
అమరజీవి పరుచూరి నాగేశ్వరరావు భవన్ ప్రజాసంఘాల ఉద్యమ కేంద్రంగా భాసిల్లాలని వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత అధ్యక్షులు పాటూరు రామయ్య అన్నారు. చెంచుపేటలో ప్రజా సంఘాల కార్యాలయ (కామ్రేడ్ పరుచూరి నాగేశ్వరరావు భవన్) నిర్మాణానికి ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సిఐటియు డివిజన్ అధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి అధ్యక్షత వహించారు. పాటూరు మాట్లాడుతూ పేరెన్నికగన్న ఎంతో మంది నాయకులు తెనాలి ప్రాంతంలో ఉన్నారని, వారిలో పరుచూరి నాగేశ్వరరావు ఒకరని చెప్పారు. కూలి, చేనేత, దేవాదాయ భూముల ఉద్యమ విజయాల్లో నాగేశ్వరరావు ఎంతో కీలకంగా వ్యవహరించారని, ఎందరికో ఉద్యమపాఠాలు నేర్పారని తెలిపారు. తానూ ఆయనతో కలిసి పనిచేశానని గుర్తుచేశారు. సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాల ఫలితంగా ధనికులు, పేదల మధ్య అసమానతలు పెరుగుతున్నాయని, సంస్మరణలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే ప్రజాసంఘాల కర్తవ్యంగా ఉండాలని అన్నారు. గ్రామాల్లో పనుల్లేక కూలీలు వలసబాట పడుతున్నారని, వారిని ఐక్యం చేసి పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో ఏడాదికి మాగాణిలో 90 రోజులు, మెట్ట భూముల్లో 150 రోజుల మినహా పనులు దొరక్క వలసలు పెరుగుతున్నాయన్నారు. సమస్యలపై పోరాటం ద్వారా ప్రజాసంఘాల కార్యాలయంను కేంద్రంగా మలచుకోవాలని, కార్యాలయ నిర్మాణానికి పెద్దలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు ప్రజావైద్యశాల డాక్టర్ పరుచూరి అజరుకుమార్ మాట్లాడుతూ లావు బాలగంధరరావు, జెట్టి శేషారెడ్డి, నాగేశ్వరరావు స్ఫూర్పిత్తోనే ప్రజావైద్యుడుగా ఉన్నానన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ పెరుగుతున్న ప్రజాఉద్యమాలను మరింత విస్తరించడానికి, బలపర్చడానికి పరుచూరి భవన్ తోడ్పడాలని ఆకాంక్షించారు.