
దళితులపై దాడులు నివారించాలంటే మహాత్మగాంధీ చెప్పినట్టుగా 'మనసు' మార్చుకుంటే సరిపోదని, అణగారిన వర్గాలకు ఆర్థిక సాధికారత కల్పించాలని సీపీఐ(ఎం) రాజ్యసభాపక్ష నేత సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. దళితులపై దాడులు చేసేందుకు నూతన ద్వారాలు తెరిచిందని విమర్శించారు. గోసంరక్షణ, యూనివర్శిటీలు, అవమానకర వ్యాఖ్యలు ఇవన్నీ అందులో భాగమని చెప్పారు. దళితులపై బీజేపీ ఆలోచనా వైఖరిలో మార్పురావాలన్న ఏచూరి... సమాజంలో ఆధ్యాత్మిక ఆలోచనలకు బదులు రాజ్యాంగంలో పేర్కొన్నట్టుగా శాస్త్రీయ దృక్పథం పెంపొందించాల్సిన అవసరముందన్నారు.