
'ఒక ర్యాంకు ఒకే పింఛను' (ఓఆర్ఓపి) అమలు కోసం రిటైర్డు ఆర్మీ సుబేదార్ ఆత్మహత్య, తదనంతర పరిణామాలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయి. జై జవాన్ అని నినదించిన గడ్డపైనే దేశానికి సేవ చేసిన జవాన్లు అత్యంత దయనీయమైన రీతిలో తనువు చాలించే పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఇందుకు ప్రభుత్వం సిగ్గుతో తలవంచుకోవాల్సింది పోయి చనిపోయిన రిటైర్డు సుబేదార్ మానసిక స్థితి ఏమిటో మొదట పరిశీలించాలని వికె సింగ్ వంటి మంత్రులతో ప్రకటనలు ఇప్పించడం అత్యంత గర్హనీయం. మోడీ సర్కార్‌కు మాజీ సైనికోద్యోగులన్నా, వారి ప్రాణాలన్నా, ప్రజాస్వామ్య విలువలన్నా ఏమాత్రం గౌరవం లేదనడానికి బుధ, గురువారాల్లో దేశ రాజధానిలోను, రాజస్థాన్‌లోను చోటుచేసుకున్న అరెస్టులు, నిర్బంధాలే నిలువెత్తు నిదర్శనం. ఓఆర్ఓపి అమలులో జాప్యంపై చాలా కాలంగా పోరాడుతున్న మాజీ సుబేదారు రామ్ కిషన్ గ్రేవాల్, మరో అయిదుగురు మాజీ సైనికోద్యోగులను వెంట తీసుకుని రక్షణమంత్రిని కలిసి తమ గోడు వెళ్లబుచ్చు కుందామని ప్రయత్నిస్తే వారికి మంత్రి అపాయింట్మెంట్ నిరాకరించారు. వారిని ఆ ఛాయలకే రానివ్వలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాజీ సుబేదార్ మంత్రి నివాసం ఎదుట పార్క్‌లో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి గ్రేవాల్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వ నిర్వాకమే తన తండ్రిని బలితీసుకుందని విమర్శించినందుకు గ్రేవాల్ కుమారుడ్ని అరెస్టు చేసింది. ఇదీ మోడీ ప్రభుత్వ మార్క్ దేశభక్తి! చనిపోయిన జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రతిపక్ష పార్టీల నాయకులను, చివరికి ఢిల్లీ ముఖ్యమంత్రిని సైతం వదలకుండా అరెస్టు చేయడం ద్వారా ఎమర్జన్సీ నాటి పరిస్థితిని మోడీ తలపించారు. ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం కనీస మర్యాద. దానిని కూడా గౌరవించకుండా ప్రతిపక్ష నేతలను, రాష్ట్ర ప్రభుత్వాధినేతను నిర్బంధించడం ప్రభుత్వంలో అసహనం ఎంతగా పెరిగిపోయిందీ తెలియజేస్తోంది. 2014 పార్లమెంటు ఎన్నికల సమయంలో తాను అధికారంలోకి వస్తే మొట్ట మొదట సంతకం ఓఆర్ఓపి ఫైలుపై చేస్తానని చెప్పి మోడీ అధికారంలోకి వచ్చారు. ఆ హామీనే అమలు చేయమని సాయుధబలగాల సిబ్బంది కోరుతున్నారు. దేశం కోసం సరిహద్దుల్లో ఎముకలు కొలికే చలిలో సైతం రక్షణ బాధ్యతలు నిర్వహించిన సైనికోద్యోగులు జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్షకు దిగాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వమే కల్పించింది. జై జవాన్ అన్న నినాద స్ఫూర్తికే ఇది విరుద్ధం. ఓఆర్ఓపి అమలు చేయాలని కోరుతూ ఒక ఉద్యమం, అమలు చేస్తామని హామీ ఇచ్చిన తరువాత కూడా దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పండని కోరుతూ ఒక ఉద్యమం, తేదీ ప్రకటించిన తరువాత కూడా వాటిని సరిగ్గా అమలు చేయాలని కోరుతూ ఇంకో ఉద్యమం ఇలా అవిశ్రాంతంగా పోరాడుతూనే వున్నారు. వారికి దేశమంతా సంఘీభావం పలికింది. వామపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు వారి డిమాండ్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయ. ప్రభుత్వం మాత్రం ప్రతి దశలోనూ వారిపై అణచివేతకు పూనుకుంది. జంతర్ మంతర్ వద్ద మాజీ సైనికులపై విచక్షణా రహితంగా ఆనాడు లాఠీచార్జి చేయించింది. పార్లమెంటులో దీనిపై ప్రతిపక్షాలు నాడు నిలదీస్తే ప్రభుత్వం ఎదురు దాడికి దిగింది. ఓఆర్ఓపి అమలుకు అవసరమైన 8,600 కోట్లు ఎక్కడి నుంచి తెస్తామని కొంటెగా ప్రశ్నించింది. కార్పొరేట్లకు ఏటా బడ్జెట్లో 5లక్షల కోట్లకుపైగా పన్నుల రూపేణా రాయితీలిచ్చే ప్రభుత్వం దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన జవాన్ల సంక్షేమానికి నిధులు కేటాయించాల్సి వచ్చేసరికి బీద అరుపులు అరవడం దాని వర్గ నైజాన్ని తెలియజేస్తోంది. మాజీ సైనికోద్యోగుల న్యాయసమ్మతమైన డిమాండ్ పట్ల మోడీ ప్రభుత్వం మొదటి నుంచి నేరపూరితమైన నిర్లక్ష్యాన్నే ప్రదర్శిచింది ఓఆర్ఓపి అమలు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వం దానికి అనేక షరతులు పెట్టి ఆచరణలో నిర్వీర్యం చేసింది. దీనిపై ఆగ్రహించిన సాయుధ బలగాల సిబ్బంది మళ్లీ రోడ్డెక్కి అన్ని ప్రధాన పట్టణాల్లోనూ ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఒక ర్యాంకు ఒకేపింఛన్ను ప్రతి సంవత్సరం ప్రతి యేటా కాకుండా అయిదు సంవత్సరాలకొకసారి సమీక్షిస్తామని చెప్పడం ఓఆర్‌ఓపిని నీరుగార్చే చర్య తప్ప మరొకటి కాదు. ఇటువంటివే ఇందులో అనేక లొసుగులున్నాయి. వీటిని సవరించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ సిద్ధంగా లేదు. ఓఆర్‌ఓపిపై అసత్య ప్రచారం చేస్తూ రాజకీయం చేయడం ప్రభుత్వానికి తగని పని. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి ఓఆర్ఓపిలో మొదట ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేయాలి. జీవిత చరమాంకంలో అనేక ఇబ్బందులెదుర్కొంటున్న మాజీ సైనికోద్యోగులకు ఊరట కల్పించాలి.