కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఐపిఎల్ మ్యాచ్‌లను ఎలాగైనా నిర్వహించేందుకు బిసిసిఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) సన్నాహాలు చేస్తోందంటూ వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. మార్చి నెలలో ప్రారంభం కావాల్సిన ఐపిఎల్ 2020 మ్యాచ్‌లు దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో భాగంగా ఏప్రిల్ 14 వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలా? సడలించాలా? కొనసాగించాలా? అన్న విషయమై చర్చోపచర్చలు సాగుతున్నాయి. అనేక రాష్ట్రాలు మరికొద్ది రోజులు కొనసాగించాలని కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందన్న విషయంలో స్పష్టత లేదు. ఈ చర్చ సాగుతుండగానే 'ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగమన్న'ట్టు ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వహణ గురించి మాట్లాడటం బిసిసిఐ ఫక్తు వాణిజ్య దృక్పథానికి నిదర్శనం. అనూహ్యంగా విరుచుకుపడిన వైరస్ ధాటికి ప్రపంచమంతా అతలాకుతలం అవుతుండటంతో అత్యంత ప్రతిష్టాత్మకమైనవిగా భావించే ఒలింపిక్స్‌ను ఏడాదిపాటు వాయిదా వేశారు. జపాన్ లోని ఫుకుషిమాలో ఒలింపిక్స్ జ్యోతి ప్రదర్శననూ నిలిపివేశారు. పారా ఒలింపిక్స్ కూడా ఇదే బాట పట్టింది. వింబుల్డన్ మ్యాచ్‌లు కూడా నిరవధికంగా వాయిదా పడ్డాయి. బ్రిటిష్ ఓపెన్ గోల్ఫ్ టోర్నీ రద్దు అయింది. వివిధ దేశాల్లో నిర్వహించే ఫుట్‌బాల్ టోర్నీలు రద్దు కావడమో, వాయిదా పడటమో జరిగాయి. 'పరిస్థితులు సురక్షితంగా ఉండి, క్రీడల నిర్వహణకు అనువుగా ఉన్న సమయంలోనే పోటీలు జరుగుతాయి' అని ప్రీమియర్ లీగ్ ప్రకటించింది. యూరో 2020 వచ్చే ఏడాది జూన్ 11 వరకు వాయిదా వేస్తున్నట్లు యుఇఎఫ్‌ఎ ప్రకటించింది. అంతర్జాతీయ స్థాయితో పాటు, వివిధ దేశాల్లో జరిగే రగ్బీ పోటీలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు రగ్బీ యూనియన్ ప్రకటించింది. బ్యాడ్మింటన్ అసోసియేషన్ కూడా క్రీడాకారులకు సెలవు ఇచ్చింది. క్రికెట్ విషయానికే వస్తే ఇంగ్లండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల టీమ్‌లు విదేశీ పర్యటనలను రద్దు చేసుకున్నాయని, దేశవాళీ మ్యాచ్‌లను వాయిదా వేస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంత! ఈ విషయాలన్నీ బిసిసిఐ పెద్దలకు తెలియవని అనుకోలేం. తెలిసి కూడా, ఐపిఎల్ మ్యాచ్‌ల నిర్వహణ గురించి మాట్లాడుతున్నారంటే కాసుల కక్కుర్తి కాక మరేమిటి?
భారత్‌లో క్రికెట్ ఒక ఆట స్థాయిని దాటి, వేల కోట్ల రూపాయల పంటగా మారిన విషయం కొత్తేమీ కాదు. దేశంలో బిసిసిఐ అత్యధిక సంపన్నమైన క్రీడా సంస్థ. మిగిలిన క్రీడా బోర్డులన్నీ ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తుంటే బిసిసిఐ పరిస్థితి దానికి భిన్నం. ప్రపంచ క్రికెట్ బోర్డుల సంపద విషయంలో కూడా బిసిసిఐ దే మొదటి స్థానం. 2018-19 సంవత్సరంలో అన్ని రకాల ఖర్చులూ పోను రూ.18 వేల కోట్ల ఆదాయాన్ని (ఆపరేటింగ్ ఇన్‌కమ్) బిసిసిఐ ఆర్జించింది. ఒక అంచనా ప్రకారం ఐపిఎల్ సిరీస్ రద్దయితే రూ.3,869 కోట్లను ఆ సంస్థ నష్టపోతుంది. 2018 నుండి 2022 వరకు ఐదు సంవత్సరాల కాలానికి రూ.16,347 కోట్లకు స్టార్ ఇండియా సంస్థ బ్రాడ్‌కాస్టింగ్ హక్కులు కొనుగోలు చేసింది. ఒక్క ఏడాది సిరీస్ జరక్కపోతే ఆ సంస్థ రూ.3,269 కోట్లు నష్టపోతుందని అంచనా. ఆరేడు వందల కోట్ల స్పాన్సర్‌షిప్‌లు కూడా రద్దవుతాయి. క్రీడాకారులకు సిరీస్ ప్రారంభం కావడానికి ముందు 15 శాతం మొత్తాన్ని మాత్రమే ఫ్రాంచైజీలు చెల్లిస్తున్నాయి. సిరీస్ మధ్యలో కొంత, పూర్తయిన తరువాత మరికొంత చెల్లించడం సాంప్రదాయంగా మారింది. సిరీస్ రద్దయితే క్రీడాకారులకు ఆ మొత్తమూ రానట్టే! వీక్షకులు లేకపోయినా ఆడటానికి సై అంటూ కొందరు క్రీడాకారులు చేస్తున్న ప్రకటనను ఈ కోణం నుండే చూడాలేమో! ఇన్ని లెక్కలు, కార్పొరేట్ల లాభాపేక్షలు ఉన్న తరువాత ప్రజల పైన రుద్దడమే తప్ప వారి ప్రయోజనాలు పడతాయా?
విదేశాల నుండి వచ్చిన వారి నుండి కరోనా పెద్దఎత్తున వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఐపిఎల్‌లో ఒక్కో ఫ్రాంచైజీ ఎనిమిది మంది విదేశీ క్రీడాకారులను కలిగి ఉంది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో 64 మంది విదేశీ క్రీడాకారులున్నారు. వారు ఒక్కొక్కరే రారు కదా! వారితో వచ్చే సహాయకులను కూడా పరిగణ లోకి తీసుకుంటే ఆ సంఖ్య సులభంగా వంద దాటుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ఇంత పెద్ద సంఖ్యలో ఒక దగ్గర చేరడం వాంఛనీయమా? నిజానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వంటివి మానసిక ఉల్లాసానికి సంబంధించినవి. ప్రపంచమంతా కరోనా రక్కసి ధాటికి విలవిలలాడుతున్న వేళ సంబరాలు జరుపుకునే స్థితి, వాటిలో ప్రజలు పాల్గొనే పరిస్థితి ఎక్కడుంది? బిసిసిఐ ఈ మాత్రం అలోచించలేదా? 'ఇరవై రెండు మంది మంది ఫూల్స్ ఆడుతుంటే, 22 వేల మంది ఫూల్స్ చూసే ఆట'గా బెర్నార్డ్ షా క్రికెట్‌ను ఎప్పుడో అభివర్ణించారు. క్రీడాభిమానులు దీనిని అంగీకరించకపోవచ్చు కాని పదో, పదకొండో కార్పొరేట్ కంపెనీలు వందల కోట్ల మందిని ఫూల్స్‌ను చేయడం ద్వారా వేల కోట్ల రూపాయలు ఆర్జించడంగా భారత్‌లో నేటి క్రికెట్ మారింది. ప్రస్తుత సంక్షోభ సమయంలోనైనా ఈ వాణిజ్య దృష్టి నుండి బిసిసిఐ బయటపడాలి.