బిజెపి నేడు ఇఫ్తార్‌ విందు

రంజాన్‌ పవిత్ర మాసం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వ ర్యంలో బుధవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్‌ ఎదురుగా హాజ్‌ హౌస్‌ పక్కన గల రెడ్‌రోస్‌ పంక్షన్‌ హాలులో 15వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ ఇఫ్తార్‌ విందు జరుగు తుందని ఆయన పేర్కొన్నారు. బిజెపి మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హనీఫ్‌అలీ అధ్యక్షతన జరిగే ఈ ఇఫ్తార్‌ విందు కార్యక్రమంలో కేంద్ర మైనార్టీ, పార్లమెంటరీ వ్యవహరాల మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధర్‌రావు, బిజెపి శాసనసభా పక్షం నేత డాక్టర్‌ కె. లక్ష్మణ్‌లతో పాటు బిజెపి జాతీయ, రాష్ట్ర సీనియర్‌ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని ఆయన వెల్లడించారు. ముస్లిం సోదరులు పెద్దఎత్తున ఈ ఇఫ్తార్‌ విందులో పాల్గొనాలని కిషన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.