మానవతా మూర్తులు

'ఆరోగ్యమే మహా భాగ్యం' అన్నారు పెద్దలు. ఆ ఆరోగ్యం కాపాడుకోవడమనేది అంత తేలికైన విషయమేమీ కాదు. నేటి ఆధునిక కాలంలో విద్య, ఉద్యోగ వత్తిడులు, సంఘర్షణలు, నగరీకరణ, కాలుష్యం, పర్యావరణ క్షీణత, కల్తీలు వంటి అనేక ఒత్తిడులతో పాటు కార్పొరేటీకరణ తెచ్చిన ప్రమాదం, ప్రకృతి వనరుల దోపిడీ మనిషి అనారోగ్యానికి కారణమౌతున్నాయి. ఆధునిక పోకడలు పెరిగిపోతున్న కొద్దీ మనిషి శరీరంలో రోగనిరోధక శక్తి రోజురోజుకు తగ్గుతోంది. ప్రస్తుతం మానవాళిని వేధిస్తున్న అనేక ఆరోగ్య సమస్యలతో పాటు రోజుకో కొత్త వైరస్‌ పుట్టుకొచ్చి, మానవాళిని ముప్పుతిప్పలు పెడుతోంది. వీటికి మానవ తప్పిదాలే చాలా వరకు కారణం. ఎవరైనా దగ్గినా తుమ్మినా దూరంగా జరిగే రోజులివి. అలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ సైనికుల్లా ధైర్యంగా నిలబడి, తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి సేవలందించే మహనీయులు వైద్యులు, నర్సులు. రోగులకు డాక్టర్లు ఇచ్చే ఔషధం ఎంత ముఖ్యమో, నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యం. తెల్లని దుస్తులు, నెత్తిమీద చిన్నటోపీ, చెరగని చిరునవ్వు, ఆప్యాయమైన పలకరింపులతో తిరుగుతూ, చీకటి ఆకాశపు ఆసుపత్రుల్లో వెలుగులు నింపే జాబిలమ్మలు - నర్సులు. గ్రామాల్లో కనిపించే ఆశావర్కర్లు, మంత్రసానులు సైతం రోగులకు కొండంత ఆసరా. ఎంతటి బాధలో వున్నవారికైనా ఓదార్పునిచ్చే వారి మాటలు రోగులకు సగం బలం. వారి సేవాతత్పరత సగం రోగాన్ని అప్పుడే తగ్గిస్తుంది. ఆసుప్రతులకు వెళ్లక తప్పని నేటి రోజుల్లో... పుట్టిన బిడ్డకు తొలిస్పర్శ ఆమెదే, చనిపోయే ముందు చివరిచూపూ ఆమెదే. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంతవరకు ఏదోక సమయంలో ఆమె స్పర్శ లేకుండా, ఆమె సేవలు పొందకుండా ఈ జీవిత గమనం ముగియదంటే అతిశయోక్తి కాదేమో. రకరకాల జబ్బులతో ఆస్పత్రులకు వచ్చే రోగులకు ముందుగా మనోధైర్యాన్ని అందించేది, వారిని ఆరోగ్యవంతులను చేయడంలో కీలకపాత్ర వహించేది నర్సులే. ఎందుకంటే డాక్టర్ల కంటే రోగులతో ఎక్కువ సమయాన్ని గడిపేది వారే. 'లేడీ ఆఫ్‌ ది ల్యాంప్‌' ఫ్లోరెన్స్‌ నైటింగేల్‌ అందించిన సేవలకు గుర్తుగా ఇప్పటికీ లాంతరు పట్టుకున్న స్త్రీ బొమ్మను నర్సులకు ప్రతీకగా చూపుతారు. 

ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులతో పాటు నర్సులు, ఆశావర్కర్లు, ఇతర వైద్య సిబ్బందిదే కీలక పాత్ర. తమ ప్రాణాలను పణంగా పెట్టి, కరోనాతో యుద్ధం చేస్తున్నారు. ఈ యుద్ధంలో ఎవరైనా వైద్య సిబ్బంది ప్రాణాలు పోగొట్టుకుంటే, వారికి కోటి రూపాయలు ఇస్తామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడం... వీరి సేవలకిచ్చిన ఒక గౌరవమే తప్ప వెలకట్టడం ఎంతమాత్రమూ కాదు. ముఖ్యంగా ఈ యుద్ధంలో ప్రముఖ పాత్ర నర్సులది. కరోనా రక్కసి ఒకవైపు భయపెడుతున్నా.. ముఖానికి పెట్టుకున్న మాస్క్‌ జారి పోతుందనో, కళ్లద్దాలు కళ్లను సరిగా కవర్‌ చేస్తున్నాయో లేదోననో, చేతికున్న గ్లౌజులు సరిగా వున్నాయో లేదో అనే భయం వెంటాడుతున్నా, ఆరు గంటల పాటు ఏకధాటిగా కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా, వాష్‌రూమ్‌లకు సైతం వెళ్లకుండా, శారీరకంగా, మానసికంగా ఆలసిపోతున్నా... ఒక లక్ష్యంతో, దీక్షతో కరోనా కురుక్షేత్రంలో పోరాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులకు సేవలందించడంలో కేరళ నర్సులు ముందు వరుసలో వున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదిక ప్రకారం... ప్రపంచ వ్యాప్తంగా కేరళ నర్సులే ఎక్కువ మంది సేవలందిస్తున్నారు. ఒకవైపు క్యూబా తమ వైద్య బృందాలతో దాదాపు అన్ని దేశాలకూ సేవలందిస్తోంది. మరోవైపు మినీ క్యూబాగా పిలవబడే కేరళ కూడా అదే స్ఫూర్తితో సేవలందిస్తున్నారు. ఒక్క అమెరికా, బ్రిటన్‌ లలోనే 30 శాతం మంది కేరళ నర్సులు తమ సేవలందిస్తున్నారు. చీకటితో యుద్ధం చేస్తోన్న ప్రపంచానికి కేరళ నర్సులు దేవతామూర్తులుగా కనిపిస్తున్నారు. 'మీరే నిజమైన దేవతలు' అంటూ ప్రజలు కీర్తిస్తున్నారు. 

నాలుగు డబ్బులిస్తే ఈ సేవ ఎవరైనా చేస్తారనుకునే మూఢులూ వున్నారు. కొన్ని సమయాల్లో తల్లిదండ్రులు తమ బిడ్డలకు గాని, బిడ్డలు తమ తల్లిదండ్రులకు గాని సేవలు చేయాలేని పరిస్థితులు వుంటాయేమోగాని, వ్యాధుల బారిన పడినవారికి సేవలు అందించని నర్సులు వుండరు. నర్సుల వృత్తికి సంబంధించి ఎవరికీ కనిపించని మరో కోణమూ ఉంది. చాలీచాలని జీతాలు, అర్థాకలి జీవితాలు, కొందరు డాక్టర్ల వేధింపులు, తిట్లు, చీదరింపులు పైకి కన్పించని వైనాలివి. అయినా పెదవులపై చిరునవ్వును, హృదయంలో వృత్తి పట్ల అంకిత భావాన్ని కనబరిచే నర్సులు... రోగుల జీవితాల్లో వెలుగులు నింపే వెలుగుదివ్వెలు. అందుకే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది ఏప్రిల్‌ 7న కూడా 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' ఒక థీమ్‌ని నినాదంగా తీసుకుంది. 'నర్సులు, మంత్రసానుల సేవలకు మద్దతుగా నిలవాలనే' నినాదంతో ఆ రోజు సూర్యోదయం నుంచే అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోడీ.. నర్సులకు కనీస సౌకర్యాలు కల్పించకపోయినా, ప్రస్తుత కీలక సమయంలో వారి సేవలకు గుర్తింపుగానైనా వారికి సంఘీభావం ప్రకటించి, వారి సేవలకు గుర్తింపుగా దీపాలను వెలిగించాలని పిలుపు ఇచ్చి వుంటే అభినందనీయంగా వుండేది. 'ప్రార్థించే పెదవుల కన్నా... సాయం చేసే చేతులు మిన్న' అన్న మదర్‌ థెరిస్సా స్ఫూర్తి నేడు ప్రపంచానికి అవసరం. ఒక తపస్సులా సేవలందిస్తోన్న వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, పారామెడికల్‌ సిబ్బందికి మద్దతుగా నిలవడం మన ధర్మం. వారి మానవత్వానికి పాదాభివందనం.