
వ్యాపం అంశంపై దర్యాప్తు చేపట్టా ల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్ర నేర దర్యాప్తు సంస్థ (సి.బి.ఐ.)ని ఆదేశించింది. వరుస హత్యలతో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఈ వ్యవహారంలో ఒక కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంగతి గురువారం వెలుగులోకి వచ్చింది. దీంతో వ్యాపం మృతుల సంఖ్య 46కు చేరింది. వ్యాపం కుంభకోణం మామూలు అవినీతి కుంభకోణం లాంటిది కాదని, రాజకీయ పెద్దలకు, మాఫియా కలగలిసి నడిపిన పెద్ద కుంభకోణమని ఈ హత్యా పరంపర చూస్తే అర్థమవుతున్నది. ఈ మొత్తం వ్యవహారానికి నైతిక బాధ్యత వహించి మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌చౌహాన్ తక్షణమే తన పదవి నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్, వామపక్షాలు డిమాండ్ చేశాయి. చౌహాన్‌కు, ఆయన భార్యకు ఈ కుంభకోణంతో సంబంధ ముందని కాంగ్రెస్ నా యకులు బహిరంగంగా ఆరోపించారు. ఈ కుంభ కోణంలో గవర్నరు నరేష్ యాదవ్‌కు ప్రమేయ మున్నట్లు దర్యాప్తులో తేలినా ఆయనపై ఎందుకు చర్య తీసుకోలేదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఈ అంశం సుప్రీం కోర్టు ముందుకు విచారణకు రాగానే, వ్యాపం స్కామ్‌కు సంబంధించిన కేసులన్నిటి సి.బి.ఐ.కి అప్పగిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. అంతకుముందు ఈ కేసును సుప్రీం కోర్టు స్వయంగా పర్యవేక్షించాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కోరారు. కేసును సిబిఐకి అప్పగించాలంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను వాయిదా వేసిన మధ్యప్రదేశ్ హైకోర్టుపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బంతిని సుప్రీం కోర్టు పరిధిలోకి నెట్టి చేతులు దులుపుకునేందుకు ప్రయత్నించిందని మధ్యప్రదేశ్ హైకోర్టు వైఖరిని ప్రధాన న్యాయమూర్తి తప్పుపట్టారు. ఈ కేసులో ఇకపై ఒక్క ప్రాణం పోయినా తాము సహించబోమని జస్టిస్ దత్తు స్పష్టం చేశారు. వ్యాపం కుంభకోణంలో ప్రమేయమున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్ గవర్నర్‌ను రామ్‌నరేశ్ యాదవ్‌ను పదవినుండి ఎందుకు తప్పించకూడదో నాలుగు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గవర్నర్ రామ్‌నరేశ్ యాదవ్‌లను ఆదేశించింది. ఈ కుంభకోణంలో గవర్నర్‌కు వ్యతిరేకంగా నమోదయిన ఎఫ్ఐఆర్ను గత మే 5న హైకోర్టు కొట్టివేసిందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు వివరించారు. ఈ తీర్పు ద్వారా హైకోర్టు కొత్త సంప్రదాయానికి తెరతీసిందనీ, ఉన్నత స్థాయిలో వున్న వ్యక్తిపై ఎఫ్ఐఆర్ను కూడా నమోదు చేయటానికి వీలులేదనీ కోర్టు తన తీర్పులో వెల్లడించిందని సిబల్ అన్నారు. అభియోగాలు ఎదుర్కొంటున్న గవర్నర్‌ను వెంటనే పదవినుండి తప్పించాలని ప్రతిపాదనలు పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సిబల్ చేసిన వినతిని కోర్టు తిరస్కరించింది.