వ్యవసాయం లాక్‌డౌన్‌

కరోనా వ్యాప్తి నివారణకు దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అరవై శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ రంగంపై పడే ప్రభావాన్ని పూర్తిగా విస్మరించింది. సర్కారు నిర్లక్ష్య పర్యవసానాలు వ్యవసాయ రంగాన్ని, మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలతో సేద్యం సంక్షోభంలో కూరుకుపోగా కర్షకులు ఆత్మహత్యలబాట పట్టారు. ఆర్థిక మాంద్యం తోడైన ఫలితంగా పరిస్థితి మరింతగా దిగజారింది. సరిగ్గా ఇప్పుడే కరోనా మహమ్మారి కట్టడికి కేంద్రం వెనకాముందు చూడకుండా విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌, కునారిల్లుతున్న వ్యవసాయ రంగంపై పిడుగుపాటైంది. లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న కేంద్రం, దాని వలన నష్టపోయే కొన్ని వర్గాల ఉపశమనానికి రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించగా, అసంఖ్యాకంగా ఉన్న రైతులకు అందేది శూన్యం. సొంత భూమి కలిగిన వారికి అమలు చేస్తున్న పి.ఎం కిసాన్‌ పథకం కింద ఇచ్చే రూ.2000 అడ్వాన్స్‌ తప్ప. ఇది కరోనా ఎఫెక్టుతో సంబంధం లేకుండా ఎటుతిరిగీ ఇచ్చేదే. ఈ సాయం సైతం రైతులందరికీ అందదు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు అసలే లేదు. పి.ఎం కిసాన్‌ పొందే రైతు కుటుంబాలను మోడీ ప్రభుత్వం 14.5 కోట్లుగా అంచనా వేయగా పథకం మొదలై ఏడాదిన్నర కావొస్తున్నా లబ్ధి పొందే కుటుంబాల సంఖ్య 8 కోట్లుగానే ఉంది. కేటాయించిన నిధుల్లో నేటికీ మూడింట రెండు వంతులే ఖర్చయ్యాయి. రైతుల ఆదాయాలను అమాంతం రెట్టింపు చేసేందుకు ఉద్దేశించిన ఈ 'బృహత్తర' స్కీం పరిస్థితి ఇంతలా అఘోరిస్తుండగా, లాక్‌డౌన్‌ ప్రభావిత రైతులకు ఆ పథకాన్నే ప్రత్యేక సాయంగా ప్రచారం చేసుకుంటున్న కేంద్ర సర్కారుకు రైతులను ఉద్ధరించే మనసు కలుగుతుందని ఎవరైనా ఎలా ఆశించగలుగుతారు? వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ వేతనాలు పదో పరకో పెంచడం తప్ప ఆపత్కాలంలో పక్కాగా తగినన్ని పనులు కల్పించే ప్రత్యేక కార్యాచరణ ఏమీ లేదు. 

ఈ ఏడాది ప్రకృతి అనుకూలించడం వలన ఖరీఫ్‌, రబీ కలుపుకొని రికార్డు స్థాయిలో 292 మిలియన్‌ టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులొస్తాయని కేంద్రం అంచనా వేసింది. నిరుటి కంటే 26 మిలియన్‌ టన్నులు అధికం. బియ్యం, గోధుమలు, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు సైతం గతేడాది కంటే పెరుగుతున్నాయి. దేశ స్థూలోత్పత్తి (జిడిపి) రూ.169 లక్షల కోట్లు కాగా అందులో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 15.87 శాతం. ఒక్క రబీ లోనే దాదాపు రూ.5 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ పంటల ఉత్పత్తి జరుగుతుంది. రబీ పంటలు కోతలకొస్తున్న సమయంలో లాక్‌డౌన్‌ వచ్చింది. రవాణా, మార్కెట్లు ఎక్కడికక్కడ నిలిచిపోయిన దరిమిలా ఆరుగాలం కష్టించి పండించిన పంటలను అమ్ముకోలేని దుస్థితి రైతులకు దాపురించింది. మామూలు సమయాల్లోనే దళారులు, వ్యాపారులు రైతులకు ధరలు దిగ్గోసి దోపిడీ చేస్తారు. లాక్‌డౌన్‌ వంటి సమయాల్లో ఇంకా బరితెగిస్తారు. రైతులకు గిట్టుబాటు ధరల సంగతేమో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) సైతం దక్కదు. ధరలు తగ్గితే రైతుల ఆదాయాలు దారుణంగా పడిపోతాయి. మరోవైపు దళారులు, వ్యాపారులు ఆహార ధాన్యాలను రైతుల నుంచి తక్కువకు కొనుగోలు చేసి, అక్రమంగా దాచిపెట్టి, బహిరంగ మార్కెట్‌లో రేట్లు పెంచి ఇష్టారీతిన దోచుకుంటారు. ఇటు రైతులు అటు వినియోగదారులు నష్టపోకుండా ఉండాలంటే ప్రభుత్వం రంగంలోకి దిగి రైతుల నుంచి నేరుగా పంటలు కొనుగోలు చేయాలి. తక్కువ ధరలకు ప్రజలకు నిత్యావసరాలు అందించాలి. గోదాముల్లో మూలుగుతున్న ఆహార ధాన్యాలను లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలందరికీ ఉచితంగా పంచాలి. ఖాళీ అయిన గోదాముల్లో కొత్తగా సేకరించిన పంటలను నిల్వ చేయాలి. కేంద్రం ఈ దశగా ఆలోచన చేయడానికి ససేమిరా అంగీకరించట్లేదు. 

రబీ పంటల సేకరణకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోతే రాబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహార ధాన్యాలను భారత ఆహార సంస్థ (ఎఫ్‌సిఐ) సేకరించని పక్షంలో మార్కెట్‌ ప్రైవేట్‌, కార్పొరేట్ల చేతుల్లోకి వెళుతుంది. అదే జరిగితే కృత్రిమ ఆహార కొరత ముందుకొస్తుంది. ప్రజల ఆహార భద్రత పెను ప్రమాదంలో పడుతుంది. రైతులు, వ్యవసాయ కూలీల ఆదాయాలు పడిపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. దాని ప్రభావం దేశ ఆర్థిక సంక్షోభానికి, జిడిపి కోతలకు కారణమవుతుంది. లాక్‌డౌన్‌ ప్రతికూలతలు తాత్కాలికం కాదు సమీప భవిష్యత్తులో మరింత ముదురుతాయి. దీర్ఘకాల ప్రభావాల దృష్ట్యా కేంద్రం రబీ పంటల కొనుగోలు, సేకరణకు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు తగినన్ని నిధులివ్వాలి. ఆహార పంటలే కాకుండా కమర్షియల్‌, ఉద్యానవన, డెయిరీ, ఆక్వా ఉత్పత్తులకు ధరల స్థిరీకరణ, నిల్వ సామర్ధ్యం పెంపు సదుపాయాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం సైతం పంటల కొనుగోలుపై రైతులకు ఆచరణాత్మక భరోసా ఇవ్వాలి. పొరుగు రాష్ట్రం తెలంగాణ సర్కారును చూసైనా కదలాలి. గ్రామాల్లో ప్రజల ఆదాయాలు పెంచకుండా వస్తువులకు డిమాండ్‌ రాదు. డిమాండ్‌ పడిపోతే ఆర్థిక సంక్షోభం తప్పదు. లాక్‌డౌన్‌ వేళలోనైనా ఈ తత్వాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలకెక్కించుకోవా?