మత విద్వేషాలకు తావివ్వొద్దు

కరోనా మహమ్మారిపై జాతి యావత్తూ ఒక్కటై పోరాడుతున్న వేళ దానిని బలహీనపరిచేలా కొన్ని స్వార్థపర శక్తులు యత్నించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ శతాబ్దం లోనే అతి భయంకరమైన శత్రువుతో ప్రపంచం పోరాడుతోంది. మన దేశంలో దీనిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనేదానిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మత పరంగా సమాజంలో చీలికలకు ఆస్కారమిచ్చేలా వ్యవహరించడం శోచనీయం. కరోనాకు మతం రంగు పులిమేందుకు సోషల్‌ మీడియా లోను, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా సాగుతున్న గోబెల్స్‌ ప్రచారానికి, అధికారంలో ఉన్న పెద్దలకు సంబంధం లేదని అనుకోలేము. కరోనాపై పోరు ప్రకటించిన సమయంలో ఢిల్లీలో వందలాది మందితో సమావేశం ఏర్పాటు చేయడం 'తబ్లిఘీ జమాత్‌' నిర్వాహకుల బాధ్యతారాహిత్యమే. కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. అయితే, తబ్లిఘీ చేసిన పనికి యావత్‌ ముస్లింలను నిందించడమే అభ్యంతరకరం. తబ్లిఘీ ఒక్క సంస్థదే తప్పు అని చెప్పడమూ కరెక్టు కాదు. ఇందులో ప్రభుత్వానికీ బాధ్యత ఉంది. మార్చి 20, 21 తేదీల్లో తబ్లిఘీ నిర్వహించిన రెండో విడత సమావేశాలకు అనుమతి ఎలా ఇచ్చారు? ఈ మత కార్యక్రమానికి దేశ దేశాల నుంచి వచ్చిన వారికి వీసాలు ఎవరిచ్చారు? విదేశాల నుంచి వచ్చేవారికి విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహించిందెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఒక మతాన్ని నిందించడంలో ఔచిత్యమేమిటి? ప్రతి రోజూ కరోనా న్యూస్‌ బులెటిన్‌లో 'తబ్లిఘీ జమాత్‌' వల్ల విస్తరించిన కేసులంటూ విడిగా అంకెలు ఇవ్వడంలో ఆంతర్యం తెలియనిదేమీ కాదు. 

కరోనాపై లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత దేశంలో చాలా చోట్ల మత పరమైన కార్యక్రమాలు, సామూహిక కార్యక్రమాలు సాగాయి. లాక్‌డౌన్‌కు ముందు వివిధ దేశాల నుంచి మన దేశానికి రాకపోకలు జరిగాయి. మత పరమైన, వాణిజ్య పరమైన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, విహార యాత్రల కోసం విదేశాలకు వెళ్లిన వారు, ఇతర దేశాల నుంచి వచ్చినవారు అనేక వేల మంది ఉన్నారు. 2019 మార్చి నాటికి అంతర్జాతీయ యాత్రికులు 6.9 కోట్ల మంది భారత్‌ను సందర్శించినట్లు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. లాక్‌డౌన్‌ ప్రకటించిన సమయంలో పార్లమెంటు సమావేశాలు యథావిధిగా నిర్వహించారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రభుత్వ బల నిరూపణ ఆ సమయంలోనే నిర్వహించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) మార్చి11న ప్రపంచ వ్యాపిత ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటిస్తే, మోడీ ప్రభుత్వం మార్చి 19 వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌లను ఒకటి తరువాత ఒకటి ఆదరాబాదరాగా ప్రకటించింది. దేశంలో అసంఖ్యాక వలస కార్మికులను నానా అవస్థలకు గురిచేసింది. విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు విమానాలు ఏర్పాటు చేసిన మోడీ ప్రభుత్వం, దేశంలో వలస కార్మికులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వీరిని ఆదుకోవడానికి ఎలాంటి చర్యలు చేపట్టకుండా రాష్ట్రాలపైకి ఆబాధ్యతను నెట్టేసింది. మోడీ ప్రభుత్వ నయా ఉదారవాద విధానాల పుణ్యమాని ప్రజారోగ్య వ్యవస్థ అధ్వానంగా తయారైంది. ప్రజారోగ్య వ్యవస్థ ప్రభుత్వం అధీనంలో ఉన్న దేశాలు కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయి. వైద్య, ఆరోగ్య రంగాన్ని కార్పొరేట్ల పరం చేసిన అమెరికా, యూరపు దేశాలు ఇప్పుడు ఎలా విలవిలలాడుతున్నదీ చూస్తున్నాం. ఈ అంశాలపై చర్చ జరగకుండా పక్కదారి పట్టించేందుకు తబ్లిఘీని ఒక తురుపుముక్కగా ఉపయోగించుకుంటోంది. ఢిల్లీలో ప్రార్థనా స్థలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న ఒక వ్యక్తిని కొందరు స్థానికులు చావగొట్టారు. యు.పి లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం తబ్లిఘీలు కరోనా చికిత్సలో అనుచితంగా వ్యవహరిస్తే జాతీయ భద్రతా చట్టం కింద కేసులు పెడతానని బెదిరించింది. దేశం లోని ఈశాన్య ప్రాంత ప్రజలపై అక్కడక్కడ దాడులు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సమయంలో ఇటువంటి విద్వేషపూరిత రాజకీయాలు కరోనా మహమ్మారిపై సమిష్టిగా సాగిస్తున్న పోరాటానికి తీవ్ర విఘాతం కలిగిస్తాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఇటువంటి నీతిబాహ్యమైన రాజకీయాలకు తెర దించి, కరోనాపై పోరులో కుల, మత భేదాలకు తావు లేకుండా అందరినీ కలుపుకు పోవడంపై దృష్టి పెట్టాలి.