
జిల్లాలోని జికె.వీధి మండలంలోని 8 పంచాయతీలకు చెందిన 50 గ్రామాలకు నిరంతం విద్యుత్ సదుపాయం కల్పించాలని, సోలార్ విద్యుత్ కాంట్రాక్టర్‌పై చర్య తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం నేతృత్వంలో ఆయా గ్రామాల నాయకులు మంగళవారం ఎపిఇపిడిసిఎల్ డైరెక్టర్ (ఆపరేషన్ ప్రాజెక్టులు) బి.శేషుకుమార్, చీఫ్ జనరల్ మేనేజర్ విజయలలితలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లోకనాధం మాట్లాడుతూ జికె.వీధి మండలానికి చెందిన దారకొండ, ఎ.దారకొండ, గాలికొండ, పెదవలస, దేవరాపల్లి, వంచుల, జర్రెల పంచాయతీల్లో ప్రభుత్వం కోట్లాది రూపాయలతో సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసినా గ్రామాలకు ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉండటంతో స్తంబాలు నిరంతరం మరమ్మతుకు గురవుతున్నాయని పేర్కొన్నారు. శీతాకాలంలో దట్టమైన పొగమంచుతో ఛార్జింగ్ అవడం లేదన్నారు. సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసి ఐదేళ్లుపూర్తి కాకుండానే మరమ్మతులకు గురైందని, దీంతో గిరిజనులు కిరోసిన్ దీపాలతో బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాసిరకం మెటీరియల్‌తో సోలార్ నిర్మించడం వల్ల మరమ్మతులకు గురవుతున్నాయని, దీనిపై సంబంధిత కాంట్రాక్టర్‌కు తెలియజేసినా ఆయన పట్టించుకోవడం లేదని తెలిపారు. శాశ్వత విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఎలక్ట్రికల్ మెటీరియల్‌ను 5 నుంచి 20 కిలోమీటర్ల వరకు కాలినడకన తీసుకెళ్లే కూలీలకు కాంట్రాక్టర్ రవాణా ఖర్చులు ఇవ్వలేదని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీలేరు నుండి నిరంతర విద్యుత్ అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.
దీనికి స్పందించిన ఇపిడిసిఎల్ డైరెక్టర్ బి.శేషుకుమార్ మాట్లాడుతూ సోలార్ మరమ్మతులకు 5 సంవత్సరాలు గ్యారంటీ ఉన్నా పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోలార్ కాకుండా శాశ్వత విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.