ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన కేంద్రబడ్జెట్

ఈ రోజు లోకసభలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన
బడ్జెట్ రాష్ర్టానికి తీరని అన్యాయం చేసింది. ప్రత్యేకహోదా గురించి అసలు
ప్రస్తావించనే లేదు. విభజన చట్టంలో పేర్కొన్న ఏ పథకాలకు నామక: నిధులు
కేటాయించారు. గిరిజన, సెంట్రల్, పెట్రోలు విశ్వవిద్యాలయాలకు బిక్షం
విదిలించినట్లుగా నాలుగైదు కోట్లు చొప్పున కేటాయించారు. ప్రతిష్టాత్మకంగా
భావిస్తున్న రాజధాని, జాతీయ ప్రాజెక్టుగా ఉన్న పోలవరంలకు పైసా కూడా
కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది పట్ల కేంద్ర ప్రభుత్వానికి
చిత్తశుద్ది లేదనడానికి ఇది నిదర్శనం. మన రాష్ట్రం పట్ల కొనసాగుతున్న
వివక్షను సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. రాష్ట్ర
ప్రజలు, రాజకీయపార్టీలు ప్రత్యేకించి అధికారపార్టీగా ఉన్న వైయస్సార్
కాంగ్రెసు యంపీలు, రాష్ట్ర ప్రభుత్వం ఈ వివక్షతను ఎదుర్కొని ప్రశ్నించాలని
విజ్ఞప్తి చేస్తున్నాము. 
ఈ బడ్జెట్ కార్పోరేట్ కంపెనీలకు పెద్దపీట వేసింది. లక్షలాది కోట్ల
రాయితీలు కల్పించారు. బ్యాంకులకు చెల్లించకుండా ఎగ్గొట్టిన బాకీలను
రాబట్టడానికి, వారిపై చర్యలు తీసుకోడానికి ఈ బడ్జెట్లో ఎలాంటి చర్యలు
తీసుకోలేదు. విదేశీ కంపెనీలకు రాయతీలిచ్చింది. మరోవైపు రైతులకు,
కార్మికులకు ఎలాంటి రాయితీలు ఇవ్వలేదు. పెట్రోలు ధర రెండు రూపాయలు పెంచడం
రానున్న రోజుల్లో ధరలు పెరగడానికి దారి తీస్తుంది. 
యువతకు ఉపాధి కల్పించేందుకు ఎలాంటి పథకాలూ ప్రకటించలేదు. రైతులకు
గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. గ్రామీణ ఉపాధి పథకానికి
ఐదు వేల నాలుగువందల కోట్లు కోత పెట్టడం రానున్న రోజుల్లో గ్రామీణపేదల
బతుకులు వీధినపడటమే కాదు ఈ పథకానికే ఎసరు పెట్టే  అవకాశం ఉంది. అతిపెద్ద
ఉపాధి కల్పనకు కేంద్రంగా ఉన్న రైల్వేలను ప్రైవేటీకరించడం భవిష్యత్తులో
చార్జీలు పెరగడానికి దారి తీస్తుంది. 
విద్య, వైద్యం, ఇళ్లనిర్మాణం లాంటి పథకాలకు నిధులు తగ్గించారు. ఎస్సీ,
ఎస్టీ సబ్ ప్లాను ఎత్తేయడమే కాకుండా నిధులపై కోత విధించారు. 17శాతంగా ఉన్న
ఎస్సీలకు 2.9 శాతం, 7శాతంగా ఉన్న ఎస్టీలకు 1.9 శాతం కేటాయించారు. సంక్షేమ
నిధుల్ని కేటాయించే బాధ్యతను కార్పోరేట్ కంపెనీలపై పెట్టడం  దారుణం. 
ప్రభుత్వరంగ సంస్థల నుండి ఈ బడ్జెట్లో ఖజానాకు లక్ష 64వేల కోట్ల రూపాయిలు
వస్తున్నదంటే అవి నిర్వహిస్తున్న ప్రాత ఏమిటో అర్దమవుతుంది. కానీ బంగారు
బాతును కోసి ఒకేసారి గడ్లు తీసుకున్న విధంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేసి
లక్ష 5 వేల కోట్లు ఆదాయాన్ని చూపెట్టడం సిగ్గుచేటు. ఇన్సూరెప్సురంగంలోకి
నూరుశాతం విదేశీ పెట్టుబడుల్ని అనుమతించడం ప్రజలపై అదనపు భారాలను
మోపుతుంది. కాకుల్ని కొట్టి గద్దలకు వేసినట్లుగా దేశ సంపదను కార్పోరేట్లకు
కట్టబెట్టడం  దారుణం. 
ఈ బడ్జెట్ కాకిలెక్కలతో ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది. విదేశీ,
స్వదేశీ కార్పోరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేదిగా ఉంది. ఈ బడ్జెట్పైపై
నిరసన తెలియచేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి విజ్ఞప్తి
చేస్తున్నాము.

పి. మధు
రాష్ట్ర కార్యదర్శి