి కారణంగా మానవ జీవితాలు విషాదం కాకూడదని లాక్‌డౌన్‌ విధిస్తే...అంతకన్న తీవ్రమైన మానవ విషాదం ఇప్పుడు కళ్లెదుట కనపడుతోంది!కేవలం నాలుగు గంటల వ్యవధి ఇచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించారు. సరైన ప్రణాళిక లేకుండా, ముందస్తుగా తగిన సన్నాహాలు చేయకుండా ఇటువంటి నిర్ణయాలు ప్రకటిస్తే పర్యవసానాలు ఈ తీరుగానే ఉంటాయి. అవసరమైన సన్నాహాలు పూర్తి చేసుకుని, సమగ్రమైన సహాయ చర్యలు ప్రకటించి దానితో బాటు లాక్‌డౌన్‌ ప్రకటిస్తే ఇలా జరిగేది కాదు. ఎలాంటి భయందోళనలకీ తావుండేది కాదు. అద్దెకుంటున్న వారెవరినీ ఖాళీ చేయించకుండా నిషేధాన్ని ప్రకటించడం, పదుల లక్షల సంఖ్యలో ఉన్న వలస కార్మికులు అందరికీ సహాయ చర్యలు ప్రారంభించడం తప్పనిసరిగా ముందే చేసి వుండాల్సింది. అటువంటివేమీ చేయలేదు. ఇళ్ల నుండి ఖాళీ చేయించడం మొదలైంది. తమ పరిస్థితి ఏం కానుందోనన్న భయాందోళన మొదలైంది. రెండు రోజుల తర్వాత ఆర్థికమంత్రి ప్రకటించిన సహాయక చర్యలు తమకు ఏవిధంగానూ సహాయపడవని వారికి అర్థమైంది. దాంతో దేశాంతర యాత్రలు మొదలయ్యాయి. 

ఆర్థికమంత్రి ప్రకటించిన రూ.1.7 లక్షల కోట్ల సహాయక చర్యలన్నీ ఇదివరకు ప్రభుత్వం ప్రకటించిన పథకాలే. వాటిలో అదనంగా ఉన్నదేదీ లేదు. ఆ ప్యాకేజీలో పాత ప్రతిపాదనలనే కొత్త రూపంలో ప్రతిపాదించారు. లేదా ఇప్పుడిప్పుడే ఖర్చు చేయడం సాధ్యం కాని ప్రతిపాదనలైనా చేశారు. అయినా వాటన్నింటినీ 'సహాయక చర్యలు' పేరుతో ప్రకటించారు. 8 కోట్ల 69 లక్షల మంది రైతులకు తలా రూ.2000 చొప్పున 'ప్రధాని కిసాన్‌ పథకం' కింద చెల్లిస్తామని ప్రకటించింది ఎటుతిరిగీ ఏప్రిల్‌లో మామూలుగానే రైతులకు ఇచ్చేదే. బడ్జెట్‌లో ఇంతకుముందే చేర్చినదే. దానిని కాస్తా తెచ్చి ఇప్పుడు సహాయ చర్యగా ప్రకటించారు. పోనీ అదైనా ఇచ్చేది ఎప్పుడు? మళ్లీ ఆ ఏప్రిల్‌ నెలలోనే. ఈ పథకం కింద బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం కన్నా గత రెండేళ్ల లోనూ రూ.40,000 కోట్లు తక్కువ చెల్లించారు. 2018-19 బడ్జెట్‌లో ఈ రూ.2000 పెంచుతామని వాగ్ధానం చేశారు కూడా. అయితే అటువంటిదేమీ జరగలేదు. ఇప్పుడు కూడా ఆ ఊసు లేదు. ఇక ఉపాధి హామీ పథకం కింద ప్రతి కూలీకీ అదనంగా రూ.2000 చొప్పున వస్తాయని, అందుకుగాను రోజు కూలీ రూ.182 నుండి రూ.202కి పెంచామని ప్రకటించిన మాట కూడా వట్టి డొల్ల. ప్రతి కూలీకీ 100 రోజుల పని దొరుకుతుందని చెప్పినది వాస్తవం కాదు. గత ఏడాది కేవలం ఏడు శాతం కూలీలకు మాత్రమే 100 రోజుల పని దొరికింది. ఇక గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ 2020-21 సంవత్సరానికి గాను రూ.226గా ప్రకటించింది. నిజానికి ఇప్పటికే 29 రాష్ట్రాలు రూ.202 కన్నా ఎక్కువే రోజు కూలీ చెల్లిస్తున్నాయి. లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఏ రాష్ట్రం లోనూ ఉపాధి హామీ పనులు జరగడం లేదు. పోనీ ఆర్థికమంత్రి ఉపాధి హామీ బకాయిల చెల్లింపు గురించి ఏమైనా ప్రస్తావించారా అంటే అదీ లేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి వుంది. 

కార్మికులకు చెందాల్సిన నిధులనే ఇప్పుడు సహాయ పథకంలో భాగంగా ప్రకటించారు. నిర్మాణ కార్మికుల నిధి, ఖనిజాల (తవ్వకాలు) నిధి అటువంటివే. ఈ నిధులను కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలి. కాని అలా చెయ్యనందున ఆ నిధులు పేరుకుపోయాయి. ఎటుదిరిగీ కార్మికులకు చెందే నిధులనే ఇప్పుడు సహాయక కార్యక్రమంగా ప్రకటించారు. దీనివలన బడ్జెట్‌పై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదు. ఈ సొమ్మునైనా ఏవిధంగా ఖర్చు చేస్తారో, ఎప్పటిలోపు ఖర్చు చేస్తారో అదీ నిర్దిష్టంగా లేదు. పైగా రిజిస్టరు అయిన నిర్మాణ కార్మికులు చాలా తక్కువ శాతం ఉంటారు. వారికే ఈ సహాయం అందుతుంది. రిజిస్టరు కాని నిర్మాణ కార్మికులే లాక్‌డౌన్‌ వల్ల బాగా దెబ్బతిన్నారు. కానీ, వారెవరికీ ఈ సహాయం అందదు. 

ఇక ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఖర్చులు వృద్ధులకు, మహిళలకు జనధన్‌ యోజన ద్వారా నగదు చెల్లింపు, 'ఉజ్వల' స్కీము కింద మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు, ప్రజా పంపిణీ ద్వారా అదనంగా ఆహార ధాన్యాల పంపిణీ, మొత్తం రూ.1.7 లక్షల కోట్ల సహాయక చర్యలలో ఈ మూడూ కలిపి సగం ఖర్చు అవుతాయి. జన్‌ధన్‌ యోజన కింద మహిళలకో తలా రూ.500, వృద్ధ వితంతువులకు, పెన్షనర్లకు తలా రూ.1000 చొప్పున మూడు నెలల పాటు ఇస్తారు. ఈ మొత్తం చాలా స్వల్పం. లాక్‌డౌన్‌ కాలంలో వారు పోగొట్టుకున్నది ఇంతకన్నా ఎక్కువే. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులను తట్టుకుని నిలబడాలంటే ఆహార ధాన్యాల పంపిణీ వంటి కార్యక్రమాలతోబాటు దేశం లోని మొత్తం కుటుంబాలలో 80 శాతం కుటుంబాలకి (32 కోట్ల 71 లక్షల కుటుంబాలకు) నెలకు రూ.7000 చొప్పున కనీసం రెండు నెలల పాటు ఉచితంగా ఇవ్వాలని పలువురు ఆర్థికవేత్తలు, మేధావులు, సంస్థలు సూచించాయి. ఇది రెండు నెలలకు కలిపి రూ.3.66 లక్షల కోట్లు అవుతుంది. ఆర్థికమంత్రి ప్రతిపాదించిన స్కీములో ప్రజలకు అదనంగా దక్కేది రూ.34,000 కోట్లు! అంటే అడిగిన దానిలో 10 శాతం కూడా లేదు! అలాగే ఉచితంగా ఇచ్చే సిలిండర్లు కూడా మొత్తం జనాభాకి వర్తించవు. ఉజ్వల పథకం కింద గ్యాస్‌ కనెక్షను తీసుకున్న వారి సంఖ్య పరిమితం. 

జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధి లోకి వచ్చే ప్రజలందరికీ నెలకు తలా 5 కిలోల బియ్యం లేదా గోధుమలు, ప్రతి ఇంటికీ ఒక కిలో పప్పు ఇవ్వనున్నట్లు చేసిన ప్రకటన ఒక్కటే కాస్త ఉపయోగపడేది. దీనికి రూ.45,000 కోట్లు ఖర్చు అవుతాయి. అయితే ఈ స్కీము లోనూ రెండు లోపాలు వున్నాయి. 'జాతీయ ఆహార భద్రతా చట్టం' పరిధి లోకి వచ్చే 80 కోట్ల ప్రజానీకం అంతటికీ వర్తించేలా ప్రస్తుత ప్రజా పంపిణీ వ్యవస్థ లేదు. ముఖ్యంగా తమ కుటుంబాలకు దూరంగా బతికే వలస కార్మికులకు ఎటువంటి సహాయమూ అందదు. పైగా లాక్‌డౌన్‌ కాలంలో రేషను పొందడమే ఒక సమస్యగా వుంటుంది. 

మొత్తం ఆర్థిక మంత్రి ప్యాకేజీ లోనే అంతర్లీనంగా ఈ రెండూ ప్రధాన ప్రశ్నలుగా మిగిలిపోతాయి. మొదటిది : వలస కార్మికులు, రెండోది : సహాయం చేరవలసిన వారికి చేరుతుందా లేదా అన్నది. ఇవి చాలా తీవ్రమైన సమస్యలు. దేశం మొత్తం మీద తమ స్వగ్రామాలకు దూరంగా పనుల్లో ఉన్నవారు 14 కోట్ల మంది కార్మికులు. వీరిలో తమ స్వంత రాష్ట్రాలకు వెలుపల ఉన్నవారు కోటిమందికి పైగా ఉంటారు. ఇప్పుడు బస్‌స్టాండ్ల వద్దా, రోడ్ల మీదా మనకు కనపడుతున్న వీరి సంఖ్య చిన్నదేమీ కాదు. 

అందుకే ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీ చేపట్టాలని పలు సంస్థలు కోరుతున్నాయి. లాక్‌డౌన్‌ కాలంలో చైనాలో ఈవిధంగానే పంపిణీ చేశారు. ఇందుకోసం ఎటువంటి ఏర్పాటూ చేయకుండా నాలుగు గంటల వ్యవధి మాత్రం ఇచ్చి లాక్‌డౌన్‌ ప్రకటించిన మోడీ ప్రభుత్వం...నిజంగా ఎవరికి ప్రభుత్వ సహాయం తక్షణం అవసరమో వారికా సాయం అందకుండా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా పిసినారితనంతో, అనాలోచితంగా వ్యవహరించడం వలన ఇప్పుడు ప్రజా సంక్షేమం బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వాల పైనే పడుతోంది. కార్మిక, రైతు కూలీ సంఘాలు కూడా తమ సభ్యుల రక్షణ కోసం నిలవాల్సిన పరిస్థితి వచ్చింది. కాని రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధులేవీ? ప్రస్తుతం మహమ్మారిపై సాగుతున్న పోరులో ప్రజలను కాపాడుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థికంగా వెసులుబాటు ఉండాలి. అంటే ద్రవ్య వినియోగ నియంత్రణ చట్టం నుండి మినహాయింపు ఉండాలి. దానితోబాటు రుణాలు సేకరించే వీలు కూడా పెరగాలి. రాష్ట్రాలు సేకరించే రుణాల పరిమితులను సడలించాలి. నిజానికి ఈ ఏడాది ఆ పరిమితిని రెట్టింపు చేయాలి. ఈ మహమ్మారికి తోడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యావత్తూ సంక్షోభం లోకి జారిపోతున్న పరిస్థితుల్లో ఈవిధంగా అదనపు ఖర్చుకి ప్రభుత్వాలు సిద్ధపడడం ఏమాత్రమూ వృథా అనిపించుకోదు సరికదా అత్యవసరం అవుతుంది. 

<span 'times="" new="" roman';="" font-size:="" medium;\"="">- ప్రభాత్‌ పట్నాయక్‌